
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి రావాలంటూ ఐటీ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుకు మరోమారు ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21 వరకు దావోస్‌లో జరగనున్న ఈ సమావేశానికి హాజరుకావాలని ఫోరం కోరింది. కోవిడ్–19 సంక్షోభం తర్వాత వినూత్న టెక్నాలజీ, విధానాలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి తన అనుభవాలను పంచుకోవాలని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రాండె కేటీఆర్‌ను కోరారు.
అధునాతన సాంకేతికతను సామాన్యుల ప్రయోజనాలకు వినియోగించుకునే అంశంపైనా తన అభిప్రాయాలను చెప్పాలని కోరారు. ‘ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించడం కోసం రాజకీయ, వ్యాపారరంగాలతోపాటు పౌర సమాజం కలిసి పనిచేయాల్సి ఉంది. ఆ దిశలో అందరం కృషి చేద్దాం’అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది.
ప్రగతికి దక్కిన గుర్తింపు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి అందిన ఆహ్వా నం తెలంగాణ వినూత్న విధానాలకు, ప్రగతి ప్రస్థానానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ఈ వేదికగా తెలంగాణను మరోమారు ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను ప్రపంచ దిగ్గజాలకు తెలియజేసి, రాష్ట్రానికి రావాలని కోరతానని వెల్లడించారు. తనకు ఆహ్వానం పంపిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ధన్యవాదాలు తెలిపారు.