న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా నేటి నుంచి ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు ప్రారంభం కానుంది. సోమవారం సాయంత్రం ప్రారంభ ఉత్సవాలు ముగిశాక.. మంగళవారం నుంచి అధికారికంగా మొదలయ్యే ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఉపన్యాసం ఇస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు రుచికరమైన భారతీయ వంటకాలు వడ్డించడంతో పాటు.. సదస్సు జరిగినన్ని రోజులు యోగా శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.
స్విట్జర్లాండ్ ఆల్స్ పర్వతాల మధ్య ఉన్న విడిది కేంద్రం దావోస్‌లో జరగనున్న ఈ 48వ డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి వ్యాపార, రాజకీయ, కళలు, విద్యా, సామాజిక రంగాలకు చెందిన 3 వేల మందికి పైగా నేతలు, ప్రతినిధులు హాజరవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి భారత్ నుంచి 130 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ చోదక శక్తి అన్న అంశాన్ని ఈ సమావేశాల్లో మోదీ నొక్కి చెప్పనున్నారు. డబ్ల్యూఈఎఫ్ చైర్మన్ క్లౌస్ స్వాబ్ సోమవారం సాయంత్రం సదస్సును ప్రారంభిస్తారు. అనంతరం బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, ఆస్ట్రేలియన్ నటి కేట్ బ్లాన్‌చెట్, ప్రముఖ సంగీతకారుడు ఎల్టన్ జాన్‌లను ‘క్రిస్టల్’ అవార్డులతో సత్కరించనున్నారు.
దేవెగౌడ తర్వాత మోదీనే..
మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగంతో సదస్సు అధికారికంగా ప్రారంభమవుతుంది. ‘ముక్కలైన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణం’ అనేది సదస్సు ప్రధాన ఎజెండా. 1997లో అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అనంతరం దావోస్ సదస్సుకు హాజరవుతున్న మొదటి భారత ప్రధాని మోదీనే. భారత్ స్వేచ్ఛా వాణిజ్య దేశమని, ప్రపంచ వ్యాప్త పెట్టుబడుల కోసం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని ప్రపంచ దేశాలకు ప్రధాని స్పష్టం చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేవలం 24 గంటలు మాత్రమే ప్రధాని దావోస్‌లో ఉంటారు. సోమవారం సాయంత్రం ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సీఈవోలకు విందు ఇస్తారు. ఈ కార్యక్రమంలో భారత్‌కు చెందిన 20 కంపెనీలు, 40 విదేశీ కంపెనీల సీఈవోలు పాల్గొంటారు.
అలాగే అంతర్జాతీయ వ్యాపార కూటమికి చెందిన 120 మంది సభ్యులతో మోదీ సమావేశమవుతారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. మోదీ వెంట కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సురేశ్ ప్రభు, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ఎంజే అక్బర్, జితేందర్ సింగ్‌లు కూడా దావోస్ సదస్సులో పాల్గొంటున్నారు. అలాగే భారతీయ పరిశ్రమల విభాగం సీఐఐ నేతృత్వంలోని సీఈవోల బృందంలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, అజీం ప్రేమ్‌జీ, రాహుల్ బజాజ్, ఎన్.చంద్రశేకరన్, చందా కొచ్చర్, ఉదయ్ కొటక్, అజయ్ సింగ్‌లు సదస్సుకు హాజరవుతున్నారు. మోదీతో పాటు సదస్సులో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, షారుక్ ఖాన్‌లు కూడా ప్రసంగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment