![Gudivada Amarnath says Brand AP in Davos - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/13/amarnath.jpg.webp?itok=chfrmhgm)
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలను ప్రపంచానికి విస్తృతంగా చాటిచెప్పేలా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే 52వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనుంది. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు లాంటి నవరత్న పథకాలతో గడప వద్దకే పరిపాలన చేరువ చేయటాన్ని దావోస్ సదస్సు వేదికగా తెలియచేసేలా ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తోంది.
ఈ నెల 22వ తేదీ నుంచి 26 వరకు దావోస్‌లో జరిగే డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం హాజరు కానున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. దావోస్‌లో జరిగే పర్యటన వివరాలను గురువారం సచివాలయంలో ఆయన మీడియాకు తెలియచేశారు.
జనవరిలో జరగాల్సినా..
డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానం మేరకు సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర బృందం ఈ సమావేశాలకు హాజరవుతున్నట్లు మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. ఇప్పటివరకు డబ్ల్యూఈఎఫ్‌లో మెంబర్ అసోసియేట్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇకపై ప్రతిష్టాత్మక ఫోరం ప్లాట్‌ఫాం పార్టనర్‌గా చేరనుందని, దీనికి సంబంధించి డబ్ల్యూఈఎఫ్ ఫౌండర్ చైర్మన్ క్లాస్ ష్వాబ్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. దీనిద్వారా డబ్ల్యూఈఎఫ్‌కు చెందిన సీఈవో స్థాయి చర్చలు, ప్రాజెక్టులు, వర్క్‌షాప్స్‌లో నేరుగా పాల్గొనే అవకాశం లభించనుంది.
సాంకేతిక ఆవిష్కరణల పునాదులపై పారదర్శకత, అధికార వికేంద్రీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు సీఎం జగన్ నిబద్ధతతో కృషిచేస్తున్నారని సమావేశాలకు ఆహ్వానించేందుకు వచ్చిన డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్జ్ బెండే ప్రశంసించారని గుర్తు చేశారు. ఈ సమావేశాలు జనవరిలోనే జరగాల్సినా కోవిడ్ థర్డ్‌వేవ్ కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడినట్లు తెలిపారు.
ప్రభుత్వ విధానాలతో సారూప్యం
కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా మారిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ‘కలసి పని చేయడం – నమ్మకాన్ని పునరుద్ధరించడం’ అనే లక్ష్యంతో దావోస్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు ఇవి దగ్గరగా ఉన్నట్లు మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను ప్రచారం చేసేలా సమావేశాల కోసం రూపొందించిన లోగోను మంత్రితో పాటు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్, ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ఆవిష్కరించారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చాటే విధంగా రూపొందించిన బుక్‌లెట్‌ను మంత్రి ఆవిష్కరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ చెప్పింది చెప్పినట్లుగా అమలు చేసిన నవరత్నాలు, పర్యావరణం, సాంఘిక సంక్షేమం, సుపరిపాలన లాంటి 9 అంశాలకు బుక్‌లెట్‌లో ప్రాధాన్యమిచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.
10 రంగాలపై ఫోకస్
దావోస్ సమావేశాలకు వివిధ దేశాల నుంచి 2,200 మందికిపైగా ప్రతినిధులు హాజరు కానున్నట్లు మంత్రి తెలిపారు. ప్రధానంగా 18 రంగాలపై చర్చలు జరగనుండగా విద్య, వైద్యం, నైపుణ్యం, తయారీ రంగం, లాజిస్టిక్స్, ఆర్థికసేవలు, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, వినియోగదారుల వస్తువులు, ఎఫ్‌ఎంసీసీ లాంటి పదిరంగాల్లో అవకాశాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35కుపైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరగనున్నట్లు వెల్లడించారు.
సీఐఐ నేతృత్వంలో 23న వైద్యరంగం, 24న విద్య, నైపుణ్యరంగం, డీకార్బనైజ్డ్ ఎకానమీ దిశగా అడుగులులాంటి అంశాలపై రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది పెట్టుబడుల సమావేశం కాదని, కోవిడ్‌తో మారిన వాణిజ్య పరిణామాలపై చర్చించి వ్యాపార అవకాశాలు, సలహాలు ఇచ్చిపుచ్చుకునేందుకు డబ్ల్యూఈఎఫ్ చక్కటి వేదిక అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment