ఏపీలో అవకాశాలపై విశ్వ వేదికన చర్చ | Davos Trip With Andhra Pradesh Ministers And Officers Team | Sakshi
Sakshi News home page

ఏపీలో అవకాశాలపై విశ్వ వేదికన చర్చ

Published Fri, May 20 2022 4:01 AM | Last Updated on Fri, May 20 2022 3:06 PM

Davos Trip With Andhra Pradesh Ministers And Officers Team - Sakshi

దావోస్‌లో ఏపీ పెవిలియన్‌

సాక్షి, అమరావతి: నాలుగో పారిశ్రామిక విప్లవం (ఇండస్ట్రియలైజేషన్‌ 4.0) దిశగా చేపట్టాల్సిన చర్యలపై దావోస్‌లో నిర్వహించే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సు వేదికగా చర్చించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆ సదస్సులో పారిశ్రామికవేత్తలు, ఆర్థిక వేత్తలకు వివరించనున్నారు.

కరోనా మహమ్మారి ప్రభావం వల్ల 2020, 2021లో డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులు ప్రత్యక్షంగా నిర్వహించలేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈనెల 22 నుంచి 26 వరకు దావోస్‌లో ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు మంత్రులు, అధికారుల బృందంతో కలిసి సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం విజయవాడ నుంచి బయలుదేరి, రాత్రికి దావోస్‌కు చేరుకోనున్నారు.

కరోనా మహమ్మారి వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని దావోస్‌ వేదికగా సీఎం నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం వివరించనుంది. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను అధిగమించేందుకు చేసే ప్రయత్నంలో ఈ వేదిక ద్వారా ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం కానుంది. 

కోవిడ్‌ నియంత్రణ నుంచి సుపరిపాలన దాకా.. 
కరోనా మహమ్మారి నియంత్రణలో రాష్ట్రం అనుసరించిన వ్యూహాన్ని దావోస్‌ వేదికపై సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని బృందం వినిపించనుంది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌ ద్వారా కరోనా కట్టడికి చేసిన విశేష ప్రయత్నాలను తెలియజెప్పనుంది. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు, çసమగ్ర సామాజికాభివృద్ధిలో భాగంగా నవరత్నాల అమలు, అధికార వికేంద్రీకరణ – సుపరిపాలన, భవిష్యత్‌ తరాల కోసం విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించనుంది. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగం, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి తదితర అంశాలపైనా ఈ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని బృందం దృష్టి సారించనుంది. 

కాలుష్యం లేని వ్యవస్థే లక్ష్యం
కాలుష్యం లేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే అంశాన్ని ఈ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని బృందం ప్రధానంగా వివరించనుంది. పారిశ్రామికీకరణలో భాగంగా నాలుగో విప్లవం దిశగా ప్రపంచం కదులుతున్న నేపథ్యంలో.. దానిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది.

కాలుష్య రహిత విధానాలతో ఉత్పత్తులు సాధించడం, అందుకు తగిన విధంగా వ్యవస్థలను రూపొందించుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంలో భాగంగా ఇంటర్‌ కనెక్టివిటీ, రియల్‌ టైం డేటా, యాంత్రీకరణ, ఆటోమేషన్‌లకు పారిశ్రామికీకరణలో చోటు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై విస్తృతంగా జరిగే చర్చల్లో రాష్ట్ర బృందం పాల్గొననుంది. 

పెట్టుబడులకు స్వర్గధామం 
ఇండిస్ట్రియలైజేషన్‌ 4.0కు సరైన వేదికగా నిలిచేందుకు రాష్ట్రానికి ఉన్న వనరులు, అవకాశాలను కూడా ఈ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని బృందం వివరించనుంది. పారిశ్రామికీకరణ దిశగా కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను కూడా వివరించనున్నారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు అదనంగా మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్‌ఈజెడ్‌ పోర్టుల నిర్మాణం, కొత్తగా మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, నిర్మాణం వంటి వాటి ద్వారా ఇండస్ట్రియలైజేషన్‌ 4.0కు ఏ రకంగా దోహదపడుతోందో విశదీకరిస్తారు.

బెంగళూరు – హైదరాబాద్, చెన్నై – బెంగుళూరు, విశాఖపట్నం – చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచుతారు. పరిశ్రమల కోసం సుశిక్షితులైన మానవ వనరుల నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్న తీరును కూడా వివరిస్తారు.

పీపుల్‌ – ప్రోగ్రెస్‌ – పాజిబిలిటీస్‌
పారిశ్రామిక వ్యూహాల్లో తీసుకురావాల్సిన మార్పులపై కూడా దావోస్‌ వేదికగా రాష్ట్రం చర్చించనుంది. నేరుగా ఇంటి గుమ్మం వద్దకే ఉత్పత్తులు చేరవేసే విధానాన్ని మరింత బలోపేతం చేయడం, దాన్ని డిజిటలైజేషన్‌తో అనుసంధానించడం.. రాష్ట్రంలో ఉత్పత్తి రంగాన్ని మరింత వృద్ధి చేయడం, ఎగుమతులకు అవసరమైన నాణ్యతతో వస్తు ఉత్పత్తులు తయారు చేయడానికి తగిన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలకు సంబంధించి అత్యుత్తమ సంస్థల భాగస్వామ్యంపై దృష్టి పెట్టనుంది. ఈ అంశాలను వివరిస్తూ దావోస్‌లో ‘పీపుల్‌ – ప్రోగ్రెస్‌ – పాజిబిలిటీస్‌’ నినాదంతో ఏపీ పెవిలియన్‌ నిర్వహిస్తోంది. 

కీలక అంశాల్లో భాగస్వామ్యం 
ప్రపంచ వ్యాప్తంగా హాజరయ్యే ప్రతినిధులతో కూడిన దావోస్‌ సదస్సు పలు కీలక అంశాలపై దృష్టి పెట్టనుంది. ఆహారం – వాతావరణ మార్పులు, సాంకేతిక రంగంలో వినూత్న ఆవిష్కరణలు, సుపరిపాలన, సైబర్‌ సెక్యూరిటీ, అంతర్జాతీయ సహకారం – పునర్‌ నిర్మాణం, ఆర్థిక వ్యవస్థలో సమతుల్యత, అందరికీ ఆరోగ్యంపై జరిగే చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement