
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబుఅన్నారు. ఇన్విజిబుల్ గవర్నమెంట్, విజిబుల్ గవర్నెన్స్ తమ విధానమన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మూడో రోజు బుధవారం ‘ఇంటరాక్టివ్ లంచ్‌ఆన్ ప్రోగ్రాం’లో ‘టెక్నాలజీ ఫర్ ఇన్నోవేషన్స్’ అంశంపై ఆయన మాట్లాడారు. మీ ఫోకస్ ఏమిటని ఓ ప్రతినిధి అడగ్గా.. ప్రభుత్వానికి వచ్చే ప్రతి వినతిని పరిష్కరించడమేనని సీఎం చెప్పారు. కాగా, సీఐఐ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఐఐని కోరారు.
కాగా దావోస్‌లో చంద్రబాబు బుధవారమూ పలు సంస్థల అధిపతులతో సమావేశ మయ్యారు. వ్యవసాయ యూపీఎల్ సంస్థ గ్లోబల్ సీఈవో జై షరోఫ్‌తో భేటీ అయ్యారు. సింగపూర్‌లోని నన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ ప్రెసిడెంట్ సుబ్రా సురేష్‌తో కూడా సమవేశమయ్యారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీకి చెందిన ఎథేరియం వ్యవస్థాపకుడు జో లుబిన్‌తో సమావేశమై.. బ్లాక్ చైన్ టెక్నాలజీ 3 నెలల కోర్సును ప్రారంభించాలని కోరారు. హెచ్‌పీ త్రీడీ ప్రింటింగ్ హెడ్ స్టీఫెన్ నిగ్రోతోనూ, ఎయిర్‌బస్ డిఫెన్స్ సంస్థ సీఈవో డిర్క్ హోక్‌తో సమావేశమయ్యారు. రహేజా గ్రూప్ ప్రతినిధి రవి రహేజాతోనూ సమావేశమయ్యారు.