సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగం శరవేగంగా విస్తరిస్తోందని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. ఎల్రక్టానిక్స్, టెలికాం నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం సత్ఫలితాలను ఇస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి శుక్రవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
2021లో పీఎల్‌ఐ పథకం ప్రారంభించిన తర్వాత అతి తక్కువ కాలంలోనే దేశంలో టెలికాం ఉత్పత్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ చర్యల కారణంగా 2014–15లో రూ.1,80,000 కోట్లు ఉన్న ఎల్రక్టానిక్ పరికరాల ఉత్పాదన 2022–23 నాటికి రూ.8,22,000 కోట్లకు చేరుకుందన్నారు. 2014లో 78 శాతం మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకోగా, మేడిన్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 99.2 శాతం మొబైల్ ఫోన్ల తయారీ దేశంలోనే జరుగుతోందని మంత్రి వివరించారు.
తూర్పు తీరంలో సమృద్ధిగా మత్స్య సంపద
ఆంధ్రప్రదేశ్ సహా తూర్పు తీర రాష్ట్రాల్లో మత్స్య సంపద నిల్వలు సమృద్ధిగా (97 శాతం) ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) ప్రచురించిన మెరైన్ ఫిష్ స్టాక్ స్టేటస్ ఆఫ్ ఇండియా–2022 నివేదికలో పేర్కొన్నట్లు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. 2022లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అధ్యయనం చేసిన 135 ఫిష్ స్టాక్ ప్రాంతాల్లో 91.1% మంచి నాణ్యత, పరిమాణం గల చేపల లభ్యత ఉన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఫిషరీస్ మెనేజ్‌మెంట్ పాలన వ్యవస్థ కింద ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా సముద్ర చేపల నిల్వల స్థితి అంచనా వేసి, అన్ని వివరాలతో కూడిన పూర్తి సమాచారం అందించడమే ఈ అధ్యయనం ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. మేనేజ్‌మెంట్ యూనిట్స్ నిర్వచించిన ప్రకారం చేపల పంట స్థాయి, సమృద్ధి ఆధారంగా బయోలాజికల్ స్థిరత్వం కోసం ఫిష్ స్టాక్స్ అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మెరైన్ ఫిష్ స్టాక్ స్టేటస్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో రాష్ట్రాలవారీగా ఫిష్ స్టాక్స్ అంచనా వేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment