జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే చందంగా మారింది. ఎంసెట్‌లో ఆశించిన విధంగానే విద్యార్థులు అర్హత సాధించినా ఆ స్థాయిలో విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరలేదు. దీంతో యాజమాన్యాలు కలవరం చెందుతున్నాయి.
నెల్లూరు(టౌన్): జిల్లాలో తొలి విడత ఎంసెట్ కౌన్సెలింగ్ మంగళవారంతో ముగిసింది. జిల్లాలో ఆయా కళాశాలల సీట్లు భర్తీని ఒకసారి పరిశీలిస్తే కేవలం మూడు కళాశాలల్లో 80శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. మరో నాలుగు కళాశాలల్లో 10 శాతం సీట్లు కూడా భర్తీ కాకపోవడంపై చర్చనీయాంశమైంది. జిల్లా వ్యాప్తంగా ఆయా ఇంజినీరింగ్ కళాశాలల్లో తొలి విడత కౌన్సెలింగ్‌లో 55.60 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ దశలో సీట్లు భర్తీకాని కళాశాలల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నెల్లూరు నారాయణ కళాశాల్లో 87.57శాతం, గీతాంజలి కళాశాల్లో 83.60 శాతం, .వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో 83.33 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మరో నాలుగు కళాశాలల్లో వరుసగా 9.52శాతం, 6.67శాతం, 6.35 శాతం, 2.72శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 50 శాతానికి పైగా ఏడు ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, 10కి పైగా 50 శాతానికి లోపు సీట్ల భర్తీ అయిన ఎనిమిది కళాశాలలు ఉన్నాయి. దీంతో ఈ కళాశాలల పరిస్థితి దయనీయంగా మారింది.
సీఎస్‌ఈకే డిమాండ్
జిల్లాలో 22 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో సివిల్, సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, ఎంఈసీఎచ్, ఐటీ తదితర కోర్సులు ఉన్నాయి. అయితే ఎక్కువగా సీఎస్‌ఈ కోర్సునే విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నారు. జిల్లాలో ఆయా కళాశాలల్లో సీఎస్‌ఈ 1,617 సీట్లు ఉండగా 1,133 సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్‌లో 997కు గాను 389, ఈసీఈ 1,900 సీట్లకు 1,182, ఈఈఈలో 839కి 332 సీట్లు, ఎంఈసీఎచ్‌లో 808కి 392 సీట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులో 84 సీట్లకు 44 సీట్లు భర్తీ అయ్యాయి. అదే శాతంతో పోలిస్తే సీఎస్‌ఈలో 70.01శాతం, సివిల్ 39శాతం, ఈసీఈ 62.2 శాతం, ఈఈఈలో 39.6శాతం, ఎంఈసీఎచ్‌లో 48.5శాతం, ఐటీలో 52.4శాతం మంది విద్యార్థులు చేరారు. జిల్లాలోని ఆయా ఇంజినీరింగ్ కళాశాలల్లో 6,245 సీట్లు ఉండగా, తొలి విడత కౌన్సెలింగ్‌లో 3,472 మంది విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరారు.
రెండో విడతపైనే ఆశలు
జిల్లాలోని ఎక్కువ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు రెండో విడత కౌన్సిలింగ్‌పైనే ఆశలు పెట్టుకున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్ జిల్లాలో మెజార్టీ కళాశాలల యాజమాన్యాలను నిరాశపెట్టాయి. రెండో విడత ఎంసెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం తేదీని ప్రకటించలేదు. రెండో విడతలో కూడా సీట్లు భర్తీ కాకపోతే పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో ఆయా కళాశాలల యాజమాన్యలు ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరకుండా ఎక్కువ మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని కళాశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ సరైన సౌకర్యాలు, నిష్ణాతులైన అధ్యాపకులు, సరిపడా కంప్యూటర్ ల్యాబ్‌లు తదితరవి లేక పోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు.
జిల్లా నుంచి ప్రతి ఏటా 14 వేల మందికి పైగా విద్యార్థులు ఇంజినీరింగ్ చదివేందుకు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని తెలిసింది. ఇక్కడ ఎక్కువ కళాశాలల్లోనే బీటెక్ పూర్తి చేసిన వారితోనే బోధన సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఎంటెక్, పీహెచ్‌డీ చేసిన వారితో బోధన చెల్లించాలంటే లక్షల్లో వేతనం చెల్లించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో బీటెక్ పూర్తి చేసిన వారితోనే పబ్బం గడుపుతున్నారనే విమర్శలున్నాయి. దీంతో పాటు జిల్లాలోని కళాశాలల్లో చదివితే ప్లేస్‌మెంట్ ఉండదని ఎక్కువ మంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి కనబడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment