
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ దావోస్ భేటీపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంను ఉద్దేశించి ప్రధాని ప్రసంగంలో దేశంలో అసమానతలనూ ప్రస్తావించాలని అన్నారు. భారత జనాభాలో కేవలం 1 శాతం దగ్గరే 73 శాతం సంపద పోగుపడిన విషయాన్ని దావోస్‌లో చెప్పండని మోదీకి సూచించారు. దీనికి సంబంధించిన నివేదికనూ మీకు రిఫరెన్స్‌గా అటాచ్ చేస్తున్నానంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
దేశంలో 1 శాతంగా ఉన్న సంపన్నుల వద్ద 73 శాతం సంపద ఉందని అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రపంచ నేతల ముందు ప్రధాని తన ప్రసంగంలో ఈ అంశాన్నీ చేర్చాలని రాహుల్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. రాహుల్ ట్వీట్‌కు బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్ర బదులిస్తూ గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రధానులే దేశంలో ఆర్థిక అసమానతలకు కారణమని అన్నారు.