సాక్షి, అమరావతి: ‘‘నా ప్రతిభను ప్రపంచ దేశాలు గుర్తించాయి. అందుకే దేశంలో ఏ ముఖ్యమంత్రినీ పిలవని విధంగా కేవలం నన్ను మాత్రమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాలకు పిలుస్తారు’’... ఇవీ చంద్రబాబు నాయుడు తరచూ చెప్పే మాటలు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, డబ్ల్యూఈఎఫ్ సదస్సులకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబును ప్రత్యేకంగా ఎప్పుడూ పిలవలేదని, ఆయనే రూ.కోట్లు ఖర్చు పెట్టి టిక్కెట్లు కొనుక్కొని వెళ్లినట్లు సాక్ష్యాలతో సహా బయటపడింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) ద్వారా దావోస్‌లో రూ.కోట్లు పెట్టి లాంజ్‌లను కొనుగోలు చేసి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వానికి సీఐఐ సమర్పించిన బిల్లులే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.
దావోస్‌లో లాంజ్‌ను కొనుగోలు చేయడానికి ఎంత మొత్తం చెల్లించాలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డుకు(ఏపీఈడీబీ) రాసిన లేఖలో సీఐఐ వివరంగా పేర్కొంది. ఆ మొత్తాన్ని చెల్లించమని కోరింది. రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేసిన లాంజ్‌ల్లో సీఐఐ ద్వారా సమావేశాలు నిర్వహించి, తనను చూసి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటూ చంద్రబాబు ప్రచారం చేసుకునేవారు. 2019 జనవరిలో జరిగిన దావోస్ సమావేశాలకు అయిన ఖర్చు రూ.14.41 కోట్లు చెల్లించాలంటూ సీఐఐ బిల్లు సమర్పించింది. దీనిపై 18 శాతం జీఎస్టీ, ఇతర సుంకాలను కలిపితే ఈ మొత్తం రూ.17 కోట్లు దాటుతోంది. ఇందులో కేవలం ఏపీ లాంజ్ అద్దె రూ.2.48 కోట్లు. ఆ లాంజ్‌ను కంప్యూటర్లు, సోఫాలతో అందంగా తీర్చిదిద్దినందుకు రూ.2.51కోట్లు, నాలుగు రోజుల భోజనాలకు రూ.1.05 కోట్లు బిల్లు వేసింది. విచిత్రం ఏమిటంటే ఎల్‌ఈడీ తెరకు ఏకంగా రూ.1.45 కోట్ల బిల్లు వేశారు. 2018 సమావేశాలకు కూడా సీఐఐ రూ.9.86 కోట్ల బిల్లును సమర్పించింది. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారు.
ప్రత్యేక విమానాలు,బస ఖర్చులు అదనం
ఇవి కేవలం దావోస్‌లో లాంజ్ ఏర్పాటు, అక్కడి సమావేశాలకు అయిన ఖర్చు మాత్రమే. ఇది కాకుండా చంద్రబాబు తన మందీ మార్బలంతో వెళ్లిన ప్రత్యేక విమానాలు, బస వంటి ఖర్చులు కలుపుకుంటే ఈ వ్యయం రెండింతలవుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చంద్రబాబు ఏటా క్రమం తప్పకుండా దావోస్ సమావేశాలకు హాజరై, రూ.వేల కోట్ల పెట్టుబడులు, భారీగా పరిశ్రమలు వస్తున్నాయంటూ ప్రచారం చేశారు. కానీ ఇందులో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు.
సీఐఐ దావోస్ బిల్లు కాపీ
Comments
Please login to add a commentAdd a comment