సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై ఏడు రకాల విశ్లేషణలు చేసిన సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ కేంద్ర వేతన సంఘం (సీపీసీ) మాదిరిగానే ఇవ్వాలని సిఫారసు చేసింది. 11వ పీఆర్సీ నివేదికను సోమవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందచేసిన అనంతరం వెలగపూడి సచివాలయంలో కార్యదర్శుల కమిటీ సభ్యులతో కలసి సీఎస్ మీడియాతో మాట్లాడారు. అధికారుల కమిటీ మూడు సార్లు సమావేశమైందని, ఉద్యోగ సంఘాలతో ఒకసారి సమావేశం నిర్వహించామని చెప్పారు. అనంతరం నివేదిక రూపొందించామని, దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
ఎంత ఇస్తే ఎంత భారం?
ఫిట్‌మెంట్ ఎంత శాతం ఇస్తే ఎంత భారం పడుతుందనే అంశాలను విశ్లేషిస్తూ ఏడు మోడల్స్ సూచించాం. 23 శాతం ఫిట్‌మెంట్ అయితే ప్రభుత్వంపై ఏటా రూ.11,557 కోట్ల అదనపు భారం పడుతుంది. 27 శాతం అయితే రూ.13,422 కోట్లు, కేంద్ర వేతన సంఘం అమలు చేస్తున్న 14.29 శాతం అయితే రూ.9,150 కోట్లు భారం పడుతుంది.
ఏడో సీపీసీ ప్రకారం ఇస్తే...
23 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే అదనపు పెన్షన్, హెచ్‌ఆర్‌ఏతో రూ.10,211 కోట్ల అదనపు భారం పడుతుంది. 23.5 శాతం ఫిట్‌మెంట్ అయితే అదనపు పెన్షన్, హెచ్‌ఆర్‌ఏతో రూ.11,413 కోట్లు భారం పడుతుంది. 30 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి హెచ్‌ఆర్‌ఏ, క్వాంటమ్ పెన్షన్ 7వ సీపీసీ ప్రకారం ఇస్తే రూ.12,736 కోట్ల అదనపు భారం పడుతుంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కేంద్ర వేతన సంఘం ఇస్తున్న ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలని సిఫారసు చేశాం. ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇది మంచి విధానం. శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే అమలు చేస్తున్నారు. ఇక్కడా కూడా ఇది అమలు చేయాలి.
2018 నుంచి అమలు
ఈ పీఆర్సీని 2018 నుంచి అమలు చేయాలని సిఫారసు చేశాం. ఈ ఏడు సిఫారసుల్లో ఏది అమలు చేసినా ప్రభుత్వంపై సుమారు రూ.8 వేల నుంచి రూ.9 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఉద్యోగులకు మధ్యంతర భృతి కింద సుమారు రూ.16 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించింది.
ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్.. ఉద్యోగ సంఘాలకు ప్రతి
11 పీఆర్సీ నివేదికను ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాం. ఉద్యోగ సంఘాల నేతలకు కాపీని అందచేస్తాం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, హోంగార్డులను పీఆర్సీ నివేదికలో కలిపాం. గతంలో ఈ విధానం లేదు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా చేర్చాం. ఉద్యోగులకు అమలు చేయాల్సిన ఇతర సంక్షేమ చర్యలను కూడా సూచించాం. వైద్యం, ఇతర సౌకర్యాలపైనా సిఫారసులు చేశాం.
జీతాల వ్యయం ఏపీలో 36 శాతం.. తెలంగాణలో 21 శాతం
నివేదిక తయారు చేసే క్రమంలో ఇతర రాష్ట్రాల ఉద్యోగుల జీతాలను కూడా పోల్చి చూశాం. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులో ఉద్యోగుల జీతాల వ్యయం ఏపీలో ప్రస్తుతం 36 శాతం ఉంది. చత్తీస్‌ఘడ్‌లో 32 శాతం, మహారాష్ట్రలో 31, పశ్చిమబెంగాల్ 31, ఒరిస్సా 29, మధ్యప్రదేశ్‌లో 28 శాతం, హర్యానాలో 23 శాతం, తెలంగాణలో 21 శాతం ఉంది.
మిగతావి కూడా పరిష్కరిస్తాం..
సీపీఎస్‌కి పీఆర్సీకి సంబంధం లేదు. నివేదిక తయారు చేసేముందు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. కేంద్రం, వివిధ రాష్ట్రాల్లో వేతనాలు, గత 30 సంవత్సరాల్లో వేతనాలపై అధ్యయనం చేశాం. భవిష్యత్తులో ఎలా ఉండాలో చూసి నివేదిక ఇచ్చాం. ఉద్యోగ సంఘాల 71 డిమాండ్లలో పీఆర్సీ ఒకటి కాగా మిగిలిన వాటిపై రాష్ట్ర, జిల్లా స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ పరిశీలిస్తున్నాయి. వాటిని కూడా పరిష్కరిస్తాం.
హౌస్ రెంట్ అలవెన్స్(హెచ్‌ఆర్‌ఏ)
11వ పీఆర్సీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తరలివెళ్లిన ఉద్యోగులకు మూల వేతనంలో 30 శాతం లేదా నెలకు రూ.26 వేలకు మించకుండా ఇవ్వాలి. పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంలో 22 శాతం లేదా నెలకు రూ.22,500లు ఇవ్వాలి. రెండు నుంచి పది లక్షల జనాభా లోపు ఉన్న పట్టణాల్లో మూల వేతనంలో 20 శాతం లేదా రూ.20 వేలకు మించకుండా ఇవ్వాలి. 50 వేల నుంచి రెండు లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో మూల వేతనంలో 14.5 శాతం లేదా రూ.20 వేలకు మించకుండా.. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగులకు మూల వేతనంలో 12 శాతం లేదా నెలకు రూ.17 వేలకు మించకుండా ఇవ్వాలి.
సెక్రటరీల కమిటీ: కేంద్ర ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగులకు 50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంలో 24 శాతం, 5 లక్షల నుంచి 50 లక్షలలోపు ఉన్న నగరాల్లో ఉద్యోగులకు మూల వేతనంలో 16 శాతం, ఐదు లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంలో 8 శాతాన్ని హెచ్‌ఆర్‌ఏగా ఇవ్వాలి.
సిటీ కాంపెంసేటరీ అలవెన్స్(సీసీఏ)
11వ పీఆర్సీ కమిటీ: విశాఖపట్నం, విజయవాడల్లో రూ.400 నుంచి రూ.1000, ఇతర మున్సిపల్ కార్పొరేషన్‌లలో రూ.300 నుంచి రూ.750 చొప్పున ఇవ్వాలి.
సెక్రటరీల కమిటీ: కేంద్ర ఆరో వేతన సంఘం సీసీఏను రద్దు చేసింది. కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీసీఏను రద్దు చేయాలి.
అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్
11వ పీఆర్సీ: ఉన్నత అర్హతలు సాధించిన వారికి మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వవచ్చు. సాధారణ పరిస్థితుల్లో అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఇవ్వకూడదు.
సెక్రటరీల కమిటీ: 11వ పీఆర్సీ కమిటీ సిఫార్సును అమలు చేయాలి.
కరవు భత్యం(డీఏ)
11వ పీఆర్సీ: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న తరహాలోనే ఏడాదికి రెండు సార్లు జనవరి 1, జూలై 1న డీఏలు ఇవ్వాలి. 1–1–2019 నుంచి కేంద్రం డీఏను ఒక శాతం పెంచితే.. రాష్ట్ర ప్రభుత్వం 0.91 శాతం పెంచాలి.
సెక్రటరీల కమిటీ: 11వ పీఆర్సీ చేసిన సిఫార్సును అమలు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment