సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం దావోస్ పర్యటనకు సిద్ధమైంది. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు.
వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీలు
రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది.
ఇందులో నోవార్టీస్, మెడ్ ట్రానిక్స్, ఆ్రస్టాజనిక్, గూగుల్, ఉబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు ఉన్నారు. భారత్‌కు చెందిన టాటా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్‌టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులు, సీఐఐ, నాస్కాం వంటి చాంబర్స్ ప్రతినిధులతోనూ రాష్ట్ర బృందం సమావేశం కానుంది. దావోస్ పర్యటనలో భాగంగా ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహారశుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సీఎం బృందం సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ఏఐపై శ్రీధర్‌బాబు ప్రసంగం: కృత్రిమ మేధ (ఏఐ) పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో ‘‘డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఏఐ’’అనే అంశంపై మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడనున్నారు. టెక్ కంపెనీలు, వర్తక సంస్థలు, ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలను కూడా రాష్ట్ర బృందం కలవనున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే బోర్జ్‌తో సమావేశం కానున్నట్టు తెలిపారు.
తెలంగాణతో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు బలమైన వ్యవస్థీకృత సంబంధాలు ఉన్నాయని.. హెల్త్ కేర్– లైఫ్ సైన్సెస్ రంగంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలోని ‘సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండ్రస్టియల్ రెవెల్యూషన్ (సీ4ఐఆర్)’సదస్సు హైదరాబాద్‌లో జరగబోతోందని గుర్తు చేశారు. దావోస్ పర్యటనలో తెలంగాణ బలాబలాలను, ప్రాధాన్యతలను చాటనున్నట్టు వివరించారు.
ఫోరం చర్చల్లో మాట్లాడనున్న రేవంత్
తొలిసారి దావోస్ పర్యటనలోనే సీఎం రేవంత్‌రెడ్డికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో మాట్లాడే అవకాశం దక్కింది. అక్కడ జరిగే చర్చాగోష్టిలో.. పురోగమిస్తున్న వైద్యరంగంపై రేవంత్ తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ‘‘ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్’’అంశంపై జరిగే అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొని ‘అగ్రి–ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం–రైతుల జీవనోపాధి పరిరక్షణలో భాగంగా వాతావరణానికి అనుగుణంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యల’పై సీఎం ప్రసంగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment