
ప్రియాంక రాకతో బీజేపీకి చుక్కలే : కమల్ నాథ్
దావోస్ : యూపీ (తూర్పు) కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం బీజేపీకి చావుదెబ్బ వంటిదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్నారు. అత్యధిక లోక్‌సభ సీట్లున్న యూపీలో ప్రియాంక ఆగమనం ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి ఎదురుదెబ్బేనని వ్యాఖ్యానించారు.
ప్రియాంక నేతృత్వంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ అత్యధిక స్ధానాలు కైవసం చేసుకుంటుందని కమల్ నాథ్ ధీమా వ్యక్తం చేశారు. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పార్టీని సమర్ధంగా నడిపించడంలో విఫలమైనందునే ప్రియాంక గాంధీని తెరపైకి తెచ్చారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.