సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీ సమయంలో ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ధారించిన ఫీజులకు అంగీకరించి కౌన్సెలింగ్‌లో పాల్గొన్న కాలేజీలు.. విద్యా సంవత్సరం మధ్యలో కోర్టులకెళ్లి ఫీజులను పెంచడం సరికాదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఫీజుల పెంపు విషయంలో విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఇందుకు సంబంధించి కోర్టు ఆదేశాలపై వెకేట్ పిటిషన్ దాఖలు చేశామని, అప్పీల్‌కు కూడా వెళ్తామన్నారు. గురువారం జేఎన్‌టీయూలో కడియం విలేకరులతో మాట్లాడారు.
కాలేజీల ఫీజులను ఏటా అడ్మిషన్లకు ముందే ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయిస్తుందని, ఈసారీ అలాగే చేసిందని.. ఆ ఫీజులకు కాలేజీలు అంగీకరించిన తర్వాతే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. కానీ విద్యా సంవత్సరం మధ్యలో కోర్టుకెళ్లి ఫీజులను పెంచుతూ కాలేజీల యాజమాన్యాలు అనుమతి తెచ్చుకున్నాయన్నారు. రూ.1,13,000 ఫీజును రూ. 2 లక్షలకు పెంచుతూ అనుమతి తెచ్చుకుని ఆ మొత్తం కట్టమనడంతో తల్లిదండ్రులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
ఫీజులు పెంపు తల్లిదండ్రులకు భారం అవుతుందనే తిరస్కరించామని తెలిపారు. ఫీజులు పెంచుకోవాలంటే వచ్చే ఏడాది కమిటీ ఆమోదం పొంది పెంచుకోవాలని కాలేజీలకు సూచించారు. అడ్మిషన్ల సమయంలోనే తల్లిదండ్రుల నుంచి ఫీజు పెంపునకు సంబంధించి అఫిడవిట్లు తీసుకున్నామనే అంశం ప్రభుత్వ దృష్టిలో లేదని కడియం అన్నారు. కమిటీ నిర్ణయానికి భిన్నంగా తల్లిదండ్రుల వద్ద అఫిడవిట్లు తీసుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఫీజుల పెంపుపై ఫీజుల నియంత్రణ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment