
సింగపూర్ కంపెనీలకు దాసోహం
నూతన రాజధాని అమరావతి అభివృద్ధి అంశంలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రాష్ట్ర సర్కారు దాసోహం అంటోంది.
ఈ నెల 24న సింగపూర్‌లో నేరుగా సీఎం మంతనాలు
దావోస్ పర్యటన జీవోలో సింగపూర్ పర్యటన గురించి ప్రస్తావనే లేదు
అన్నీ సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు కోరినట్లే
ఇప్పటికే 99 ఏళ్ల లీజు, ఫ్రీ హోల్డ్‌పై చట్టసవరణ
ఎల్ అంట్ టీ తరహాలో సింగపూర్ కంపెనీలు నిర్మించి విక్రయం
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని అమరావతి అభివృద్ధి అంశంలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రాష్ట్ర సర్కారు దాసోహం అంటోంది. అమరావతి మాస్టర్ డెవలపర్‌గా స్విస్ ఛాలెంజ్ విధానంలో అసెండాస్ సెంబ్రిడ్జి అండ్ సెమ్బ్‌క్రాప్ కన్సార్టియంను ఎంపిక చేయాలని ‘ముఖ్య’ నేత నిర్ణయించిన విషయం తెలిసిందే. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు కోరిన విధంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఏకంగా ‘రాష్ట్ర మౌలిక సదుపాయాలు అభివృద్ధికి వీలుకల్పించు చట్టం -2001’లో సవరణలు తీసుకువచ్చారు.
తొలుత చట్టంలో 33 సంవత్సరాలకు మాత్రమే ప్రభుత్వం భూమిని లీజుకు ఇవ్వాలని ఉంది. అయితే సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు ఫ్రీ హోల్డ్ ప్రాతిపదికపైన, అలాగే మొత్తం రాయితీ ధరపై పూర్తి హక్కు కల్పించాలని కోరాయి. అమరావతి మాస్టర్ డెవలపర్‌గా అసెండాస్ సెంబ్రిడ్జి అండ్ సెమ్బ్‌క్రాప్ కన్సార్టియం సమర్పించిన స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలకు అనుగుణంగానే చట్టంలో ప్రభుత్వం సవరణలు తీసుకువచ్చింది. ఇక మిగతా ప్రతిపాదనలపైన కూడా ఈ కంపెనీలు సమర్పించిన ప్ర తిపాదనలపై ఆ కంపెనీల ప్రతినిధులతో సీఆ ర్‌డీఏ కార్యదర్శి అజేయ జైన్, కమిషనర్ శ్రీ కాంత్ సోమవారమిక్కడ చర్చలు జరిపారు.
ఒప్పందానికి భిన్నంగా ప్రతిపాదనలు
సింగపూర్ ప్రభుత్వ కంపెనీలే మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేస్తామని తొలుత ఇరు ప్రభుత్వాల మధ్య కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంలో పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా నూటికి నూరు శాతం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు మాస్టర్ డెవలపర్‌గా ప్రతిపాదనలు సమర్పించాయి. తొలుత కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి, గతంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలకు చాలా వ్యత్యాసం ఉందని సీఆర్‌డీఏ కార్యదర్శి అజేయ జైన్, కమిషనర్ శ్రీకాంత్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ‘ముఖ్య’నేత మాత్రం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు చేసిన ప్రతిపాదనల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రాజధాని భూములు ఫ్రీ హోల్డ్ ప్రాతిపదికన ఇచ్చేందుకు చట్ట సవరణలు చేశారు.
సీడ్ కేపిటల్ పరిధిని ఎనిమిది చదరపు కిలోమీటర్ల నుంచి సింగపూర్ సంస్థలు కోరినట్లు 16.9 చదరపు కిలో మీటర్లకు పెంచేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని ఎల్ అండ్ టీ నిర్మాణం చేసి ఆ నిర్మాణ స్థలాన్ని ఎల్ అండ్ టీ ఎలాగ విక్రయించుకుందో అదే తరహాలో ఇప్పుడు రాజధానిలో కూడా వాణిజ్య, వ్యాపార సముదాయాలను సింగపూర్ కంపెనీలు విక్రయించనున్నాయి. దీనిపై సీఆర్‌డీఏ అధికారులను సంప్రదించగా... స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలపై ఆ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపామని తుది నిర్ణయం సీఎం తీసుకుంటారని తెలిపారు.
24న దావోస్ నుంచి సింగపూర్‌కు సీఎం
దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడినుంచి నేరుగా 24వ తేదీన సింగపూర్ వెళ్తారు. అక్కడ సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో పాటు అసెండాస్ సెంబ్రిడ్జి అండ్ సెమ్బ్‌క్రాప్ ప్రతినిధులతో సమావేశమై స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలపైన మంతనాలు సాగించనున్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ జీవోలో సింగపూర్ పర్యటన గురించి పేర్కొనకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో బేరసారాల ద్వారా రాజధానిలోని కొన్ని కాం ట్రాక్టు పనులను తాను చెప్పిన వ్యక్తులు, సంస్థలకు ఇప్పించుకోవడమే లక్ష్యంగా సీఎం చర్యలున్నాయని విమర్శలున్నాయి.