సాక్షి, హైదరాబాద్: బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (నెట్‌వర్క్స్), కంప్యూటర్ ఇంజనీరింగ్ వంటి కొత్త కోర్సుల్లో ఈసారి 21 వేల వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త కోర్సుల్లో 20,700 వరకు సీట్లు నింపుకొనేందుకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇవ్వాలని యాజమాన్యాలు జేఎన్‌టీయూకు దరఖాస్తు చేసుకోగా, మరో 1,500 సీట్ల కోసం దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 800 వరకు సీట్లలో కొత్త కోర్సులు నిర్వహించేందుకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో 2020–21 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సుల్లో 23 వేల సీట్లకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తులు రానున్నాయి. అయితే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు (ఎఫ్‌ఎఫ్‌సీ) కాలేజీల్లో తనిఖీలు చేపట్టి, లోపాల మేరకు కోతపెట్టినా కనీసం 21 వేల వరకు కొత్త కోర్సుల్లో సీట్లకు అనుబంధ గర్తింపు లభించే అవకాశం ఉంది.
న్యాక్, ఎన్‌బీఏ ఉంటేనే..
యూనివర్సిటీలు విధించిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని 100కు పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు రానున్నాయి. జేఎన్‌టీయూ పరిధిలో ఇప్పటికే 90 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు కొత్త కోర్సులకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలో మరో 10కి పైగా కాలేజీల్లో కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధం అయ్యాయి. దీంతో 2020–21 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులను ఆఫర్ చేసే కాలేజీల సంఖ్య వందకు పైనే ఉండనుంది. కొత్త కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు యూనివర్సిటీలు పలు నిబంధనలు విధించాయి. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీతో పాటు నేషనల్ అస్సెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) అక్రెడిటేషన్ ఉన్న కాలేజీలకు, కోర్సులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్‌బీఏ) కలిగిన కోర్సులు ఉన్న కాలేజీల్లోనే కొత్త కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు.
ఇంకా ఉన్న సమయం..
జేఎన్‌టీయూ పరిధిలో అనుబంధ గుర్తింపు కోసం ముందుగా ఇచ్చిన దరఖాస్తుల గడువు ఈనెల 12తో ముగిసినా, యూనివర్సిటీ 16 వరకు పొడిగించింది. ఉస్మానియా యూనివర్సిటీ దరఖాస్తుల గడువు మరో 20 రోజుల వరకు ఉంది. జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీల్లో ఎంటెక్ కోర్సులోనూ సైబర్ సెక్యురిటీ, డేటా సైన్స్, ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి కొత్త కోర్సులు నిర్వహించేందుకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని యాజమాన్యాలు దరఖాస్తు చేశాయి. ఇప్పటికే 618 సీట్లలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేయగా, ఎం.ఫార్మసీలోనూ 45 సీట్లలో, ఫార్మ్–డీలోనూ 10 సీట్లలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇలా మొత్తం జేఎన్‌టీయూ పరిధిలో ఇప్పటి వరకు 21,373 సీట్లలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment