కేటీఆర్ సమక్షంలో ఒప్పందం చేసుకుంటున్న జయేశ్‌రంజన్, మాస్టర్ కార్డ్ వైస్ చైర్మన్ మైఖేల్
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా తెలంగాణ గురువారం మరో భారీ పెట్టుబడి సాధించింది. రాష్ట్రంలో ఏర్పా టుచేస్తున్న మొబిలిటీ క్లస్టర్‌లో దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ హ్యూండాయ్ రూ.1,400 కోట్ల పెట్టుబడిని పెడుతున్నట్లు ప్రక టించింది. మాస్టర్‌కార్డ్, జీఎంఎం ఫాడ్లర్, ఈఎం పీఈ తదితర సంస్థలూ రాష్ట్రంలో పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలపై కీలక ప్రకటనలు చేశాయి.
కేటీఆర్‌తో హ్యుందాయ్ ప్రెసిడెంట్ భేటీ
హ్యుందాయ్ ప్రెసిడెంట్ యంగ్చో చి గురువారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలం గాణలో పెట్టుబడిపై ప్రకటన చేశారు. మొబిలిటీ క్లస్టర్‌లో పెట్టుబడులకే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీ లోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. తెలంగాణలో ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా టెస్ట్ ట్రాక్‌లతో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుంది. హ్యుందాయ్ రాకతో మొబిలిటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచ స్థాయి పౌరసేవలే లక్ష్యంగా..
డిజిటల్ టెక్నాలజీల ద్వారా తెలంగాణ పౌరులకు ప్రపంచ స్థాయి పౌర సేవలు అందించేందుకు అమెరికాకు చెందిన ‘మాస్టర్ కార్డ్’తో రాష్ట్ర ప్రభుత్వం గురువారం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులతో పాటు ఇతర పౌర సేవా రంగాల్లో ఈ ఒప్పందం కీలకమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పౌర సేవలు, చిన్న తరహా వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను తమ ఎంవోయూ వేగవంతం చేస్తుందని మాస్టర్ కార్డ్ వైస్ చైర్మన్ మైఖేల్ ఫ్రొమన్ వెల్లడించారు.
ఈఎంపీఈ డయోగ్నొస్టిక్స్ యూనిట్
క్షయ వ్యాధి డయోగ్నొస్టిక్ కిట్‌ల అంతర్జాతీయ తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్లు స్వీడన్‌కు చెందిన ‘ఈఎంపీఈ డయోగ్నొస్టిక్స్’ ప్రకటించింది. రూ.25 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ యూనిట్‌లో నెలకు 20 లక్షల కిట్‌లను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తారు. తర్వాతి దశలో రూ.50 కోట్ల పెట్టుబడి పెడతామని సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ పవన్ అసలాపురం చెప్పారు.
హైదరాబాద్‌లో జీఎంఎం ఫాడ్లర్ విస్తరణ
ఫార్మా కంపెనీలకు అవసరమైన గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్‌లను తయారు చేసే జీఎంఎం ఫాడ్లర్ హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈఓ థామస్ కెహ్ల్, డబ్ల్యూఈఎఫ్ డైరెక్టర్ అశోక్ జె పటేల్ గురువారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. రెండేళ్ల క్రితం రూ.48 కోట్లకు పైగా పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన జీఎంఎం ఫాడ్లర్ అదనంగా మరో రూ.28 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. ఈ పెట్టుబడి ద్వారా సంస్థలో ఉద్యోగుల సంఖ్య 300కు చేరుకుంటుంది. కాగా హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ ఆసక్తి చూపింది.
Comments
Please login to add a commentAdd a comment