ఏపీకి పెట్టుబడులతో రండి
► యూరప్ తెలుగు సమాజానికి చంద్రబాబు పిలుపు
► జ్యూరిచ్‌లో ప్రవాస భారతీయులతో ముఖ్యమంత్రి భేటీ
► ఏపీని విద్య, వైజ్ఞానిక నిలయంగా మారుస్తామని వెల్లడి
► దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు స్వాగత సమావేశంలో పాల్గొన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా యూరప్ తెలుగు సమాజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనే ముందు ఆయన జ్యూరిచ్‌లో కొద్దిసేపు ఉన్నారు.
స్థానిక ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులు, వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలుగు సంఘం నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... యూరోపియన్ దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తమ విధానాలు, పద్ధతులతో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేయవచ్చని చెప్పారు. సరికొత్త ఆలోచనలను ఆహ్వానించడానికి తాను దేశ విదేశాల్లో పర్యటిస్తున్నానని తెలిపారు.
ప్రవాస భారతీయుల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఏపీ ఎన్‌ఆర్‌టీ పేరుతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల ప్రముఖులను ఆహ్వానించి ఏపీని విద్య, వైజ్ఞానిక నిలయంగా మార్చనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీ సీఎం రమేష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ , ఏపీ ఎన్‌ఆర్‌టీ అధ్యక్ష, కార్యదర్శులు జయకుమార్, కారం సురేష్ పాల్గొన్నారు.
కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ
ఎథికల్ కాఫీ కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇప్పటికే ఏపీలో ఉన్న కాఫీ కంపెనీని తీసుకుంటామని, లేదంటే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మియర్ బర్గర్ కంపెనీ ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమయ్యారు. సోలార్ ప్యానెళ్ల తయారీ కంపెనీ స్థాపనకు ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. ఫండ్ మేనేజింగ్ రంగంలో ప్రసిద్ధిగాంచిన బీహెచ్‌ఎం కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. బయోటెక్, మెడికల్ సైన్స్, డయోగ్నొస్టిక్ మెడికల్ పరికరాల ఉత్పత్తి సంస్థల ఏర్పాటుకు కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్‌లో పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సిందిగా స్విట్జర్లాండ్ కంపెనీలను చంద్రబాబు కోరారు.
24న సింగపూర్ పర్యటన
సీఎం తొలిరోజు దావోస్ పర్యటన విజయవంతమైందని, రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ప్రకటించింది. అంతకు ముందు భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు బృందం జ్యూరిచ్‌కు చేరుకుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. రాత్రి పదిన్నర గంటలకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు స్వాగత సమావేశంలో, కాంగ్రెస్ సెంటర్‌లో భారతీయులు నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు ఈ నెల 24న సింగపూర్‌లో పర్యటించి నూతన రాజధాని నిర్మాణంపై ఆ దేశ మంత్రి ఈశ్వరన్ తదితరులతో చర్చించనున్నారు.