ఏపీ ఎంసెట్‌–19 నోటిఫికేషన్‌ విడుదల  | AP EAMCET 2019 Notification Release | Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్‌–19 నోటిఫికేషన్‌ విడుదల 

Published Tue, Feb 26 2019 2:44 AM | Last Updated on Sat, Mar 23 2019 8:55 PM

AP EAMCET 2019 Notification Release - Sakshi

బాలాజీచెరువు (కాకినాడ సిటీ)/సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 2019–20 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్, ఫుడ్‌ సైన్స్‌ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బీవీఎస్‌సీ, యానిమల్‌ హజ్‌ బెండరీ, బీఎఫ్‌ఎస్‌సీ, బీ ఫార్మసీ, ఫార్మ–డీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్‌–2019 నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు ఎంసెట్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజు, కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌.సాయిబాబు సోమవారం తెలిపారు. ఈ పరీక్షను జేఎన్‌టీయూనే వరుసగా ఐదోసారి నిర్వహిస్తోందన్నారు. కంప్యూటర్‌ ఆధారిత పద్ధతిలో వరుసగా మూడోసారి ఈ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అపరాధ రుసుం లేకుండా మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 4 వరకూ, రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 9 వరకూ, రూ.5 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 14 వరకూ, రూ.10 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 19 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. http://sche.ap.gov.in/eamcet వెబ్‌సైట్‌ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులో విద్యార్థి మూడు కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని, విద్యార్థి ప్రాధాన్యాన్నిబట్టి ఈ మూడింటిలో ఒకచోట మాత్రమే పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారని తెలిపారు. హాల్‌టిక్కెట్లను ఏప్రిల్‌ 16 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలిపారు. ఇంజినీరింగ్‌ పరీక్షను ఏప్రిల్‌ 20, 21, 22, 23 తేదీల్లోను, అగ్రికల్చర్‌ పరీక్షను ఏప్రిల్‌ 23, 24 తేదీల్లోను నిర్వహిస్తామన్నారు. ఉర్దూ మాధ్యమం కావాలనుకునే వారికి కర్నూలులో మాత్రమే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంపీసీ విద్యార్థులకు గణితం 80, ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ 40 మార్కులకు, బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ 40, బోటనీ 40, జువాలజీ 40 కలిపి మొత్తం 160 మార్కులకు పరీక్ష ఉంటుందన్నారు. ర్యాంకును నిర్ధారించేందుకు ఎంసెట్‌ మార్కులను 75శాతం, 25శాతం ఇంటర్మీడియట్‌ మార్కులను వెయిటేజీగా తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అర్హతా మార్కులు లేవు.

ఇతర అభ్యర్థులకు 40 మార్కులను అర్హతా మార్కులుగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ పరీక్ష వల్ల పారదర్శకంగా, త్వరితగతిన ర్యాంకులు కేటాయించడానికి వీలవుతుందని, విద్యార్థి తమ జవాబులను ఎన్ని సార్లయినా మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని సాయిబాబు తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నలు, ఆప్షన్లు ఇస్తామని చెప్పారు. ఐదు రోజుల పాటు జరిగే ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ప్రశ్నాపత్రాలు కష్టంగాను, సులభంగాను ఉన్నాయని ఒకరితోనొకరు పోల్చుకుని ఆందోళన చెందనవసరం లేదన్నారు. నిర్దేశించిన నిబంధనల ప్రకారం సాధారణీకరణ (నార్మలైజేషన్‌) పద్ధతిలో ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం చేస్తామని స్పష్టం చేశారు. 

ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
విద్యార్థికి హాల్‌టికెట్లో కేటాయించిన రోజు అదే శ్లాట్‌లో పరీక్షకు హాజరు కావాలి. లేదంటే గైర్హాజరైనట్లుగా పరిగణిస్తామని కన్వీనర్‌ పేర్కొన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థిని పరీక్షకు అనుమతించబోమని తెలిపారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థికి రఫ్‌వర్కు చేసుకునే నిమిత్తం తెల్లకాగితాలను తామే అందిస్తామని తెలిపారు.  

ఏపీతో పాటు హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు
ఈ ప్రవేశ పరీక్ష శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం సిటీ, ఆనందపురం, గాజువాక, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, మైలవరం, కంచికచర్ల, గుడ్లవల్లేరు, గుంటూరు, నరసారావుపేట, ఒంగోలు, మార్కాపురం, చీరాల, నెల్లూరు, కావలి, గూడూరు, చిత్తూరు, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, అనంతపురం, పుట్టపర్తి, గుత్తి, హిందూపూర్, కర్నూలు, నంద్యాలతో పాటు హైదరాబాద్‌లో ఎల్బీ నగర్, నాచారం, సికింద్రాబాద్‌లలో ఎంపిక చేసిన కేంద్రాలలో పరీక్ష జరుగుతుంది. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 0884 – 2340535, 0884 – 2356255 ఫోన్‌ నెంబర్ల ద్వారా, లేదా ఈమెయిల్‌ ఐడి 2019apeamcet@gmail.com ద్వారా సంప్రదించాలని కన్వీనర్‌ సాయిబాబు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement