సాక్షి, తాడేపల్లి: రైలు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సీఎ జగన్ ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. తనతోపాటు ముగ్గురు ఐఏఎస్ అధికారుల బృందం ఒడిశాకు వెళ్లి.. విశాఖ, భువనేశ్వర్, ఇతర ఆసుపత్రిలో బాధితులను చేర్పించి, పరామర్శించామని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడారు. కోరమండల్‌లో ఎక్స్‌ప్రెస్‌లో 309 మంది, యశ్వంత్‌పూర్ రైలులో 33 మంది ఉన్నారని పేర్కొన్నారు. రెండు రైళ్లలో ప్రయాణించిన 342 మందిలో 329 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
12 మందికి స్వల్ప గాయాలైనట్లు గుర్తించామన్నారు. విశాఖ ఆసుపత్రిలో 9 మందికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వ రెస్క్యూ ఆపరేషన్లను కేంద్ర మంత్రులు అభినందిచారని చెప్పారు. అంబులెన్స్‌లు, మహాప్రస్థానం వాహనాలను ఒడిశాలోనే ఉంచామని తెలిపారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఒడిశాలోనే ఉన్నారన్నారు. రైలు ప్రమాదం ఘటనలో బాలాసోర్‌లో నివాసముంటున్న శ్రీకాకుళం జిల్లా వ్యక్తి మరణించాడని, బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం అందిస్తున్నామని తెలిపారు.
‘ఏపీకి చెందిన వారి కోసం కాల్స్ రాలేదు. ఖమ్మం వ్యక్తి అంబటి రాములు విజయవాడ నుంచి వెళ్తున్నట్లు కాల్ వచ్చింది. పక్క రాష్ట్రం అయినప్పటికీ సమాచారం కోసం ఆరా తీస్తున్నాం. ఒడిశా రైలు ప్రమాదంలో 276 మంది చనిపోగా.. 187 మృతదేహాలను మార్చురీలో ఉన్నాయి. కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటున్నాం. మన అంబులెన్స్‌లు, మహాప్రస్థానం వాహనాలు కావాలని కేంద్ర మంత్రులు అడిగారు.
మన ప్రభుత్వం చేసినంత సాయం ఏ ప్రభుత్వం చేయలేదు. ఈ మాట కేంద్ర మంత్రులే చెప్పారు. పక్క రాష్ట్రాల వారికి కూడా సహకారం అందిస్తున్నాం. బాధితులు ఆస్పత్రుల నుంచి బయటకు వచ్చేంత వరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. బాధితులకు సేవచేయడం ముఖ్యం.. పబ్లిసిటీ కాదు’ అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.
సీఎం జగన్ తక్షణ స్పందన
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం గురించి తెలియగానే సీఎం జగన్ తక్షణమే స్పందించారు. అదే రాత్రి సీనియర్ అధికారులతో సమావేశమైన ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు మర్నాడు ఉదయమే నేను, ముగ్గురు ఐఏఎస్‌లు, మరో ముగ్గురు ఐపీఎస్‌లు కలిసి రోడ్డుమార్గం ద్వారా అక్కడకు వెళ్లి, వెంటనే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మేం అక్కడ పరిస్థితుల్ని సమీక్షిస్తుండగానే అదే రోజు సాయంత్రం విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి కొందరు అధికారులు వచ్చి మాతో జాయిన్ అయ్యారు.
వివిధ శాఖల సమన్వయంతో..:
రెస్క్యూ ఆపరేషన్‌లో ఇక్కడ్నుంచి వెళ్లిన మాతో పాటు, 27 మంది సపోర్టింగ్ సిబ్బంది పాల్గొన్నారు. నలుగురు తహశీల్దార్లు, ఒక డిప్యూటీ డీఎంహెచ్‌వో, 9 మంది డిప్యూటీ తహశీల్దార్లు, వీఆర్వోలు, పోలీసు, ఆర్టీవో సిబ్బంది మాతో కలిపి పని చేశారు. ఆయా శాఖల్ని సమన్వయం చేసుకుంటూ రైలు ప్రమాద ప్రయాణికుల్ని గుర్తించగలిగాం. 108 సర్వీసులు 20.. ఇంకా 19 ప్రైవేటు అంబులెన్స్‌లు, 15 మహాప్రస్థానం వెహికల్స్‌ను వెంట తీసుకెళ్లాం. ఒక్కో 108 సర్వీస్‌లో నలుగురు చొప్పున సిబ్బంది ఉన్నారు. రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ వద్ద 5 అంబులెన్స్‌లతో సేవలందించాం.
ఇంకా సీఎం జగన్ ఆదేశాల మేరకు ఇచ్చాపురం సరిహద్దులో కొన్ని అంబులెన్సులతో పాటు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. ఇప్పటికీ మన రెస్క్యూ బృందాలు భువనేశ్వర్, కటక్, బాలాసోర్‌లో ఉన్నాయి.
కేంద్ర మంత్రుల ప్రశంస
ఒడిశా రైలు ప్రమాదం గురించి తెలియగానే మనం శరవేగంగా స్పందించి రాష్ట్రంలో పలు చోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశాం. తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర రైల్వేస్టేషన్లలో కంట్రోల్ రూంకు అందిన ఫోన్ల సమాచారం ద్వారా.. ఎక్కడికక్కడ రిజర్వేషన్ల ఛార్ట్‌ల్లో ఉన్న ప్రయాణికుల కాంటాక్టు నెంబర్ల ప్రకారం వారితో మాట్లాడి వారి ఆచూకి తెలుసుకోవడం, వారు సేఫ్‌గా స్వస్థలాలకు చేరే వరకు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది.
అక్కడ పరిస్థితుల్ని సమన్వయం చేస్తున్న కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ధర్రేంద్ర ప్రధాన్‌గార్లను కూడా కలిసి మాట్లాడాం. సీఎంగారి ఆదేశాల మేరకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌ను వివరించాం. మన ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాపైనా చెప్పాం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గురుమూర్తి కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ.5 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం ఇస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రులకు వివరించాం.
తమిళనాడు, బీహార్.. తదితర రాష్ట్రాల్లో కేవలం కమాండ్ కంట్రోల్ రూమ్‌లే ఏర్పాటు చేయగా, మన దగ్గర కంట్రోల్ రూమ్‌లతో పాటు, వివిధ జిల్లా కేంద్రాల్లో అధికారుల్ని అప్రమత్తం చేసి చేపట్టిన రెస్యూ్క ఆపరేషన్ విధానం, మన చొరవను కేంద్ర మంత్రులు అభినందించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
చదవండి: ‘మార్గదర్శి’ నిధుల దారి మళ్లింపు కేసుపై సుప్రీంలో విచారణ
Comments
Please login to add a commentAdd a comment