CM YS Jagan Orders Special Team To Send Odisha Train Accident Site - Sakshi
Sakshi News home page

మనం సైతం.. వేగంగా వివరాల సేకరణ

Published Sun, Jun 4 2023 2:12 AM | Last Updated on Sun, Jun 4 2023 11:52 AM

CM YS Jagan Orders special team to Send Odisha Train accident site - Sakshi

సాక్షి, అమరావతి: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులతో కలిసి.. ఈ  ప్రమాద ఘటనపై ఆయన అన్ని వివరాలు ఆరా తీశారు. చాలా మంది మృతి చెందారని, మృతుల సంఖ్య పెరుగుతూ ఉందని, క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగా ఉందని అధికారులు తెలిపారు.

సీఎం ఆదేశాల మేరకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను వివరించారు. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతం పరిధిలోని డీఆర్‌ఎం.. ఇతర అధికారుల ద్వారా సమాచారం తెప్పిస్తున్నామన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో కూడా నిరంతరం టచ్‌లో ఉన్నామని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో ఒక బృందం ప్రమాదం జరిగిన బాలాసోర్‌ ప్రాంతానికి వెళ్లింది.

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తోపాటు సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ అరుణ్‌ కుమార్, విశాఖలో కమర్షియల్‌ ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆనంద్, శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌లతో కూడిన బృందం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుంది. ప్రతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఎంక్వైరీ విభాగాలను ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. రైల్వే అధికారుల నుంచి అందిన ప్రయాణికుల పరిస్థితులపై ఆరా తీయడానికి, ఎవరైనా ప్రయాణికుల బంధువులు, వారి సంబంధీకుల నుంచి సమాచారం వస్తే వెంటనే స్పందించేలా ఈ ఎంక్వైరీ విభాగాలు పని చేయాలని సీఎం ఆదేశించారు.

ఒడిశా సరిహద్దులకు సమీపంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో అవసరమైన పక్షంలో అంబులెన్స్‌లు పంపించడానికి సిద్ధంగా ఉంచాలని సూచించారు. క్షతగాత్రులకు అవసరమైన పక్షంలో ఉత్తమ వైద్యం అందించడానికి విశాఖ సహా ఒడిశా సరిహద్దుల్లోని ఆస్పత్రులను సన్నద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించగా, వారు ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు.

వేగంగా వివరాల సేకరణ 
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. కోరమాండల్, యశ్వంతపూర్‌ రైళ్లల్లో ప్రయాణించిన రాష్ట్రానికి చెందిన ప్రయాణికుల వివరాలను అధికారులు సేకరించారు.  ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ఉంచిన ఆస్పత్రుల నుంచి ఫొటోల సేకరణ చేపట్టారు. ఈ డేటా ఆధారంగా ప్రమాదంలో ఎవరైనా రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు ఉన్నారా? అన్నదానిపై ముమ్మరంగా విచారిస్తున్నారు. అంబులెన్స్‌లు సిద్ధం చేయడంతోపాటు, క్షతగాత్రులకు వైద్యసేలు అందించే అంశంపై అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.
 
సీఎం ఆదేశాల మేరకు విశాఖ నుంచి మంత్రి బొత్స సమీక్ష
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నం నుంచి సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి గురైన కోరమాండల్, యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రెండు రైళ్లల్లో ప్రయాణిస్తున్న రాష్ట్రానికి చెందిన వారి వివరాలను కొంత వరకు సేకరించి, వారి క్షేమ సమాచారాలను తెసుకునే ప్రయత్నాలు చేపట్టారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్పత్రులను సన్నద్ధంగా ఉంచారు.
  
సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి
ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎక్కువ మంది మృతి చెందడం, భారీ సంఖ్యలో క్షతగ్రాతులు కావడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా.. అన్నదానిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement