సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ అన్ ఎయిడెడ్, నాన్ మైనార్టీ ఇంజనీరింగ్, తదితర ప్రొఫెషనల్ కాలేజీల్లోని ‘బీ’ కేటగిరీ (యాజమాన్య) కోటా సీట్లు కూడా ఇక మెరిట్ విద్యార్థులకు దక్కనున్నాయి. ఈ సీట్లను ప్రభుత్వమే కన్వీనర్ ద్వారా భర్తీ చేయించనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ‘బీ’ కేటగిరీ సీట్లను ఆయా కాలేజీలు ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారం భర్తీ చేసుకునేవి. ఎక్కువ ఫీజులు చెల్లించేవారికి మాత్రమే సీట్లను కట్టబెట్టేవి. దీనివల్ల మెరిట్ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లేది. గత టీడీపీ ప్రభుత్వం ఈ సీట్లను మెరిట్ విద్యార్థులకు కేటాయించాలన్న ఆలోచన కూడా చేయలేదు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ‘బీ’ కేటగిరీ సీట్లను మెరిట్ ప్రాతిపదికన.. పారదర్శకంగా కన్వీనర్ ద్వారా భర్తీ చేయించేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి గతేడాది జూలై 25న జీవో 25ను జారీ చేసింది. అయితే కరోనాతో అడ్మిషన్లు ఆలస్యం కావడం, ఇతర కారణాలతో కాలేజీ యాజమాన్యాల వినతి మేరకు వారే భర్తీ చేసుకునేందుకు అనుమతించింది. ఈ విద్యా సంవత్సరంలో మాత్రం కన్వీనర్ ద్వారానే భర్తీ చేసేలా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర కొన్ని సవరణలతో తాజాగా జీవో 48 విడుదల చేశారు. దీని ప్రకారం.. ఈ యాజమాన్య కోటా సీట్లను కూడా కన్వీనర్ నిర్వహించే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆయా కాలేజీల్లోని మొత్తం సీట్లలో 70 శాతం కన్వీనర్ కోటా (‘ఏ’ కేటగిరీ) సీట్లు కాగా, 30 శాతం యాజమాన్య కోటా సీట్లు.
‘బీ’ కేటగిరీ ఎన్‌ఆర్‌ఐ సీట్ల భర్తీ ఇలా..
► యాజమాన్య కోటా కింద ఉన్న 30 శాతం సీట్లలో 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా, 15 శాతం నాన్ ఎన్‌ఆర్‌ఐ కోటా కింద ఉంటాయి.
► ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు యాజమాన్యాలే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులతో భర్తీ చేసుకోవచ్చు.
► ఏపీ ఈఏపీసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే అవి వాటిని భర్తీ చేయాలి. ఈ సీట్లను నిర్ణీత అర్హత పరీక్షల్లో 50 శాతం మార్కులు సాధించిన వారికే ఇవ్వాల్సి ఉంటుంది.
► ఎన్‌ఆర్‌ఐ విద్యార్థుల నుంచి కాలేజీలు 5 వేల అమెరికన్ డాలర్లను ఫీజుగా వసూలు చేసుకోవచ్చు. ఎన్‌ఆర్‌ఐ కోటాలో భర్తీ కాని సీట్లను ‘బీ’ కేటగిరీ నాన్ ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లుగా పరిగణిస్తారు.
‘బీ’ కేటగిరీ నాన్ ఎన్‌ఆర్‌ఐ సీట్ల భర్తీ ఇలా..
► ఆయా కాలేజీలు ‘బీ’ కేటగిరీలో భర్తీ కాకుండా మిగిలిపోయిన సీట్ల వివరాలను కన్వీనర్‌కు తెలియజేయాలి. వీటిని ఏపీ ఈఏపీసెట్ ప్రవేశాల కన్వీనర్ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.
► రాష్ట్ర విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సుల మేరకు.. ఆయా కాలేజీల్లోని కోర్సుల వారీగా.. ‘ఏ’ కేటగిరీ సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు గరిష్టంగా మూడు రెట్ల వరకు ఆయా యాజమాన్యాలు వసూలు చేసుకోవచ్చు.
► ఈ సీట్లు లభించిన విద్యార్థులు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు అర్హులు కారు.
► విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో ‘ఏ’ కేటగిరీ, ‘బీ’ కేటగిరీ నాన్ ఎన్‌ఆర్‌ఐ సీట్లకు వేర్వేరుగా ఆప్షన్లు ఇవ్వాలి.
► ‘ఏ’ కేటగిరీతోపాటు ‘బీ’ కేటగిరీ సీట్లను కూడా కన్వీనర్ ఒకే సమయంలో మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
► ‘బీ’ కేటగిరీ నాన్ ఎన్‌ఆర్‌ఐ సీట్లకు ఎంపికైనవారు ఏపీ ఈఏపీసెట్‌లో మెరిట్ సాధించి ఉంటే ‘ఏ’ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
► ‘బీ’ కేటగిరీ నాన్ ఎన్‌ఆర్‌ఐ సీట్లకు ముందుగా జేఈఈ, తర్వాత ఏపీ ఈఏపీసెట్ మెరిట్‌ను ప్రాధాన్యతగా తీసుకుంటారు.
► కన్వీనర్ ద్వారా మిగిలిపోయే సీట్లను ఆయా కాలేజీలు స్పాట్ అడ్మిషన్ల కింద నిర్ణీత అర్హతలున్న వారితో భర్తీ చేసుకోవచ్చు. దీనికి సంబంధిత అధికారుల ఆమోదం తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment