ఇంటర్న్‌షిప్‌తోపాటే ఉద్యోగం! | Engineering Colleges Integration with Industries | Sakshi
Sakshi News home page

ఇంటర్న్‌షిప్‌తోపాటే ఉద్యోగం!

Published Wed, Sep 12 2018 3:35 AM | Last Updated on Wed, Sep 12 2018 3:35 AM

Engineering Colleges Integration with Industries - Sakshi

చదువుకునే సమయంలోనే విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు సమకూర్చుకునేందుకు వీలుగా నూతన ఇంటర్న్‌షిప్‌ విధానం అమలులోకి వస్తోంది. సాంకేతిక కోర్సులంటే సమాజంతో పనిలేదు అనే ధోరణి నుంచి బయటకు రప్పించేలా ఇంటర్న్‌షిప్‌ను తీర్చిదిద్దారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడంతో పాటు ఇంటర్న్‌షిప్‌ను పకడ్బందీగా పూర్తి చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి.

సాక్షి, అమరావతి: విద్యార్థులు సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందిం చేందుకు సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్న్‌షిప్‌ విధానంలో సమూల మార్పులు అమలులోకి రానున్నాయి. అండర్‌ గ్రాడ్యుయేట్, డిప్లొమో కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ కాలపరిమితిని పెంచడంతోపాటు పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంధానాన్ని మెరుగుపర్చడానికి కేంద్రం ప్రభుత్వం నూతన ఇంటర్న్‌షిప్‌ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇందుకు సంబంధించి జాతీయ సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవల మోడ్రన్‌ ఇంటర్న్‌షిప్‌ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రాక్టికల్‌ విధానానికి ఇందులో పెద్దపీట వేశారు. అదే సమయంలో ఇప్పటివరకు ఉన్న క్రెడిట్ల సంఖ్యను తగ్గించారు. బీటెక్‌ కోర్సులో 220 క్రెడిట్లను 160కి కుదించారు. ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోజర్‌కు 14 నుంచి 20 క్రెడిట్స్‌ను కేటాయించారు. డిప్లొమోలో దీన్ని 10 నుంచి 16 క్రెడిట్లుగా నిర్ణయించారు. ఇంటర్న్‌షిప్‌ నాలుగు నెలలకు తగ్గకుండా ఉండేలా నిబంధనలు విధించారు. దీనివల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగడంతో పాటు కోర్సు పూర్తయ్యేలోగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటారని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 

శిక్షణతో వేతనాలకు కోత
ఇంజనీరింగ్, డిప్లొమో కోర్సులు చదివేవారిలో నైపుణ్యాల లేమితో మూడో వంతు మంది కూడా ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారని భావిస్తున్న ఏఐసీటీఈ నూతన విధానాన్ని అమలులోకి తెస్తోంది. ఉపాధి పొందుతున్న వారిలో కూడా నైపుణ్యాలు అంతంతమాత్రంగానే  ఉండడంతో ఆయా పరిశ్రమలు తిరిగి శిక్షణ ఇవ్వాల్సి వస్తోంది. అయితే శిక్షణ పేరుతో వేతనాలు అతి తక్కువగా ఉంటున్నాయి. ఏటా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా వేతనాలు పొందాల్సిన వారు కేవలం రూ.1.5 లక్షలే అందుకోగలుగుతున్నారు. 

డిప్లొమోలో 500 గంటలు.. ఇంజనీరింగ్‌లో 700 గంటలు..
కొత్త నిబంధనల ప్రకారం డిప్లొమో కోర్సులు చేసే విద్యార్థులు 450 నుంచి 500 గంటలు, ఇంజనీరింగ్‌ విద్యార్థులు 600 నుంచి 700 గంటలు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయడం తప్పనిసరి. ఇంటర్న్‌షిప్‌లో ఫుల్‌టైమ్‌ పార్ట్‌టైమ్‌ వెసులుబాటు కూడా కల్పించారు. విద్యార్థులు వేసవి సెలవుల్లో ఫుల్‌టైమ్‌ ఇంటర్న్‌షిప్‌ చేయవచ్చు. పార్ట్‌టైమ్‌ ఇంటర్న్‌షిప్‌కు హాజరయ్యే వారు కోర్సు మధ్యలో ఎప్పుడైనా పూర్తి చేయవచ్చు. సెకండ్‌ సెమిస్టర్‌ నుంచి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. 40 నుంచి 45 గంటల  పనిగంటలను ఒక క్రెడిట్‌గా పరిగణిస్తారు. ఒక వారంలో దీన్ని పూర్తిచేయవచ్చు. ఇందులో ట్రైనింగ్, ప్రాజెక్టు వర్కు, సెమినార్‌ తదితర కార్యక్రమాలుంటాయి. 4, 6 సెమిస్టర్ల అనంతరం వేసవి సెలవుల్లో  విద్యార్థులు ఇంటర్న్‌షిప్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ తదితర కార్యక్రమాలను చేపట్టవచ్చు. 

చివరిలో ప్రాజెక్టు వర్కు, సెమినార్లు
ఇంటర్న్‌షిప్‌ను పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర చిన్న, మధ్య తరహా సంస్థల్లోనూ చేయవచ్చు. చివరి 8వ సెమిస్టర్‌లో ప్రాజెక్టు వర్కు, సెమినార్‌లు లాంటివి ఆయా సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి సంస్థలో ట్రైనింగ్, ప్లేస్‌మెంట్‌ విభాగం ఏర్పాటు చేసి దీనికో అధికారిని ప్రత్యేకంగా నియమించాలి. అనుసంధానమైన పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్ధులకు ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాన్ని ఆయా సంస్థలు రూపొందించాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌ పురోగతిని రోజూ సమీక్షించుకోవాలి. విద్యార్ధులు ఇంటర్న్‌షిప్‌ దినచర్యను డైరీలో నమోదు చేసుకోవాలి.

పకడ్బందీగా మూల్యాంకన విధానం
విద్యార్ధుల ఇంటర్న్‌షిప్‌పై పరిశ్రమలు, సైట్‌ విజిట్‌ చేసే ఫాకల్టీ సూపర్‌వైజర్‌ మూల్యాంకనం చేయాలి. చివరిగా సంస్థలో సెమినార్, వైవా ద్వారా  ఇంటర్న్‌షిప్‌ తీరును మదింపు చేయాలి. విద్యార్థుల నైపుణ్యాలను గమనిస్తూ పరిశ్రమలు డైరీల్లో రిమార్కులు రాయాలి.

ఇంటర్న్‌షిప్‌లకు అదనంగా 100 పాయింట్లు
అకడమిక్‌ గ్రేడ్‌లకు అదనంగా ఇంటర్న్‌షిప్‌లకు ఏఐసీటీఈ 100 పాయింట్లను కేటాయించనుంది. ఇందుకు దేశవ్యాప్తంగా ఒక విధానాన్ని రూపొందించింది. లేటరల్‌ ఎంట్రీ ద్వారా (డిప్లొమో అనంతరం) ఇంజనీరింగ్‌లో చేరే వారికి 75 పాయింట్లు నిర్దేశించారు. సామాజిక సేవ, తదితర కార్యక్రమాలను ఇంజనీరింగ్‌ విద్యార్థులు 300 నుంచి 400 గంటలు, డిప్లొమో విద్యార్థులు 200 నుంచి 250 గంటలు చేపట్టాల్సి ఉంటుంది. ఇది నాన్‌ క్రెడిట్‌ కార్యక్రమంగా ఉంటుంది. ప్రతి విద్యార్థి ఇందుకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించాలి. స్థానిక స్కూళ్లలో విద్యార్థులకు సేవలందించడం, గ్రామాల ఆర్థిక వనరులు పెంపొందించేందుకు ప్రణాళికలు సూచించడం, మంచినీటి సదుపాయాలు, నిర్వహణను అభివృద్ధి పర్చడం, టూరిజమ్‌ ప్రమోషన్, సాంకేతిక పరిజ్ఞానంతో స్థానిక సమస్యల పరిష్కారం, విద్యుత్తు వినియోగాన్ని తగ్గించే నూతన ప్రయోగాలు, మహిళా సాధికారతకు తోడ్పాటు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రచారం చేయడం తదితర అంశాలను చేపట్టాలి.

మోడ్రన్‌ ఇంటర్న్‌షిప్‌ లక్ష్యాలు ఇవీ
– ఇంజనీరింగ్‌ పరిజ్ఞానం పెంపు
– విశ్లేషణ, సమస్య పరిష్కారానికి వీలుగా డిజైన్‌/డెవలప్‌మెంట్‌
– సంక్లిష్ట సమస్యల శోధన
– ఇంజనీర్లుగా సామాజిక బాధ్యత 
– పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత
– నైతిక విలువలతో కూడిన ఇంజనీరింగ్‌ విద్య, నైపుణ్యాలు
– వ్యక్తిగత, బృందంగా పనిచేసే సామర్థ్యాలు పెంపొందించడం
– కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడం
– ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, ఫైనాన్స్‌ తదితర అంశాల్లో అవగాహన
– లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ 

విద్యార్థులు, విద్యాసంస్థలు, పరిశ్రమలకు ప్రయోజనాలివీ..
– సమస్యను పరిష్కరించగలిగే నైపుణ్యాలు విద్యార్థుల్లో పెరగడం.
– తరగతి గదుల్లో నేర్చుకున్న అంశాలను ఇంటర్న్‌షిప్‌ల ద్వారా అవగాహన చేసుకోవడం.
– ఇంటర్న్‌షిప్‌ అనుభవాలను తిరిగి తరగతి గదుల్లో చర్చించడం.
– అకడమిక్‌ కెరీర్, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం.
– పరిశ్రమల్లో పనిచేసే సిబ్బంది సైకాలజీ, అలవాట్లు, ప్రవర్తనను అధ్యయనం చేయడం ద్వారా సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవడం.
– ఇంటర్న్‌షిప్‌ ద్వారా సామాజిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలు, ప్రభావాన్ని అంచనావేయడం.
–నిపుణులైన అభ్యర్థులు పరిశ్రమలకు అందుబాటులోకి వస్తారు.
–విద్యార్థులకు ప్రాక్టికల్‌ అనుభవాల ద్వారా పరిజ్ఞానం పెరుగుతుంది.
–విద్యాసంస్థలకు కూడా పరిశ్రమలతో అనుబంధం పెరుగుతుంది.
–ఆయా సంస్థల క్రెడిబులిటీ, బ్రాండ్‌ ఇమేజ్‌ పెరుగుతుంది
– సంస్థలోని సిబ్బందికి ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోజర్‌ సమకూరుతుంది.
– రిటెన్షన్‌కు అవకాశం లేకుండా విద్యార్థులను తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement