సాక్షి, అమరావతి: ఎలక్రానిక్స్ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2021–24కి భారీ పెట్టుబడులు తీసుకువచ్చే సత్తా ఉందని పారిశ్రామిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఉత్పత్తి ఆథారిత రాయితీలను ప్రత్యేకంగా ఇవ్వడం విశేషమని పేర్కొంటున్నారు. సెమీ కండక్టర్, ఎల్‌సీడీ ఫ్యాబ్స్‌లో రూ.7,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే వారికి మరిన్ని అదనపు రాయితీలు ఇస్తామని ప్రకటించడం వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రోత్సాహకాలు ఇలా..
ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2021–24లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి, వెయ్యి మందికి ఉపాధి కల్పించే సంస్థలకు ఈ పాలసీ వర్తిస్తుంది. ఏటా పెరిగే ఉత్పత్తి ఆధారంగా గరిష్టంగా 5 శాతం వరకు సబ్సిడీ ఇస్తారు. ఇలా పదేళ్లపాటు సబ్సిడీ లభిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఈఎంసీ–1, ఈఎంసీ–2కి అదనంగా కొత్తగా కొప్పర్తిలో నిర్మిస్తున్న వైఎస్సార్ ఈఎంసీ వంటి గ్రీన్‌ఫీల్డ్ ఈఎంసీల్లో ఏర్పాటయ్యే సంస్థలకు యూనిట్ విద్యుత్ రూ.4.50కే అందుతుంది. ఏడాదికి గరిష్టంగా రూ.50 లక్షల వరకు రవాణా వ్యయంలో రాయితీ లభిస్తుంది. సెమీ కండక్టర్, ఎల్‌సీడీ ఫ్యాబ్స్‌ల్లో రూ.7,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే సంస్థలకు మరిన్ని అదనపు రాయితీలు అందుతాయి. గరిష్టంగా ఏడాదికి రూ.1.50 కోట్ల వరకు ఐదేళ్లపాటు 5 శాతం వడ్డీకే రుణాలు అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు విద్యుత్, ఇన్‌పుట్ సబ్సిడీల్లో అదనపు రాయితీలు లభిస్తాయి.
ఎలక్ట్రానిక్స్ పాలసీని ఆహ్వానిస్తున్నాం
ఏ రాష్ట్రంలో లేనివిధంగా భారీ ఉత్పత్తి ఆధారిత రాయితీలను ప్రకటించడం, ఎలక్ట్రానిక్స్ రంగం కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వంటి పలు నిర్ణయాల వల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయి. ఎలక్ట్రానిక్స్ రంగం నైపుణ్యం గల మానవ వనరుల కొరత ఎదుర్కొంటోంది. దీనిని పరిష్కరించేందుకు నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం.
–డి.రామకృష్ణ, సీఐఐ ఏపీ చాప్టర్ మాజీ చైర్మన్
పెట్టుబడులు ఆకర్షించే సత్తా ఉంది
భారీ రాయితీలు ప్రకటించడంతో కొత్త పెట్టుబడులను ఆకర్షించే సత్తా ఈ పాలసీకి ఉంది. వైఎస్సార్ జిల్లాలో కొత్త ఈఎంసీని అభివృద్ధి చేస్తూ అక్కడ ఏర్పాటు చేసే కంపెనీలకు అదనపు రాయితీలు ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. కేంద్రం ప్రకటించిన పీఎల్‌ఐకి అదనంగా రాష్ట్రం మరిన్ని రాయితీలు ప్రకటించడంతో కంపెనీలు క్యూ కడతాయి.
– సీవీ అచ్యుతరావు,అధ్యక్షుడు, ఫ్యాప్సీ
మానవ వనరులు అందించే బాధ్యత మాది
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎల్‌ఐ స్కీం ప్రకారం కొత్తగా పెట్టుబడులు పెట్టే సంస్థలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా కొత్త కార్యక్రమాలను చేపడుతున్నాం. దీనివల్ల ఎలక్ట్రానిక్స్ రంగంలో రాష్ట్రం కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుంది.
– మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి
మహిళలకు పెద్దఎత్తున ఉద్యోగాలు
రాష్ట్రంలో కొత్త ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్‌ను ప్రోత్సహిస్తున్నాం. ఇందులో భాగంగా కొప్పర్తిలో అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ ఈఎంసీలో పెట్టుబడులు పెట్టే వారికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను అందిస్తున్నాం. కొత్త ఎలక్ట్రానిక్స్ పాలసీ ద్వారా మూడేళ్లలో వచ్చే 39 వేల ఉద్యోగాల్లో మహిళలకు అత్యధికంగా ఉంటాయి.
– జి.జయలక్ష్మి, కార్యదర్శి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment