సాక్షి, అమరావతి: ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న విద్యార్థులు, తెలుగు వారందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ స్పష్టం చేశారు. విద్యార్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో ప్రత్యేక అధికారి గితేశ్ శర్మ (ఇంటర్నేషనల్ కోఆపరేషన్)తో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వారందరినీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో వివిధ అధికారులతో ఒక టాస్క్ ఫోర్సు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలో రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి యం.టి కృష్ణ బాబు, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ ఎండీ ఎ.బాబు, ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, రాష్ట్ర రైతు బజారు సీఈవో శ్రీనివాసులు, ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ సీఈవో కె.దినేష్ కుమార్, ప్రత్యేక అధికారి (ఇంటర్నేషనల్ కోఆపరేషన్) గితేశ్ శర్మ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కె.కన్నబాబుతో పాటు జిల్లా కలెక్టర్లు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మన రాష్ట్రానికి చెందిన వారంతా తిరిగి వచ్చే వరకు ఈటాస్క్ ఫోర్సు కమిటీ పని చేస్తుందన్నారు.
1902 టోల్ ఫ్రీ నంబర్
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, ఇతర తెలుగు వారిని ఆదుకునేందుకు 1902 టోల్ ఫ్రీ డెడికేటెడ్ నంబరుతో హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని శర్మ తెలిపారు. ఇది 24 గంటలూ పని చేస్తుందన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారి వివరాలను ఈ నంబర్‌కు ఫోన్ చేసి, తెలియజేస్తే వారిని స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అలాగే 0863–2340678 నంబరుతో హెల్ప్ లైన్ కేంద్రాన్ని, +91–8500027678 నంబరుతో వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేశామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. తహశీల్దార్లు వారి మండలాల పరిధిలోని వారి వివరాలు సేకరించి జిల్లా, రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌తో సమన్వయం చేస్తారన్నారు.
ప్రత్యేకంగా చొరవ చూపిస్తున్న సీఎం
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని స్వస్థలాలకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా చొరవ చూపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారి (ఇంటర్నేషనల్ కోఆపరేషన్)గితేశ్ శర్మ పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారని, ఫోన్లో కూడా మాట్లాడారని చెప్పారు. శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్షలో పలు ఆదేశాలు జారీ చేశారన్నారు. అక్కడ చిక్కుకు పోయిన కొంత మంది విద్యార్థులతో ఇప్పటికే మాట్లాడామని చెప్పారు. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ సంస్థ ఎండీ ఎ.బాబు మాట్లాడుతూ.. కాల్ సెంటర్‌కు ఇప్పటి వరకూ 130 కాల్స్ వచ్చాయని తెలిపారు. తెలుగు విద్యార్థులు ఉన్న విశ్వవిద్యాలయాలు, పోస్టు కోడ్‌ల ఆధారంగా వివరాలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఉక్రెయిన్‌లో 4 కంట్రోల్ రూమ్‌లు
ఉక్రెయిన్‌లో భారత విదేశాంగ శాఖ నాలుగు బృందాలను ఏర్పాటు చేసిందని సీఎస్ డా.సమీర్ శర్మ వెల్లడించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సరిహద్దు దేశాల వరకు తీసుకువచ్చి, అక్కడి నుంచి విమానాల ద్వారా హంగేరీ, పోలండ్, స్లోవక్ రిపబ్లిక్, రొమేనియాల ద్వారా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ బృందాలతో సమన్వయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.
ఉక్రెయిన్ సరిహద్దు దేశాల వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సభ్యుల వివరాలు
హంగేరీ టీం: ఎస్.రాంజీ +36305199944, వాట్సప్ నంబరు +917395983990,
అన్కూర్ + 36308644597,
మోనిత్ నాగ్ +36302286566,
వాట్సప్ నంబర్+918950493059
పోలండ్ టీం: ఫంకజ్ గార్గ్ +48660460814/+48606700105
స్లోవక్ రిపబ్లిక్ టీం: మనోజ్ కుమార్ +421908025212, ఇవాన్ కోజింకా+421908458724
రొమేనియా టీం : గుస్నల్ అన్సారి +40731347728, ఉద్దేశ్య ప్రియదర్శి +40724382287,
ఆండ్రా హర్లనోవ్ +40763528454, మారిస్ సిమా +40722220823
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అక్కడికి వారిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారి కోసం +48660460814, +48606700105 నంబర్లతో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అయితే, కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఇప్పటికే 130 మంది కాల్ చేశారని, వారిలో వెయ్యి మంది తెలుగు విద్యార్థులు ఉన్నారని చెప్పారు.
విద్యార్థుల కోసం ప్రతీ జిల్లా కలెక్టర్ ఆఫీసులో జిల్లా సెల్‌ను ఏర్పాటు చేశామన్నారు. స్వరాష్ట్రానికి విద్యార్థుల తరలింపుపై సీఎం జగన్ ప్రతీ రోజు సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రతీ విద్యార్థిని ట్రేస్ చేసి రోడ్డు మార్గంలో వారిని బోర్డర్‌కు తీసుకువచ్చి అక్కడి నుంచి విమానంలో రాష్ట్రానికి రప్పిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment