దావోస్‌లో శుక్రవారం ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం లభించింది. ‘సమాజ ఉన్నతికి డిజిటల్ పరిజ్ఞాన ప్రయోజనాల ఉపయోగం’అనే అంశంపై శుక్రవారం జరిగిన చర్చాగోష్టిలో ఆయన ప్రసంగించారు. ఈ చర్చాగోష్టిలో కేటీఆర్ ఒక్కరే ఒక రాష్ట్ర మంత్రిగా ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. బెల్జియం, బ్రెజిల్, డెన్మార్క్, పోర్చుగల్, మయన్మార్, ఇండొనేసియా, నైజీరియా, లెబనాన్, బంగ్లాదేశ్, ఖతార్, పాకిస్తాన్ దేశాల కేంద్ర మంత్రులు ఇందులో పాల్గొన్నారు. డిజిటల్ తెలంగాణ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ) అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. ఇంటింటికీ తాగునీరందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగానే ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు టీ–ఫైబర్ ప్రాజెక్టు కింద ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలన్నింటినీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
పరిశోధనలకు మరింత ప్రాధాన్యం
దేశంలో పరిశోధనలకు మరింత ప్రాధాన్యం పెరగాల్సిన అవసరముందని, ఇందుకు దేశంలోని పరిశోధన సంస్థలు, ఉన్నత విద్యాసంస్థలు మరింత చొరవ చూపాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఇన్వెస్ట్ ఇండియా అధ్వర్యంలో దావోస్‌లో నిర్వహించిన ‘భారత్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్’అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రైవేటు రంగంలో పెద్ద సంస్థలు చేస్తున్న పరిశోధనలతో దేశంలోని విద్యా సంస్థల పరిశోధనలను అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలొస్తాయని సూచించారు. సిలికాన్ వ్యాలీ గొప్ప విజయాలు అందుకోవడానికి అక్కడి పరిశోధన సంస్థలే కారణమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని 50 పరిశోధన సంస్థలను అనుసంధానం చేస్తూ రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) ఏర్పాటు చేశామన్నారు. ఇస్రో లాంటి భారతీయ సంస్థలు తమ పరిశోధనల పటిమ, సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటాయని, అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఫలితాలు సాధించొచ్చని ఇస్రో విజయాలు నిరూపించాయన్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద కంపెనీల నుంచి కాకుండా స్టార్టప్స్ నుంచే వస్తాయని, అందుకే తెలంగాణలో ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రంగంలో ఆసక్తి ఉన్న కంపెనీలు టీ–హబ్, టీ–వర్క్స్, రిచ్‌లతో భాగస్వాములు అయ్యేందుకు ముందుకు రావాలన్నారు.
పరిశోధనల ప్రోత్సాహానికి టీ–వర్క్స్
హార్డ్‌వేర్ రంగంలో స్టార్టప్‌ల ద్వారా పరిశోధనలు ప్రోత్సహించేందుకు టీ–వర్క్స్ ఇంక్యూబేటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిశోధనల ద్వారానే అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలకు సత్వర పరిష్కారాలు లభిస్తాయని కేటీఆర్ తెలిపారు. పరిశోధన ఫలితాలు, మేధో సంపత్తిని కాపాడేందుకు తెలంగాణ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్ (టిప్కు)ను ఏర్పాటు చేశామన్నారు. సమావేశం అనంతరం కేటీఆర్ కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుతో సమావేశమయ్యారు. సేల్స్ ఫోర్స్ కంపెనీ సీఈవో మార్క్ బేనియఫ్ దావోస్‌లో కేటీఆర్ కోసం విందు ఏర్పాటు చేశారు. అనంతరం సేల్స్ ఫొర్స్ సంస్థ ప్రెసిడెంట్ అమీ వీవర్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు.
సుజ్లాన్ చైర్మన్‌తో భేటీ
సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం ముందు వరుసలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రముఖ పవన విద్యుత్ కంపెనీ సుజ్లాన్ చైర్మన్ తులసి తంతితో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పవన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సుజ్లాన్ ఆసక్తిగా ఉన్నదని తులసి తంతి తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం బలోపేతం కోసం చేస్తున్న చర్యల వల్ల భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు.
దావోస్‌లో గణతంత్ర వేడుకల్లో కేటీఆర్
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు ప్రాంగ ణంలోని ఇన్వెస్ట్ ఇండియా పెవిలియన్ వద్ద గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జాతీయ పతాకాన్ని ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఏపీ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment