
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు హాజరు కావాలంటూ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు ఆహ్వా నం అందింది. జనవరి 23–26 తేదీల్లో జరగనున్న ఈ సదస్సుకు హాజరు కావాలని ఓ రాష్ట్ర మంత్రికి ఆహ్వానం లభించడం ఇదే తొలిసారి. ఏటా జరిగే ఈ సదస్సుకు 2,500 మంది వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రతినిధులు, ఆర్థికవేత్తలు హాజరవుతారు. సాధారణంగా కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకే ఈ సదస్సుకు ఆహ్వానం దక్కుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం పట్ల ఫోరం అభినందనలు తెలిపింది. ఇందుకు చురుగ్గా పనిచేసిన కేటీఆర్‌కు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం పంపుతున్నట్లు పేర్కొంది.
ఈ సదస్సులో ప్రపంచ దేశాల నుంచి రానున్న పలు కంపెనీల సీఈవోలు, చైర్మన్లతో కేటీఆర్ సమావేశమవుతారని ఆయన కార్యాలయం తెలిపింది. కాగా, ఫోరం నుంచి ఆహ్వానం లభించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సదస్సు ద్వారా ప్రపంచం ముందు ఉంచుతామని పేర్కొన్నారు. ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్‌తో పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ రెసిడెంట్ కమిషనర్ అరవింద్‌కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరవుతారు. గతంలో చైనాలోని డాలియాన్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే.