సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పలు భేటీల్లో పాల్గొంటోంది. ఐటీ, జీవ, వైద్య రంగాల్లో తెలంగాణ శక్తిని ప్రపంచానికి చాటడంతో పాటు, భారీ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా కీలక చర్చలను ప్రారంభించింది.
తొలిరోజు డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమైన సీఎం, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఇథియోపియా ఉప ప్రధాని డెమెక్ హసెంటోతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్‌పై చర్చించారు. సీఎం, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్‌జాని ఘోష్‌తోనూ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పనకు సాయం అందించడంపై సంప్రదింపులు జరిపారు.
తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు.. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా ‘వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్’నినాదంతో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు. బతుకమ్మ, బోనాల పండుగలు, చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నం చారి్మనార్‌తో పాటు చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, టీ హబ్‌తో పాటు విభిన్న రంగాల విజయాలు చాటే లా పెవిలియన్‌ను తీర్చిదిద్దారు. భారీగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ అనుకూలతలను వివరించేలా నినాదాలు ఏర్పాటు చేశారు.
జ్యూరిచ్‌లో ప్రవాస భారతీయుల స్వాగతం
మూడు రోజుల పాటు జరిగే డబ్ల్యూఈఎఫ్ 54వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం రేవంత్ బృందానికి మార్గం మధ్యలోని జ్యూరిచ్‌లో ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. సమ్మిళిత, సంతులిత అభివద్ధి ద్వారా ప్రజలందరి పురోగతి తమ లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నవ తెలంగాణ నిర్మాణం కోసం మొదలైన తమ ప్రభుత్వ ప్రయత్నంలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావటంపై హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment