యజమాని చెల్లించే జీతభత్యాల్లో ‘‘ఇంటద్దె అలవెన్సు’’ ఒక ముఖ్యమైన అంశం. పెద్ద అంశం. దీని వెనుక రహస్యం ఏమిటంటే ‘‘ఇంటద్దె అలవెన్స్’’తో పన్నుపరంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు. ఇతర అలవెన్సుల కన్నా ఇక్కడ అవకాశమూ, వెసులుబాటు ఎక్కువ.
తండ్రి పేరు మీద ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో ఉంటూ, తండ్రికి అద్దె ఇచ్చినట్లు రసీదు చూపించి, ఇంటద్దె అలవెన్స్‌కి పూర్తిగా మినహాయింపు పొందే సుపుత్రులు ఎందరో. ఈ కట్టుకథని నిజం చేయాలంటే నిజంగానే తండ్రి అకౌంటులో అద్దె జమ చేయండి. తండ్రి ఆదాయంలో ఈ మొత్తాన్ని ఆదాయంగా చూపించి బైటపడండి. ఇలా అద్దె పుచ్చుకున్న వారు ట్యాక్స్ లిమిట్స్‌లోకి రాకుండా జాగ్రత్త పడండి.. నాన్నకు ప్రేమతో నమస్కారం పెట్టండి. ‘‘ఇల్లరికంలో ఉంది మజా’’ అంటూ మావగారింట్లో పూర్తిగా తిష్టవేసిన అల్లుళ్లు ఉన్నారు. ‘‘అల్లుడా ..మజాకా’’ అని మావగారు భయపడకుండా పైన చెప్పినట్లు చేయండి. అలా చేస్తే ఉభయకుశలోపరి.
ఆఫీసులోని అధికారితో గల ప్రేమో, అభిమానమో, నాటకమో, చొరవో, చనువో .. దొంగ రసీదు ఇచ్చి క్లెయిం చేసే ప్రబుద్ధులెందరూ. స్వర్గంలో ఉన్న కుటుంబ సభ్యుల పేరుతో రసీదు, లేని ఇంటి నంబరుతో రసీదు, తప్పుడు ఇంటి పేరు మీద రసీదు, నాన్ రెసిడెంటు సంతానం పేరున రసీదు, భార్యభర్తలు కలిసి ఉంటూ ఒక ఇంటి మీద చెరొక రసీదు లేదా చెరొక ఇంటి నంబరుతో రసీదు, కుడి చేత్తో ఒక రసీదు .. ఎడమ చేత్తో ఒక రసీదుపై సంతకాలు పెట్టడం .. తన పేరు మీద ఇల్లున్నా ఏదో ఒక నంబరుపై రసీదు చూపించడం వంటివి ఎన్నో జరుగుతుంటాయి. హైదరాబాదులో అసలే ఇంటి నంబర్లు పది అంకెలు దాటి ఉంటాయి. ఒకో నంబరుకు నాలుగు బైలు(/) .. రెండేసి ఇంగ్లీషు అక్షరాలు కూడా ఉంటాయి. పోస్ట్‌మ్యాన్‌కి దొరక్కపోవచ్చు. గూగుల్ మ్యాప్‌కి కూడా అందకపోవచ్చు. కానీ డిపార్టుమెంటుకు తెలిసే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: ఉన్నత విద్య కోసం.. ఇంటర్నేషనల్ ఫండ్స్ గురించి తెలుసా?
ఈ డమ్మీ ఆటకు పేకాటలో ‘‘రమ్మీ’’లో జోకర్‌లాంటి వెసులుబాటు ఉంది. మీకు ఉపశమనం కూడా లభిస్తుంది. మీరు ఎవరినైతే సృష్టించారు ఆ వ్యక్తి నిజంగానే ఉండాలి. ఆ ఇల్లు ఆ వ్యక్తి పేరు మీద ఉండాలి. అప్పుడు అద్దెను వారు తమ ఆదాయంగా డిక్లేర్ చేసి, ఇన్‌కంట్యాక్సు రిటర్నుల్లో ఇన్‌కమ్‌గా వేయాలి. పన్ను పరిధిలోకి రాకపోతే సమస్య లేదు. తక్కువ శ్లాబులు పడ్డా మీకు లాభమే. పన్ను భారం తగ్గకపోతే ఆ జోలికి వెళ్లకండి. లక్ష రూపాయల్లోపల రసీదులు అడగరు. బీ హ్యాపీ.
ఇదీ చదవండి: ఫ్లెక్సీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్.. దీర్ఘకాలంలో తిరుగులేని పనితీరు!
జీవిత భాగస్వామి పేరు మీద ఇల్లు ఉండి, ఆ వ్యక్తి పన్ను పరిధిలోకి రాకపోతే ఈ ప్లానింగ్ చేయండి. కానీ నిజంగా చెల్లించడం, అటు పక్క వ్యక్తికి ఆదాయంగా చూపించడం, నిజమైన రసీదు, నిజమైన డిక్లరేషన్స్‌తో అంతా నిఖార్సయిన వ్యవహారంగా ఉండాలి. ఎందుకంటే, డిపార్ట్‌మెంట్ వారి దగ్గర దొంగ రశీదుల వ్యవహారం రుజువులతో సహా ఉంది. అద్దె విషయంలో అవకతవకలకు పాల్పడకండి.
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌కు పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment