దావోస్‌లో ఏపీ పెవిలియన్(ఫైల్)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం చేపడుతున్న అంతర్జాతీయ రోడ్‌షోలు సత్ఫలితాలిస్తున్నాయి. కరోనాతో రెండున్నరేళ్లుగా ఆన్‌లైన్ సమావేశాలకే పరిమితమైన ప్రభుత్వం ఇప్పుడు అంతర్జాతీయ రోడ్‌షోలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన అధికారుల బృందం వెళ్లివచ్చింది.
అంతకుముందు అప్పటి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నేతృత్వంలోని బృందం దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొంది. తాజాగా పరిశ్రమలశాఖ డైరెక్టర్ సృజన నేతృత్వంలో అధికారుల బృందం జర్మనీలోని హాన్‌ఓవర్ మెస్సే ట్రేడ్ ఫెయిర్‌లో పాల్గొంది. ఈ మూడు రోడ్‌షోలు మంచి ఫలితాలు అందించడంతో రానున్న కాలంలో మరిన్ని అంతర్జాతీయ రోడ్‌షోలను నిర్వహించడానికి పరిశ్రమలశాఖ సిద్ధమవుతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ ట్రేడ్ ఫెయిర్‌గా పిలిచే హన్‌ఓవర్‌లో మే 30 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగిన ట్రేడ్ ఫెయిర్‌లో రాష్ట్రం పాల్గొనడమే కాకుండా రాష్ట్రంలో తయారీ, పోర్టులు, లాజిస్టిక్స్, ఎగుమతుల రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించినట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన ‘సాక్షి’కి చెప్పారు. ఏబీబీ, ఎయిర్‌బస్, బోష్, జెస్సీ కర్ల్, ఫెస్టో, షెఫ్లర్ టెక్నాలజీస్ వంటి కంపెనీలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు.
ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేసిన జర్మనీ, ఇజ్రాయిల్‌లకు చెందిన షెఫ్లర్ టెక్నాలజీస్, ఫెస్టో వంటి కంపెనీలు రాష్ట్రంలోని అవకాశాలపై ఆసక్తిని వ్యక్తం చేసినట్లు చెప్పారు. రోబోటిక్, హెల్త్‌కేర్, డ్రోన్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపాయన్నారు. దుబాయ్, దావోస్, జర్మనీ రోడ్‌షోలు మంచి ఫలితాలివ్వడంతో త్వరలో నార్వే, దక్షిణ కొరియాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా దక్షిణ కొరియా రోడ్‌షోను నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంపై మల్క్‌హోల్డింగ్ ఆసక్తి
ఈ ఏడాది దుబాయ్ ఎక్స్‌పో సందర్భంగా రూ.5,150 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరగ్గా అందులో కీలకమైన అమెరికాకు చెందిన మల్క్ హోల్డింగ్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ విషయమై ఇప్పటికే సీఎం జగన్‌ను కలిసిన మల్క్‌హోల్డింగ్స్ ప్రతినిధులు వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో రూ.1,500 కోట్లతో అల్యూమినియం కాయల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఆ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే పలు స్థలాలను పరిశీలించారు. ఇటీవల దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రపంచానికి ఏపీని రోల్‌మోడల్‌గా చూపడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. ఈ ఒక్క రంగంలోనే నాలుగు అంతర్జాతీయస్థాయి కంపెనీల నుంచి రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించగలిగింది.
మిట్టల్, అదానీ, అరబిందో, గ్రీన్‌కో వంటి కంపెనీలతో పాటు బైజూస్, టెక్ మహీంద్రా, డసల్ట్ వంటి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ రోడ్‌షోల్లో వివిధ కంపెనీలతో జరిపిన చర్చలు, ఒప్పందాలను వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment