జేఎన్‌టీయూకే.. అండ అక్రమార్కులకే! | There are 2338 bogus faculty members in engineering colleges | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూకే.. అండ అక్రమార్కులకే!

Published Mon, Feb 8 2021 5:37 AM | Last Updated on Mon, Feb 8 2021 5:37 AM

There are 2338 bogus faculty members in engineering colleges - Sakshi

సాక్షి, కాకినాడ: జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (కాకినాడ) పరిధిలోని అత్యధిక ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బోగస్‌ అధ్యాపకులతో తంతు కానిచ్చేస్తున్నారు. ఇటీవల వర్సిటీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 2,338 మంది అధ్యాపకులు ఒకటి కంటే ఎక్కువ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నట్టు తేలింది. దీనిపై వివరణ ఇవ్వాలని జేఎన్‌టీయూకే అధికారులు ఆయా కళాశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. రోజులు గడుస్తున్నా వాటికి వివరణ వచ్చిన దాఖలాలు లేవు. అధ్యాపకుల డబుల్, త్రిపుల్‌ యాక్షన్‌ను కట్టడి చేసేందుకు ‘ఆధార్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ డేటా ఎంట్రీ యాప్‌’ను వర్సిటీ అందుబాటులోకి తెచ్చినా ఫలితం లేదు.  

ఇదేం నిషేధం! 
రాష్ట్రంలోని 8 జిల్లాల్లో జేఎన్‌టీయూకే పరిధిలో 260 ఇంజనీరింగ్‌ కళాశాలలున్నాయి. వీటిలో వరుసగా రెండేళ్లు విద్యార్థుల ప్రవేశాలను ప్రామాణికంగా తీసుకుని, తరువాతి ఏడాది అడ్మిషన్లకు అనుమతులిస్తున్నారు. గతంలో కంటే విద్యార్థుల ప్రవేశాలు 25 శాతం తగ్గితే, ఎంసెట్‌ ఐచ్చికాల నమోదుకు అనుమతించరు. విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిబంధన పెట్టింది. ఉన్నత విద్యామండలి అలాంటి కళాశాలల వివరాలను గుర్తించి వర్సిటీలకు పంపింది. ఆ వివరాల ఆధారంగా జేఎన్‌టీయూకే నిర్ధారణ బృందం ఆ కళాశాలలను పరిశీలించి, అనేక లోపాలను గుర్తించి ఓ జాబితా తయారు చేసింది. దీని ప్రకారం 28 కళాశాలల్లో ఈసారి ఎంసెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌ ప్రవేశాలను నిషేధించారు. వర్సిటీ 78 కళాశాలల జాబితా పంపి, వాటిలో పకడ్బందీగా తనిఖీలు చేయాలని ఆదేశిస్తే.. తనిఖీ బృందాలు మాత్రం కొన్నేళ్లుగా అడ్మిషన్లు లేక కొట్టుమిట్టాడుతున్న కళాశాలలను ఎంచుకున్నాయి. వాటిపై చర్యలు తీసుకుంటున్నామని కలరింగ్‌ ఇచ్చాయి.  

భారీగా వసూళ్లు! 
కళాశాలల్లో తనిఖీలకు వెళ్లిన వర్సిటీ అధికారుల్లో కొందరు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అక్రమాలను సక్రమం చేసేందుకు భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు నివేదిక ఇచ్చేందుకు తనిఖీ బృందంలోని అధికారులు ఒక్కో కళాశాల యాజమాన్యం నుంచి స్థాయిని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలా ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పీహెచ్‌డీ అర్హత గల అధ్యాపకులు లేరు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ప్రతి 15 మంది ఇన్‌టేక్‌ స్టూడెంట్లకు ఒక అధ్యాపకుడు, 1:2:6 నిష్పత్తి ప్రకారం ప్రతి సెక్షన్‌కు ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఆరుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. చాలా కళాశాలలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.  

పారదర్శకంగా తనిఖీలు 
ప్రమాణాలు పాటించని కళాశాలల్లో అడ్మిషన్లకు అనుమతులు నిలిపివేశాం. బోగస్‌ అధ్యాపకులను గుర్తించి ఆయా కళాశాలలకు నోటీసులు జారీ చేశాం. ఇకపై ఇలా జరగకుండా నివారించేందుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ తీసుకొస్తున్నాం. తనిఖీల సమయంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేయిస్తాం. 
– డాక్టర్‌ సీహెచ్‌.సత్యనారాయణ, రిజిస్టార్, జేఎన్‌టీయూకే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement