ఎంసెట్ ఇంజనీరింగ్ తుది విడత కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ అజయ్‌జైన్ వెల్లడించారు.
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ తుది విడత కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ అజయ్‌జైన్ వెల్లడించారు. ఒకటో ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు గల అభ్యర్థులెవరైనా 24 నుంచి 27వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేయవచ్చు. ఇంతకు ముందు కౌన్సెలింగ్‌లో సీటు రానివారు, సీటు పొందినా ఆ కళాశాలలో చేరనివారు, ధ్రువపత్రాల పరిశీలనలో పాల్గొని, వెబ్‌ఆప్షన్లు ఇవ్వనివారు, సీటు దక్కి, కళాశాలలో రిపోర్ట్ చేసినప్పటికీ ఇతర మంచి అవకాశం కోసం ఎదురుచూసేవారు, తొలి విడతలో వచ్చిన సీటును రద్దు చేసుకున్నవారు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.
ఇప్పటివరకు ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోనివారు 24 నుంచి 27వ తేదీ వరకు సహాయక కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. తరువాత వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. అయితే, ఇప్పటికే సీట్లు పొందిన విద్యార్థులు తుది విడత కౌన్సెలింగ్‌లో పాల్గొంటే... తుదివిడతలో వచ్చే సీటును మాత్రమే పొందుతారు. అందువల్ల మంచి సీటు కావాలనుకునేవారు పరిమితమైన ఆప్షన్లతో తొలివిడత కంటే మెరుగైన సీట్లను మాత్రమే ఎంచుకుంటే మేలు.