ఇంజినీరంగు పడింది!
Published Wed, May 31 2017 4:25 AM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM
మౌలిక వసతుల లేమి, అర్హత లేని అధ్యాపకులతో పాఠ్యాంశాల బోధనపై అనంతపురం జేఎన్‌టీయూ మండిపడింది. నిబంధనలు పాటించని, ఆర్థిక వెసులుబాటును విస్మరించిన కళాశాలల యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జూన్ 3వ తేదీ లోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకుంటే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది.
నెల్లూరు(టౌన్):
అసలే అంతంత మాత్రపు అడ్మిషన్లతో నడుస్తున్న ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు జేఎన్టీయూ తాజా హెచ్చరికలతో కంటిమీద కునుకు లేకుండా పోయింది. గతేడాది జూన్‌లో 16వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా 40 కళాశాలలు ఎంపిక చేసుకుని తనిఖీలు జరిపారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో 3 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించారు.
మౌలిక వసతులపై ఆరా
ప్రధానంగా ఫ్యాకల్టీ, ఫైనాన్స్, ఇన్‌ఫాస్ట్రక్చర్ తదితర వాటిపై తనిఖీలు చేశారు. అర్హత లేని అధ్యాపకుల నియామకం, విద్యార్థులకు తగిన అధ్యాపకులు లేకపోవడం, కళాశాలకు అవసరమైన స్థలం లేకపోవడం, భవనాలు, ప్రయోగశాలలు, కంప్యూటర్లు, లైబ్రరీ తదితర సౌకర్యాలు కొరవడిన విషయాన్ని గుర్తించా రు. ఈ నేపథ్యంలో కళాశాలల డొల్లతనంపై కమిటీ సభ్యులు ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రమాణాలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో మూడు కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జూన్ 3వ తేదీ లోపు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో 24 ఇంజినీరింగ్ కళాశాలు
జిల్లా వ్యాప్తంగా 24 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ప్రధానంగా మెకానికల్, సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్, ఈఐఈ బ్రాంచ్‌లు ఉన్నాయి. కళాశాల సీనియారిటీని బట్టి 300 నుంచి 550 వరకు అన్ని బ్రాంచిల్లో సీట్లున్నాయి. ఏటా ఇంటర్ పూర్తి చేసుకుని జిల్లా వ్యాప్తంగా సుమారు 22 వేల మందికి పైగా విద్యార్థులు బయటకు వస్తున్నారు. అయితే ఎక్కువ మంది చెన్నై, బెంగళూరు, విజయవాడ, హైదరాబాదు తదితర ప్రాంతాల్లో ఉన్న కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు.
అధికశాతం కళాశాలల్లో..
జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో అధికశాతం పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహిస్తే ఒక్క కళాశాల కూడా తరగతులు జరిపే పరిస్థితి ఉండదంటున్నారు. ఏటా ప్రయోగాల కోసం జిల్లా నుంచి రెండు కళాశాలల యాజమాన్యం తిరుపతిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు విద్యార్థులను తరలిస్తోంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపైనే ఆధారపడి ఆయా యాజమాన్యాలు కళాశాలలను నడుపుతున్నాయి. అవి నిలిచిపోతే జిల్లాలో మెజారిటీ కళాశాలలను మూసివేసే పరిస్థితి ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు.
సీట్లు భర్తీకాని కళాశాలలు
ఏటా ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. ఒకటి రెండు కళాశాలలు మాత్రమే 95 శాతం సీట్లు భర్తీ అవుతున్నాయి. గతేడాది జిల్లాలో రెండు కళాశాలల్లో ఒక అడ్మిషన్ కూడా జరగలేదంటేనే పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. కొన్ని కళాశాలల్లో అధ్యాపకుల కొరత, మరికొన్నింటిలో అధ్యాపకులు ఉన్నా అర్హత లేకపోవడం, సరైన ల్యాబ్ సౌకర్యం, సరిపడా గదులు, కంప్యూటర్లు లేకపోవడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి పోతున్నారు.
ఏటా తనిఖీలు నిర్వహిస్తాం
ఏటా ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం. ఈ ఏడాది కూడా జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో తనిఖీలు చేశాం. ఆ నివేదిక ఇంకా రాలేదు. గతేడాది తనిఖీల్లో సరైన సౌకర్యాలు లేని కళాశాలలకు నోటీసులు జారీ చేశాం.
–కృష్ణయ్య, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూ(ఏ)
Advertisement