సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ రాసిన 1.56 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఇంజనీరింగ్‌లో సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో.. ఏ ర్యాంకు వస్తుంది? ఏ ర్యాంకు వస్తే ఏ కాలేజీలో సీటు దొరుకుతుంది? కోరుకున్న బ్రాంచ్‌లో సీటు రావాలంటే ఎంత ర్యాంకు రావాలి? కన్వీనర్ కోటా కటాఫ్ ఎంత? వర్సిటీ క్యాంపస్‌లో సీటొచ్చే పరిస్థితి ఉందా? ఇలా ప్రతి విద్యార్థినీ ఎన్నో సందేహాలు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.
ఈ సందేహాలతోనే చాలామంది మంచి ర్యాంకు వచ్చినా ప్రైవేటు కాలేజీలో మేనేజ్‌మెంట్ కోటా సీటు కోసం ప్రయత్నిస్తుంటారు. నిజానికి గత ఏడాది ర్యాంకులు, కేటగిరీల వారీగా సీట్ల కేటాయింపు, ఏ కాలేజీలో ఏ ర్యాంకుకు ఏ బ్రాంచిలో సీటు వచ్చింది తదితరాలు క్షుణ్ణంగా తెలుసుకుని, కౌన్సెలింగ్‌పై కాస్త అవగాహన పెంచుకుంటే కచ్చితమైన అంచనా తేలికే అంటున్నారు నిపుణులు. విద్యార్థుల డిమాండ్, కాలేజీల ఒత్తిడి నేపథ్యంలో ఈసారి కంప్యూటర్ సైన్స్ (సీఎస్సీ) కోర్సుల్లో కొద్దిగా సీట్లు పెరిగే వీలుంది. ఇదే క్రమంలో సివిల్, మెకానికల్ సీట్లు తగ్గబోతున్నాయి. అయితే ఈ వివరాలను యూనివర్సిటీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
సీఎస్సీకి పెరిగిన డిమాండ్
గత కొన్నేళ్ళ సీట్ల కేటాయింపును పరిశీలిస్తే రాజధాని పరిసరాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్సీ సీటుకు డిమాండ్ బాగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ కాలేజీల్లో ఈ కోర్సుల్లో సీటు రావాలంటే ఓపెన్ కేటగిరీలో అయితే 3 వేల లోపు ర్యాంకు మాత్రమే రావాలి.
కానీ జేఎన్‌టీయూహెచ్ వర్సిటీ కాలేజీలున్న మంథనిలో 10 వేలు దాటినా, సుల్తాన్‌పూర్ క్యాంపస్‌లో 5 వేలు దాటినా సీఎస్సీ సీటు పక్కాగా వస్తోంది. ఇక టాప్‌టెన్ ప్రైవేటు కాలేజీల్లో 10 వేల ర్యాంకు వరకు కూడా సీఎస్సీ సీటు వచ్చే చాన్స్ ఉంది. ఒక కాలేజీలో మాత్రం గత ఏడాది 25 వేలు దాటిన ర్యాంకుకు కూడా ఆఖరి కౌన్సెలింగ్‌లో కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చింది. రిజర్వేషన్ కేటగిరీల్లో 20 వేలు దాటినా సీటు వచ్చే అవకాశం కన్పిస్తోంది.
కసరత్తు తర్వాతే ఆప్షన్లు ఇవ్వాలి
ఎంసెట్ ర్యాంకు వచ్చిన తర్వాత విద్యార్థులు ప్రధానంగా కౌన్సెలింగ్‌పై దృష్టి పెట్టాలి. వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందనేది గత కొన్నేళ్ల కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించి అంచనాకు రావాలి. ఈ కసరత్తు చేసిన తర్వాతే ఆప్షన్లు ఇవ్వాలి.
– ఎంఎన్ రావ్ (గణిత శాస్త్ర విశ్లేషకులు)
Comments
Please login to add a commentAdd a comment