సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఈ నెల 18 నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో అధిష్టానం నుంచి ఆమోదం పొందేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 14న దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆలోపే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి, హైకమాండ్ ఆమోదముద్ర వేయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల పేర్లతో పాటునామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కొందరి పేర్లతో కూడిన జాబితాను సీఎం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా ఈ విషయమై శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోనియాగాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అవుతారని తెలిసింది. పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుస్తారని సమాచారం.
ఆ ఇద్దరు ఎవరో..?
రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీలో అంతర్గతంగా చాలామంది పోటీ పడుతుండగా, సీఎం ఢిల్లీ వెళ్లడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్ అభిప్రాయాన్ని తీసుకుని అధిష్టానానికి నివేదించారు. రెండురోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి అభిప్రాయం కూడా పార్టీ పెద్దలు తీసుకున్నారు. కాగా ఈ స్థానాల కోసం ఎస్సీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గానికి చెందిన నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. అద్దంకి దయాకర్, మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్‌తో పాటు చిన్నారెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు.
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం?
గవర్నర్ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులు, ఎమ్మెల్యే నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా స్థానం భర్తీపై కూడా హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతుండగా, మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది.
నామినేటెడ్ పోస్టులకు పోటీ
పదుల సంఖ్యలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులకు నామినేట్ అయ్యేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. అయితే వీటిలో ప్రధానమైన కార్పొరేషన్ల విషయంలో, ఇటీవలి ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని నాయకులు, పార్టీ కోసం కష్టపడిన పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.
రాహుల్‌తో కలిసి ఇంఫాల్‌కు సీఎం
మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ప్రారంభం కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 14న ఢిల్లీ నుంచి రాహుల్‌తో కలిసి ఆయన ఇంఫాల్ వెళతారు. యాత్ర ప్రారంభం తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుని అదేరోజు సాయంత్రం దవోస్‌కు బయలుదేరి వెళ్తారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు సీఎం వెంట వెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment