
ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కోత
► ప్రమాణాలు లేకపోవడమే కారణం
► జిల్లాలో 2వేల సీట్లు తగ్గింపు
ప్రొద్దుటూరు: నిర్ణీత ప్రమాణాలు పాటించలేదనే కారణంతో ఇంజినీరింగ్ సీట్లలో కోత విధించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న 24 ఇంజినీరింగ్ కళాశాలలో 2వేల సీట్ల వరకు కోత విధించినట్లు తెలుస్తోంది. అనంతపురంలోని జేఎన్‌టీ యూనివర్సిటీ పరిధిలో అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇంజినీరింగ్ కళాశాలతోపాటు ఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ కళాశాలలు నడుస్తున్నాయి. గత మార్చి, ఏప్రిల్ నెలలో యూనివర్సిటీ నిజనిర్ధారణ కమిటీ కళాశాలలను తనిఖీ చేసింది.
మొత్తం ఐదు జిల్లాల్లో 119 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా అందులో వైఎస్సార్ జిల్లాకు సంబంధించి 24 కళాశాలలు ఉన్నాయి. 119 కళాశాలల్లో మొత్తం 52వేల సీట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ఒక ప్రొఫెసర్‌తోపాటు ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించుకోవాల్సి ఉంది. ఫ్యాకల్టీతోపాటు ల్యాబ్ సౌకర్యం, తరగతి గదుల ఏర్పాటు తదితర నిబంధనలు పాటించాల్సి ఉంది. పెద్దపెద్ద కళాశాలలను నిర్మాణాలను చూపుతున్న యాజమాన్యాలు చాలా వరకు ఈ నిబంధనలను పాటించడం లేదు.
తెలంగాణా నేపథ్యంలోనే సీట్ల తగ్గింపు
మనకంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఆయా శాఖల అధికారులు కళాశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకున్నారు. ఒకే కళాశాలలో పనిచేస్తూ రెండు మూడు కళాశాలల్లో అదే పేరుతో అధ్యాపకులు కొనసాగుతున్న విషయాన్ని గుర్తించినట్లు అధ్యాపక వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో ఆధార్‌కార్డు అనుసంధానం చేసినట్లు తెలిసింది. ఈ కోవలోనే మన రాష్ట్రంలో కూడా కళాశాలలను తనిఖీ చేసి సీట్లను తగ్గించారు.