Vocational Training Institution
-
ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు అంత ఈజీ కాదు
సాక్షి, అమరావతి: ప్రయివేటు రంగంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యాసంస్థలకు ఇక ఫుల్స్టాప్ పడనుంది. ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీలను కట్టడి చేయాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి నిర్ణయించింది. ఇష్టానుసారంగా అనుమతులు మంజూరు చేయకుండా ఇకపై ఆయా రాష్ట్రాల అవసరం మాత్రమే కాలేజీల ఏర్పాటుకు అనుమతించనుంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాలనుంచి ముందుగానే ప్రణాళికలను తెప్పించి వాటి ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయా కాలేజీల్లో ఉన్న సదుపాయాలు, ల్యాబ్‌లు, ఇతర ఏర్పాట్లు, ప్రమాణాల తీరు తదితర అంశాలపై ఆగస్టులోగా తమకు నివేదికలు పంపాలని ఏఐసీటీఈ రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పండాదాస్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వంతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసే ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతులు ఇస్తూ పోతోంది. ఆయా కాలేజీల్లో సదుపాయాలు ఇతర ఏర్పాట్లపై పైపై పరిశీలనతోనే సరిపెడుతోంది. ఏఐసీటీఈ అనుమతి వచ్చాక రాష్ట్ర వర్సిటీలు, ప్రభుత్వం వాటికి గుర్తింపు ఇవ్వక తప్పనిపరిస్థితి. దీంతో వందలాదిగా కాలేజీలు పుట్టుకొచ్చి సీట్ల సంఖ్య లక్షలకు చేరుకుంది. ఏటా వేలాది సీట్లు మిగిలిపోతున్నాయి. రాష్ట్రంలో యూనివర్సిటీ కాలేజీలు 20, ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలు 287 ఉన్నాయి. వీటిలో వివిధ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి మొత్తం 1,38,953 సీట్లు ఉన్నాయి. వర్సిటీ కాలేజీల్లో 4,834, ప్రయివేటు కాలేజీల్లో 1,34,119 ఉన్నాయి. ప్రయివేటు కాలేజీల్లోని వివిధ కోర్సులకు డిమాండ్ లేక, విద్యార్ధులు చేరక వేలాది సీట్లు భర్తీ కావడం లేదు. ఫలితంగా కొన్ని కాలేజీలు స్వచ్ఛందగా ఆయా కోర్సులను రద్దుచేసుకొనేందుకు దరఖాస్తు చేసుకుంటున్నాయి. దీనికి కారణం రాష్ట్రం అవసరాలను చూడకుండా కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడమే అని గుర్తించి నూతన విధానం తీసుకువచ్చారు. ప్రమాణాల పెంపుకోసమే... ఇంజనీరింగ్ సహా ఆయా వృత్తి విద్యాకోర్సుల్లో ప్రమాణాల పెంపునకు వీలుగా ఏఐసీటీఈ తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ కొత్త విధానం వస్తోంది. ఇంజనీరింగ్ విద్యపై ప్రొఫెసర్ మోహన్‌రెడ్డి కమిటీ నివేదిక మేరకు పలు చర్యలు తీసుకుంటోంది. దీనికోసం సాంకేతిక విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపు కార్యక్రమం కింద ప్రపంచ బ్యాంకు నిధులు రాష్ట్రానికి అందనున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాల మెరుగుదల, ఉపాధి అవకాశాల కల్పన, కమ్యూనికేషన్ స్కిల్స్, డొమైన్ స్కిల్స్ మరింతగా పెంపొందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. కాలేజీలకు పారిశ్రామిక అనుసంధానం ద్వారా విద్యార్థుల్లో మెలకువలను పెంపొందించనున్నారు. అలాగే నేటి పారిశ్రామిక అవసరాలు, రోజురోజుకు మారిపోతున్న సాంకేతికతల నేపథ్యంలో ప్రస్తుతమున్న కోర్సుల్లోనూ అనేక మార్పులు చేయనున్నారు. సాంప్రదాయంగా ఉన్న సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ వంటి కోర్సుల్లో కొత్త సాంకేతిక అంశాలను చొప్పించనున్నారు. కొత్త అంశాలతో కోర్సులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆటోమేషన్, మెకట్రానిక్స్, బ్లాక్‌చైనా, డాటా సైన్సెస్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్ తదితర కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. క్షేత్రస్థాయి అభ్యసనానికి ప్రాధాన్యం నాలుగు గోడల మధ్య థియరీలను వినడం, చదవడం ద్వారా కాకుండా క్షేత్రస్థాయిలో అభ్యసనానికి శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్నది ఏఐసీటీఈ అభిప్రాయం. ఇప్పటికే ఈ దిశగా అన్ని యూనివర్సిటీలకు కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. రానున్న ఏడాదినుంచి పారిశ్రామిక అనుసంధానాన్ని మరింత పెంచి విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యతనిస్తారు. పారిశ్రామిక శిక్షణ, ఇంటర్న్‌షిప్, ప్రయోగశాలల్లో పరిశోధనలకు పెద్దపీట వేయనున్నారు. -
ఉపాధికి ఊతం
ఎటపాకలోని ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్(వీటీఐ) ద్వారా ప్రస్తుతం 82 మంది శిక్షణ పొందుతున్నారు. జీపు డ్రైవింగ్, మెకానిజం, ప్లంబింగ్, కనస్ట్రక్షన్, బోర్వెల్ మెకానిక్ తదితర ట్రేడ్లలో తర్ఫీదు ఇస్తున్నారు. మూడు నెలల ఈ శిక్షణ పూర్తయిన తర్వాత ఐటీడీఏ ద్వారా ఉపాధి కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. జీపు డ్రైవింగ్ నేర్చుకున్న వారికి లెసైన్సు ఇప్పించటంతో పాటు, ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే వాహనాలను వారే నడిపించేందుకు అవకాశం కల్పించనున్నారు. బోర్వెల్ మెకానిక్‌లో శిక్షణ పొందిన వారికి పంచాయతీల్లో, కన్స్ట్రక్షన్ తర్ఫీదు పొందిన వారికి గృహ నిర్మాణ సంస్థల్లో పనులు కల్పించనున్నారు. వీటీఐకి పూర్వవైభవం గిరిజన నిరుద్యోగ యువతీ, యువకలకు ఉపాధిని కల్పించేందుకు భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎటపాక సమీపంలో 1997లో వీటీఐను ఏర్పాటు చేశారు. దీని ద్వారా రూ.1.04 కోట్లను ఖర్చు చేసి 1,503 మంది గిరిజనుల స్వయం ఉపాధి కోసం వివిధ ట్రేడ్లలో శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలోనే దీనికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ సంస్థ కూడా గుర్తింపునిచ్చింది. కొండరెడ్లకు వెదురు ఉత్పత్తుల తయారీనే ప్రధాన జీవనాధారమని గుర్తించిన అప్పటి అధికారులు, ఈ కేంధ్రం ద్వారా బాంబో క్రాప్ట్స్ తయారీపై శిక్షణ ఇప్పించారు. తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కూడా కల్పించి వారికి ఇతోధికంగా సహాయపడ్డారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ సంస్థకు నిధుల కొరత కారణంగా 2011లో మూతపడింది. ఆ తర్వాత వచ్చిన ప్రాజెక్టు అధికారులు దీనిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో వీటీఐ మూత పడినట్లేనని అంతా భావించారు. కానీ ప్రస్తుత పీఓ దివ్య మళ్లీ దీనికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రద్ధ చూపుతున్నారు. ఉపాధికి మళ్లీ పునాది ఐటీడీఏలో ప్రతి సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్‌లో ఎక్కువ మంది ఉపాధి కోసం దరఖాస్తులు చేస్తున్నారు. ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఉన్నప్పటికీ, ఇలా దర్బార్‌కు ఎందుకొస్తున్నారని పీఓ దివ్య ఆరా తీశారు. కొన్నేళ్లుగా ఎంప్లాయిమెంట్ కార్యాలయం ద్వారా నియామకాలు లేకపోవడమే కారణమని తెలుసుకున్న ఆమె దీనిపై సమీక్షించారు. ఏజెన్సీలోని ప్రభుత్వ శాఖల్లో ఏ చిన్నపాటి ఉద్యోగమైన ఎంప్లాయిమెంట్ సిఫార్సు ద్వారా కల్పించాలని ఆదేశాలు ఇస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే వీటీ ఐ మూత పడిన విషయాన్ని తెలుసుకున్నారు. గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి వైపు మళ్లించేందుకు వీటీఐ అవసరం ఎంతైనా ఉందని గుర్తించిన పీవో దీన్ని తెరిపించేందుకు ప్రతిపాద నలు తెప్పించుకున్నారు. శిక్షణ కోసం రూ. 9.17 లక్షలు విడుదల చేశారు. దీంతో వీటీఐలో 19వ బ్యాచ్ ప్రారంభమైంది. శాశ్వత కేటాయింపులు లేకనే... వీటీ ఐను మంచి ఆశయంతో నిర్వహిస్తున్నప్పటికీ, ఐటీడీఏ అధికారుల ద యా దాక్షణ్యాలుంటేనే శిక్షణలు కొనసాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం నిధుల కొరత. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ సంస్థ గుర్తింపు ఉన్నప్పటికీ దీనికి శాశ్వత నిధులు లేకపోవటం వల్లే ఈ సమస్య తలెత్తుతోంది. సొంత మార్కు కాకుండా గిరిజనాన్ని దృష్టిలో పెట్టుకుని పాలనే సాగించే అధికారులున్నంత కాలం దీని నిర్వహణ ఢోకా లేకున్నప్పటికీ ఐటీడీఏ అధికారులు మారినప్పుడల్లా ఇది ప్రశ్నార్థకమే. ఈ కారణంగానే మూడేళ్ల పాటు మూత వేయాల్సి వచ్చింది. దీని నిర్వహణకు ఆటంకం లేకుండా ప్రభుత్వం ద్వారా తగిన నిధులు రాబట్టేందుకు ప్రస్తుత పీఓ దృష్టి సారించాలని గిరిజన యువత కోరుతోంది. ఇది పీఓ దివ్య వల్ల సాధ్యమవుతుందనే నమ్మకాన్ని కూడా గిరిజన సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రలో విలీనంతో పయనమెటు..? వీటీఐ ఉన్న ఎటపాక ప్రాంతం ఏపీలో విలీనమైంది. దీని కోసం ఇటీవల నిర్మించిన భవనాల్లో ఏపీ పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చే యాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇక్కడ ఉన్న సంస్థను జిల్లాలోని వేరే చోటికి తరలించక తప్పలేదు. దీనిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఐటీడీఏ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.