సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి మొదలవనుంది. ఎంసెట్ అర్హులు ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 28 నుంచి అభ్యర్థులు అవసరమైన ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఉన్నత విద్యామండలి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటివరకూ కౌన్సెలింగ్‌లో పాల్గొనే కాలేజీలు, ఉండే సీట్ల వివరాలు మాత్రం ఎంసెట్ కౌన్సెలింగ్ విభాగానికి అందలేదు.
ఎంసెట్ కౌన్సెలింగ్‌లో దాదాపు 145 కాలేజీలు పాల్గొంటాయి. వాటికి సంబంధించిన జాబితాను గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు పంపాల్సి ఉంటుంది. వాటిల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? ఏయే బ్రాంచీల్లో సీట్లు ఉన్నాయి? అనే వివరాలు అందించాలి. దీని ఆధారంగా కౌన్సెలింగ్ చేపడతారు. సకాలంలో అప్షన్లు ఇస్తే తప్ప వచ్చే నెల మొదటి వారంలో తొలిదశ సీట్లు వెల్లడించడం సాధ్యం కాదు.
ఆప్షన్లు ఇవ్వడానికి అన్ని కాలేజీలు, సీట్ల వివరాలు పొందుపర్చకపోతే ఎలా సాధ్యమని అధికారులే అంటున్నారు. కొన్ని కాలేజీల్లో ఇప్పటికీ విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వలేదు. ఈ ఏడాది ఎంసెట్‌కు 1,95,275 మంది హాజరైతే 1,56,879 మంది అర్హత సాధించారు. వారంతా ఇప్పుడు కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఏ బ్రాంచిలో ఎన్ని సీట్లు ఉంటాయో?
అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం చాలా కాలేజీలు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని డిమాండ్ ఉన్న కోర్సుల్లో పెంచుకొనేందుకు అనుమతి కోరుతున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు తగ్గించుకొని, సీఎస్‌సీ, సీఎస్‌సీ సైబర్ సెక్యూరిటీ, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి బ్రాంచీల్లో సీట్లు పెంచాలని దరఖాస్తులు పెట్టుకున్నాయి. గతేడాది 95 శాతం కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు భర్తీ అయ్యాయి.
సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో కనీసం 50 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదు. అయితే ఒకేసారి సంప్రదాయ కోర్సులను ఎత్తేస్తే ఇబ్బంది ఉంటుందని విశ్వవిద్యాలయాలు అనుమతులు ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా దాదాపు 100 కాలేజీలు బ్రాంచీల మార్పు కోసం ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు సంబంధిత కాలేజీలకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. మౌలికవసతులు, ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలకే అనుబంధ గుర్తింపుతోపాటు సీట్ల మారి్పడిని పరిశీలిస్తామని చెప్పారు. దీంతో ఏయే కాలేజీలు ఈ జాబితాలో ఉన్నాయనేది స్పష్టం చేయాల్సి ఉంటుంది.
స్పష్టత లేకుండా ముందుకెళ్లడం ఎలా?
రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. తొలిదశలో సాధారణంగా 75 వేల సీట్లను కౌన్సెలింగ్‌లో ఉంచుతారు. కొన్ని కాలేజీల్లో అఫిలియేషన్ పూర్తవ్వకపోవడం, మౌలికవసతులు, ఫ్యాకల్టీ సమకూర్చుకొనేందుకు ఆయా కాలేజీలకు మరికొంత అవకాశం ఇవ్వడంతో మొదటి విడత కౌన్సెలింగ్‌లో కొన్ని కాలేజీలను చేర్చరు.
అయితే ఈసారి పెద్ద మొత్తంలో కాలేజీల జాబితా అందలేదని అధికారులు చెబుతున్నారు. వాటిని రెండో విడతలో చేర్చడం వల్ల కొందరు విద్యార్థులకు నష్టం జరుగుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. సాధారణంగా తొలి విడతలో కొంతమంది ఆప్షన్లు ఇవ్వరు. దీనివల్ల తక్కువ ర్యాంకు ఉన్న వాళ్లకు కూడా మంచి కాలేజీ, మంచి బ్రాంచీల్లో సీట్లు వచ్చే వీలుంది.
ఇప్పుడు అన్ని కాలేజీలు, సీట్లు అందుబాటులో లేకపోతే అలాంటి వాళ్లకు ఇబ్బంది కలిగే వీలుంది. ఆప్షన్లు ఇచ్చే సమయానికైనా అన్ని సీట్లు, కాలేజీల వివరాలు పంపాలని ఉన్నత విద్యామండలి అన్ని యూనివర్సిటీలపై ఒత్తిడి తెస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. లేనిపక్షంలో ఆప్షన్లు ఇచ్చే గడువు పొడిగింపుపై ఆలోచించక తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment