ర్యాగింగ్, డ్రగ్స్‌పై సమరభేరి | Awareness programs in engineering colleges | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్, డ్రగ్స్‌పై సమరభేరి

Published Fri, Aug 16 2024 4:36 AM | Last Updated on Fri, Aug 16 2024 4:36 AM

Awareness programs in engineering colleges

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు

రేపు ఉన్నతస్థాయి సదస్సు నిర్వహించనున్న ఉన్నత విద్యామండలి 

కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ర్యాగింగ్, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి ఇప్పటికే ఈ అంశంపై అన్ని స్థాయిల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈ నెల 17న హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసవుతున్న ఉదంతాలు కొంతకాలంగా పెరుగు తున్నాయి. 

రాష్ట్రంలో పలు యూనివర్సిటీలు, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఇవి వెలుగు చూశాయి. వీటి వెనుక మాదకద్రవ్యాల మాఫియా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తొలి దశలో విద్యార్థుల్లో అవగాహన పెంచాలని ప్రభుత్వ నివేదికలు పే ర్కొంటున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు బయటపడకుండా యాజమాన్యాలు జాగ్రత్త పడుతున్నాయి. ధనిక విద్యార్థులు చదివే కాలేజీల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపడు తున్న చర్యలు ఆశించినంతగా లేవని నిఘా వర్గాలు ప్రభుత్వానికి చెప్పాయి. 

మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్న వారిని గుర్తించి, కౌన్సెలింగ్‌ ఇవ్వడాని కి గల ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కౌన్సెలింగ్‌ తర్వాత కూడా ఈ దిశగా అడుగులేసే విద్యార్థులపై చట్టప రమైన చర్యలకు ఉపక్రమించాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన చట్టాలను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు తెలియజేసేందుకు కాలేజీలు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది. 

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ తీవ్రంగా ఉందని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా ర్యాగింగ్‌కు గురవుతున్నట్లు గుర్తించారు. కొన్ని విద్యాసంస్థల్లో కుల వివక్షతో కూడిన ర్యాగింగ్‌ జరుగుతోందని చెబుతున్నారు. ఇలాంటి ఉదంతాలపై కొరడా ఝుళిపించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవల రాష్ట్రాలకు ఆదేశాలు పంపింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను కూడా వెల్లడించింది. 

ప్రతి కాలేజీలోనూ ర్యాగింగ్, మాదక ద్రవ్యాల కట్టడికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇందులో ఫ్యాకల్టీతోపాటు, సీనియర్‌ విద్యార్థులు, ఉన్నత అధికారులను భాగస్వాము లను చేయాలని పేర్కొంది. అయితే, ఏఐసీటీఈ మార్గదర్శకాలు ఎక్కడా అమలవ్వడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విద్యా సంవత్సరం నుంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

17న ఉన్నతస్థాయి సదస్సు
విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నిరోధం, ర్యాగింగ్‌ అంశాలపై ఈ నెల 17న జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీలో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి డీజీపీ జితేందర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కాలేజియేట్‌ కమిషనర్‌ దేవసేన, యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య హాజరవుతున్నారు. యాంటీ ర్యాగింగ్, మాదక ద్రవ్యాల నియంత్రణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

ఉపేక్షించేది లేదు
మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ఈ విషయంలో ఎంతటివారున్నా కఠినంగా చర్యలు తప్పవు. ఈ దిశగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగంపై సమాచారం ఉంటే విద్యార్థులు స్వేచ్ఛగా మా దృష్టికి తేవాలి. – ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌

ర్యాగింగ్‌ భూతాన్ని పారదోలాలి 
కాలేజీల్లో ర్యాగింగ్‌ వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే సూచించాం. ఇక నుంచి దీన్ని మరింత విస్తృతం చేస్తాం. కొత్తగా కాలేజీలకు వచ్చే వారిలో మనోనిబ్బరం కల్పించడం, ర్యాగింగ్‌ను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వడానికి కృషి చేస్తాం.     – ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement