దావోస్‌లో నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు
దావోస్: ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సోమవారం నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఐదు రోజుల పాటు జరగనుంది. మన దేశం తరఫున కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ నీతి ఆయోగ్ అధ్యక్షుడు పనగరియా, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు పాల్గొంటున్నారు. భారత సర్కారు చేపట్టిన డీమానిటైజేషన్, అమెరికాలో ట్రంప్ అధ్యక్ష పాలన ప్రపంచం వికేంద్రీకరణకు దారితీస్తుందన్న ఆందోళనలు ఈ సదస్సులో ప్రధాన చర్చనీయాంశాలు కానున్నాయి. ముఖ్యంగా భారత్‌పై ప్రత్యేక సమావేశం కూడా జరగనుంది. అవినీతికి వ్యతిరేకంగా కేంద్ర సర్కారు చేపట్టిన చర్యలు, పన్నుల సంస్కరణ కార్యక్రమాల(జీఎస్టీ)పై ప్యానలిస్టులు చర్చించనున్నారు. మనదేశం నుంచి 100కుపైగా సీఈవోలు హజరవుతారు.
టాటా గ్రూపు కొత్త చైర్మ న్‌గా ఇటీవలే ఎంపికైన ఎన్.చంద్రశేఖరన్ కూడా పాలు పంచుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 3,000 మందికిపైగా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. వీరిలో 1,200 మంది కంపెనీల సీఈవోలు కావడం విశేషం. బ్రిటిష్ ప్రధాని థెరెస్సా మే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, స్విస్ ప్రెసిడెంట్ డోరిస్‌లూథర్డ్, జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తదితర ప్రముఖులూ ఈ వేదికపై ఆసీనులు అవుతున్నారు. ఆర్థిక అసమానత్వం, సామాజిక విభజన, పర్యావరణ ముప్పు అన్నవి రానున్న పదేళ్లలో ప్రపంచం ఎదుర్కోనున్న పెద్ద సవాళ్లుగా డబ్ల్యూఈఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది.