క‌ర్సింగ్ రైటింగ్‌ | Funday new story of the week 10-02-2019 | Sakshi
Sakshi News home page

క‌ర్సింగ్ రైటింగ్‌

Published Sun, Feb 10 2019 12:42 AM | Last Updated on Sun, Feb 10 2019 12:42 AM

Funday new story of the week 10-02-2019 - Sakshi

రాత్రి పన్నెండింటికి మెలకువొచ్చింది అర్జున్‌కి. గబగబా లేచి గ్లాసెడు నీళ్ళు తాగి, మరో గ్లాసెడు నీళ్ళు మొహాన కొట్టుకుని పుస్తకం తెరిచాడు. అదొక ఫోర్‌ రూల్‌ బుక్‌.ప్రతి పేజీలోని పై వరుసల్లో ఇంగ్లీష్‌ నీతి వాక్యాలున్నాయి. ఉదయానికల్లా దాన్ని నింపేయాలి. పీరియడ్‌ మొదలవ్వడానికి ముందే.. పెద్దాయనకి చూపించాలి.వాళ్ల అమ్మ మెల్లగా లేచి దగ్గరికి వచ్చి ’నిద్రని ఆపుకోలేవు.. ఉండు.. కాస్త బూస్టు కలిపి తెస్తాను..’ అని వంటగదిలోకి వెళ్ళింది.అర్జున్‌కి ఆవిడ మాటలేవీ వినపడలేదు. పెన్సిలు కళ్లద్దానికి దగ్గరగా పెట్టుకుని ముల్లు పదును పరిశీలించాడు. తల అడ్డంగా ఊపుతూ షార్పెనర్ల గుట్ట వైపు చూశాడు.రెండు మూడు షార్పెనర్లను పట్టుకుని తేరిపార చూస్తూ, చివరికి ఎర్రరంగుది ఎంచుకుని పెన్సిలు చెక్కుకున్నాడు. పని పూర్తవ్వగానే తృప్తినిచ్చే నవ్వు కళ్లలోంచి బయటపడి మూతి మీదకు చేరింది.ఇది హోమ్‌వర్కు కాదు.రాత్రి పన్నెండింటికి మేలుకుని మరీ చేస్తున్నాడంటే.. దాని అర్థం పనిష్మెంట్‌ అని! ఈ మాత్రం విషయానికి ఆశ్చర్యం రాకపోవచ్చు. కానీ..అర్జున్‌ వయసు నలభై రెండేళ్లు.. ఈ మాట చెప్పగానే ఆశ్చర్యపోకుండా కాసేపాగి.. మతి చలించినవాడేమోలే.. అనుకోవచ్చు. కానీ.. అర్జున్‌ ఈజ్‌ ఏన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.. క్రియేటివ్‌ రూల్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో. ఇప్పుడు సందిగ్ధంలో పడి ఉంటారు.ఏంటీ ఇతని మేటర్‌ అని.అమ్మ ఇచ్చిన బూస్టు తాగి శ్రద్ధగా రాయడం మొదలు పెట్టాడు. దేర్‌ ఈజ్‌ నో క్రియేటివిటీ వితవుట్‌ ఫెయిల్యూర్‌...’ నాలుగో పదం దగ్గర పెన్సిల్‌లో స్వేచ్ఛ ఆవిరైపోయింది.సన్నగా వొణికింది. ‘‘సి కీ ఆర్‌ కీ కర్సిప్‌ లింక్‌ సరిగా చేయట్లేదు..’’ వాయిస్‌ గుండె బ్యాక్‌గ్రౌండ్లోంచి గుంభనంగా వినపడింది.. వాయిస్‌ మాత్రమే కాదది. బెదిరింపు.. హింస. పైశాచిక ఆనందం.అది కాలేజీ స్థాపించిన పెద్దాయనది. కళ్ల నుంచి నీళ్లు ఉబికాయి. రెప్పాడిస్తే కన్నీటిబొట్టు పుస్తకం మీద పడుతుందని, పుస్తకం దూరంగా నెట్టేశాడు. అమ్మ చూడకుండా తమాయించుకున్నాడు.భుజంమీది టవల్‌ తో మొహం తుడుచుకున్నాడు. ఆందోళనతో కూడిన ఆ ఏడుపాగట్లేదు. ఓ కొత్త రేజర్‌ అందుకుని, దాని అంచుతో తప్పు అనిపిస్తున్న పదాన్ని తుడిచాడు.. ఒకసారి.. రెండుసార్లు.. మూడుసార్లు... సరిగ్గా రాశాడో లేదో తనకే అర్థం కావట్లేదు.

పుస్తకం నింపేశాడు.కాలేజీ క్యాంటిన్లో ఎప్పట్లా సేమ్యా ఉప్మా పెట్టుకుని కూర్చున్నాడు అర్జున్‌. ఉప్మాలో సేమ్యా పుడకలు కలగాపులగంగా ఉన్న ఇంగ్లీష్‌ అక్షరాల్లాగ కనిపిస్తున్నాయి. వాటివంక కూడా కలవరంగా చూశాడు. ఫోర్కుతో అటూ ఇటూ కదిపాడు.. ఫోర్‌ రూల్‌ బుక్కులాగ గీతలు పడ్డాయి. అసహ్యపడి.. చప్పున దూరంగా తోసేశాడు.‘‘నేను మా పెద్దమ్మాయితో రాయించాను. బాగానే రాసింది.చూడాలి.. వాడేమంటాడో..’’ ఆనందంగా చెప్పాడు పక్కనే కూర్చున్న ప్రసాదరావు. అర్జున్‌ ‘అదృష్టవంతుడివి’ అన్నట్లుగా చిన్న నవ్వు నవ్విఊరుకున్నాడు.ఈలోగా అటెండరు పరుగెత్తుకుంటూ వచ్చి ‘‘మీటింగ్‌ హాల్‌ కి అర్జెంటుగా రావాలంట..’’ అని చెప్పి లైబ్రరీ వైపు కూడా కేకెయ్యడానికి దారితీశాడు.అర్జున్‌తో పాటు అక్కడున్న మరికొంతమంది ఉన్నపళంగా ఫోర్‌ రూల్‌ బుక్కులతో పరుగులు తీశారు.అప్పటికే అక్కడ కూర్చున్నాడాయన.ఆయన పేరు అప్రస్తుతం. కార్పొరేట్‌ వ్యవస్థను కరెన్సీతో కొలిచి కొనుక్కుని పెట్టిన కాలేజీ శాఖలను తన సామంత రాజ్యాలుగా భావిస్తాడు. తాను చట్టాలను చేయగల మేధావిగా.. సమర్థుడిగా.. నియంతగా.. వ్యవహరిస్తుంటాడు.స్టూడెంట్లు ప్రతిరోజూ హాజరవ్వాలి. యూనిఫామ్‌ వేయాలి. మొబైల్‌ నాట్‌ అలవ్డ్‌. లీవు కోసం పేరెంట్‌ ఆన్‌లైన్లో అప్లై చేయాలి. ప్రాపర్‌ కాజ్‌ సర్టిఫై చేసి చూపాలి.వాహ్‌.. మంచి కాలేజ్‌. ఈ తరం పిల్లలకు ఇలాంటిదే కరెక్టు.. అనుకుని చాలామంది జాయిన్‌ అయ్యారు. ఓరోజు సడెన్‌గా కర్సివ్‌ రైటింగ్‌ బుక్సు తెచ్చి మనిషికి ఓ పదేసి కాపీలు ఇచ్చారు. స్టాఫ్‌కి కూడా. డబ్బులు కట్టించుకుని మరీ.. ఇంజనీరింగ్‌ పిల్లలు ఎందుకు రాస్తారు? రాయలేదు. వాళ్ల వాళ్ల ఇళ్లల్లో ఈ పెద్దాయనకి మెంటల్‌ అని చెప్పారు. వాళ్లల్లో పేరున్నవాళ్లు వచ్చి తిట్టారు. వార్త వైరల్‌ అయిపోయింది. పెద్దాయన ఇగో దెబ్బతింది.

రెండ్రోజుల్లో స్టాఫ్‌ అందరికీ సర్క్యులర్‌ వచ్చింది. కర్సివ్‌ రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేసిన బుక్సు చూపించాలని. ఇంక్రిమెంట్లు వేసే టైమ్‌.. ప్రమోషన్లు ఇచ్చే టైమ్‌...మధ్యతరగతి మెట్లమీద నడిచే మాస్టార్లు.. ఏంచేస్తారు? రాత్రికి రాత్రి రాశారు. రాయించారు. ఉద్యోగం కోసం.. ఉన్నతిని దిగజార్చుకున్నారు.  ఆ బుక్సు దిద్దుతున్నప్పుడే మరో ఆజ్ఞ జారీ చేశాడు పెద్దాయన. ‘రేపు ఎస్సే రైటింగ్‌ ఎగ్జామ్‌. ప్రిపేర్‌ అయ్యి రండి..’ అని.అతని మొహంలో నవ్వు ఉంది. వీళ్లందర్నీ ఆటాడిస్తున్నానన్న అహం.. వీళ్లంతా సఫర్‌ అవుతూ కూడా నా ముందు వంగి వంగి ఉండాల్సిందే అన్న పైశాచిక ఆనందం.ఇంగ్లీష్‌ సార్‌ హాస్పిటల్‌లో ఉంటే.. ఆయనకు బుక్స్‌ వీపీపీలో పంపాడు. ’చిన్న విషయం’ అనుకునే స్థాయి దాటిన భావం అందరిలోనూ మొదలైంది అప్పుడే.మేథ్స్‌ లెక్చరర్, వెళ్లిపోతానన్నారు. రిజైన్‌ లెటర్‌ ఇచ్చినప్పటి నుంచి ఆయన్ను ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేందుకు మూడు నెలలుగా తిప్పుతున్నారు. అప్పుల్లో పడి ఆయన కుమిలిపోవడం.. ఈమధ్యనే ఆత్మహత్యాప్రయత్నం చేయడం.. అందరిలోనూ భయాన్ని రేపింది.పెద్దాయన పక్కనే ఓ టేబుల్‌ మీద పుస్తకాలన్నీ పెట్టారు. అటెండరు కృష్ణ అందివ్వడానికి వచ్చాడు. పైన రీనా మేడమ్‌ బుక్కు ఉంది. దానికి కలర్‌ పేపర్‌ అట్ట, లేబుల్, పువ్వుల అంచు డిజైన్‌ ఉంది.దాన్నిఅందించాడు కృష్ణ.అందుకుని.. దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి.. తెరిచాడు. ఒక రెండు నిమిషాల తర్వాత దాన్ని మూసేసి.. ‘‘రీనామేడమ్‌.. మీరు మరో నాలుగు పుస్తకాలు తీసుకోండి. రేపు సెలవు కదా.. ఎల్లుండి చూపించండి..’’ అన్నాడు. మళ్లీ అందరి వైపు చూస్తూ.. ఇలాంటి అట్టలు వేసి నన్ను మాయ చేయలేరు.. అంటూ నవ్వాడు.నెక్స్‌›్ట అంటూ పుస్తకం అందుకుని.. తెరిచీ తెరవగానే.. దాన్ని విసిరేశాడు. ‘టెన్‌ బుక్స్‌ రాసి పట్రా.. వరస్ట్‌ రైటింగ్‌..’ అన్నాడు.. అదెవరిదా అనుకుంటుండగా.. ప్రసాదరావు పరుగెత్తుకుంటూ ఆ పుస్తకం పడ్డ మూల వైపు వెళ్లాడు.అందరివీ విసిరేస్తున్నాడు..మనోజ్‌.. పుస్తకంలో మాత్రం మొహం పెట్టి అయిదు నిమిషాలు ఉన్నాడు. బైటికి వచ్చి. ’గుడ్‌.. నువ్వు ఎక్స్‌ట్రా బుక్‌ రాయక్కర్లేదు. లెవెల్‌ టూ బుక్‌ తీస్కో.. అని అభినందించాడు. లెవెల్‌ టూనా.. అంటూడీలా పడ్డాడతను. తర్వాత అర్జున్‌ పేరు చదివాడు. ‘‘నీ పిల్లలది ఎల్‌ కేజీ యూకేజీ అయిపోయిందా’’ అన్నాడు నవ్వుతూ. 

‘‘పెళ్ళి కాలేదండీ..’’ అన్నాడు పెద్దాయన వ్యంగ్యంగా అడిగాడని తెలిసి కూడా. ‘‘మరి ఇదెవరు రాశారు?’’ గద్దించాడాయన. ‘నేనే సార్‌..’’ అన్నాడు పెద్దాయనకి జవాబు తెలిసే అడిగాడని తెలిసినా.
‘‘అచ్ఛా.. తమరు మంచి ఆర్టిస్టులా ఉన్నారే.. ఓ పదిహేను పెయింటింగ్స్‌ గీసి తీస్కురండి..’’ అన్నాడు కాళ్లూపుతూ.. మరింత వెటకారంగా.మర్నాడు లీవు కావాలని అడగాలన్న మాట గొంతు దాటలేదు. అమ్మను హాస్పిటల్‌కి తీసు కెళ్లాలి. తతంగం పూర్తయ్యాక ధైర్యంచేసి వెనకాలే వెళ్లాడు అర్జున్‌.. ‘‘సార్‌.. రేపు లీవు..’’...‘‘మొన్న తీసుకున్నావ్‌ కదా.. నీకు రెండు వారాలకే నెల పూర్తవుతుందా? ఏమనుకున్నావ్‌? కాలేజీలో వర్క్‌షాప్‌ ఉంది. ఎట్లా పోతావ్‌? నెలకి ఒకటే సీఎల్‌... అర్థం కాదా మీకు.. సెలవు పెట్టి ఏదో వేరే ఎగ్జామ్స్‌కి అటెండ్‌ అవుతారు.. గ్రూప్‌ వన్నా టూనా..? నాకు తెలీదా..’’‘‘అది కాదు సార్‌.. అమ్మకి బాలేదు.. హాస్పిటల్‌కి..’’ ‘‘మా అమ్మకీ బాలేదు.. నేను వస్తున్నా కదా.. సాకులు.. సాకులు... వరస్ట్‌ మెంటాలిటీస్‌..’’ఆయన ఆగకుండా.. నడుస్తూనే ఉన్నాడు. కార్‌ డోర్‌ తెరిచే ఉంచారు.లోపల కూర్చుని రయ్యిమని వెళ్లిపోయాడు.దుఃఖం ముంచుకొచ్చింది అర్జున్‌కి. ఎటెండరు కృష్ణ పక్కకి వచ్చి సముదాయింపుగా తల ఊపాడు.‘సాయంకాలాలూ రాత్రిళ్లూ ఈయనిచ్చిన ఫోర్‌ రూల్‌ పుస్తకాలు నింపేసరికే అయిపోతుంది.. అమ్మ సంగతి..? అటు ఉద్యోగం ఊడిపోతే.. ఉన్నపళంగా ఏదీ తోచని బ్రతుకు..’’ గొంతు తడారిపోయింది అర్జున్‌కి..రీనా మేడమ్, పక్కనే ప్రసాదరావు.. మరికొందరు స్టాఫ్‌... అర్జున్‌ మాటలు వింటూ నిల్చుండిపోయారు.‘‘ఇద్దరు పిల్లల ఒంటరి రీనా మేడమ్‌.. లక్షల్లో అప్పులు తీర్చలేక నెట్టుకొస్తున్నరు ప్రసాద్‌ సార్‌.. తొంభై అయిదు కిలోమీటర్లు అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తున్న వెంకట్‌ బాబుసార్‌.. ఒకరికి కాదు.. అందరికీ.. అందరికీ.. టార్చర్‌ పెడుతున్నాడు. ఏమీ చేయలేరని.. వాడికేమీ చేయలేరా సార్‌..? కూర్చుని ఏడుస్తరు.. మా నాయనమ్మ ఓ కత చెప్పింది.. పిల్లి మెడలో గంట కట్టడానికి ఎలకలన్నీ మీటింగు పెట్కున్నయంట. తర్వాత ఏం జరిగిందో అనవసరం. మీరు మీటింగన్నా పెట్కోలే..? అంతకన్నా హీనమా? ‘ కృష్ణ చీదరింపు ఇది ఎన్నోసారో తెలీదు.‘‘ఎవరి బతుకులు వారివి.. ఏం చేస్తాంరా కృష్ణా..’’ నిరాశగా మాట్లాడాడు ప్రసాద్‌సార్‌. 

‘‘కనీసం గట్టిగా మాట్లాడండి సార్‌..’’ ‘‘నీకేమన్నా పిచ్చా..?’’ ‘‘ఈ మాట.. ఇదే మాట.. వాడి ఎదురుగా అనండి.. నిజంగా..’’ ‘‘మెంటల్‌ నా కొడుకు.. కేసు పెడితే.. మా ఉద్యోగాలు ఏమవుతాయ్‌? మళ్లీ ఎక్కడ వెతుక్కుంటాం..’’‘‘ఉద్యోగం పోతే మళ్లీ వెతుక్కోలేం.. అన్నది ఎంత చేతకాని మాట సార్‌? పీజీలూ పీహెచ్‌డీలూ చేసి ఇంత దేభ్యం బతుకు ఎందుకుసార్‌? సిగ్గుండాలి.. ఛత్‌.. జైల్లో ఖైదీల్లెక్క ఉన్నారు. ఇదా ఉద్యోగం? కాపీరైటింగు కర్సివ్‌ రైటింగులేంది? పిచ్చకాకపోతే? ఒకసారి సరే.. వారం వారం.. ఆదివారాలు మింగేస్తన్నాడు. సోమవారాలు ఏడుపుమొహాలతో.. సిగ్గుండాలి.. లాస్‌ ఆఫ్‌ పే సెలవు కూడాఇవ్వడా..? హలో.. బ్రిటీషోళ్లు వెళ్లిపోయి చాలాకాలం అయింది సారూ..’’‘‘అయితే ఇప్పుడేం చేయమంటావ్‌ రా..?’’ ‘‘ఎవడికి కాలితే వాడు.. నిలదీయాలి సార్‌‘ ‘‘ఎవరు చేస్తారు చెప్పు.. ఎవ్వరూ ముందుకు రారు..’’ రీనా మేడమ్‌ గొంతు తగ్గిస్తూ అంది.‘‘ఎవరో ఒకరు చెయ్యాలి.. ఇంతమందికి మేలు జరుగుతుందంటే.. చెయ్యరా?.. ప్రపంచం చాలా విశాలమైనది. కుటుంబాల్ని కూలి పనిచేసుకుని అయినా పోషించుకోవచ్చు ప్రసాద్‌ సార్‌!  చాలామంది టైలరింగులు లాంటి పనులు చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు రీనా మేడమ్‌!! తట్టలు మోసేవాళ్లకు కూడా తల్లిని చూడాల్సిన బాధ్యత ఉంది అర్జున్‌ సార్‌!!! వీడేమన్నా హిట్లరా? తుపాకీ ఉందా? చంపేస్తాడా? నోరెందుకు పెగలదు? ఒక్కసారి ఎదురునిల్చి మాట్లాడండి సార్‌.. తలదించుకుని కాదు.. వాడి కళ్లలోకి చూస్తూ.. తెలుసుగా.. ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలో మళ్లీ మీరే చెప్తారు అందరికీ.. ఈ ఒక్క పనితో మీకు చాలా సమస్యలు తీరుతాయి. ఈ సాయంత్రం సమస్య మీది. మీకోసం మీరే నిలబడాలి. పోరాడాలి. ఎవరో వస్తారని ఎదురు చూడకండి.మీరొకరికి స్ఫూర్తి అవుతారు. జీవితం రేపటినుంచే కొత్తగా ఉంటుంది. నమ్మండి. నేను వెళ్లి ఏదో మాట్లాడొచ్చు.. కానీ.. ఎవరి ఆట వాళ్లు ఆడాలికదా.. నాకు కాలినప్పుడు నేను లేస్తా.. ఇక మీ ఇష్టం..’’ కృష్ణ తన తల కుడివైపుకి కాస్త వాల్చి తూటాల్లా మాటలు విసురుతుంటే.. యమస్పీడులో కర్సివ్‌ రైటింగ్‌ రాస్తున్నట్లుంది..‘‘నాకు కాల్తంది...’’ నింపాదిగానే అన్నాడు అర్జున్‌.‘‘ఇదేమన్నా స్వతంత్ర పోరాటమా? విశాఖ ఉక్కు ఆంధ్రులహక్కు అన్నట్లు తిరగాలా.. ఉన్న ఉద్యోగం ఉంటే చాలు..’’ ప్రసాదరావు తప్పుకుని వెళ్లిపోయాడు. మిగతావాళ్లు ’ఏంచేస్తాంలే.. మన లైఫ్‌లు ఇంతే..’ అనుకుంటూ నీరుగారిపోయారు...అర్జున్‌ ఒక్క నిమిషం పాటు కదల్లేదు. బిగుసుకున్న దవడల మధ్య అతని నిర్ణయం స్పష్టంగా ధ్వనించింది.‘‘ఛీ.. దీనమ్మా జీవితం.. ఒరే కృష్ణా.. ఏదైతే అదైంది.. కర్రీ పాయింటు పెట్టుకున్నా చాలు.. బతికేస్తా.. సగం జీవితం అయిపోయింది.. బాగా చెప్పావురా.. జీవితాంతం నిన్ను గుర్తు పెట్టుకుంటా..’’ పరుగులాంటి నడకతో ఇంటికి బయల్దేరాడు అర్జున్‌. .అర్జున్‌ ఆరేడడుగులు వేశాడో లేదో.. వెనకాల్నించి కృష్ణ ‘‘సార్‌.. మీ నడకలోనే కర్సివ్‌ రైటింగ్‌ కనిపిస్తంది. సూపర్‌..’’ అన్నాడు.

అర్జున్‌ వెనక్కి తిరిగి ఓ కామా పెట్టినట్లు నవ్వి బయల్దేరాడు.అమ్మను హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. ఆ రాత్రి తనే వంట చేసి ఆమెకు వడ్డించాడు. ఆమె కొడుకు చూపించే ప్రేమకు తృప్తిపడింది. అర్జున్‌కి ఆ తృప్తి మరికొంత ధైర్యాన్నిచ్చింది.  భోజనాలు అయ్యాక రీడింగ్‌ టేబుల్‌ దగ్గర ఫోర్‌ రూల్‌ బుక్‌ తెరిచి రాయడం మొదలు పెట్టాడు. అదీ రెడ్‌ ఇంక్‌ పెన్‌తో! గంట సేపు ఏకధాటిగా రాస్తున్నంతసేపూ మొహాన చిరునవ్వు చెరగలేదు.‘‘సార్‌.. మన కాలేజీ చీడ మిగతా కాలేజీలకు కూడా పాకేసింది. ‘స్నేక్‌మూవ్స్‌’ కాలేజీవాళ్లు కూడా ఫోర్‌ రూల్‌ బుక్కులు పెట్టారంట తెల్సా..‘ కొత్త ప్రొఫెసర్‌ ఒక్కొక్కరి చెవుల్లో గుసగుసలాడాడు.‘‘మంచి మూడు అడుగులు వేసేలోపు.. పైత్యం పది కిలోమీటర్లు పోతాది మరి...’’ అన్నాడు అర్జున్‌. అందరూ నిర్వేదంగా నవ్వేరు.ఈలోగా మీటింగ్‌ హాల్‌ కి రమ్మని అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. ఇన్‌స్పెక్షన్‌ కి పై అధికారులు కూడా అక్కడే ఉన్నారని మరొకాయన అన్నాడు.అందరూ పుస్తకాలను పట్టుకుని బయల్దేరారు. దొంతులు పెట్టి ఎదురుగా కూర్చున్నారు. అందరికంటే చివరగా పుస్తకాల మీద అర్జున్‌ పుస్తకం పెట్టాడు.పెద్దాయన పొట్ట మీద గోక్కుంటూ విలాసంగా నవ్వుతూ అధికారులకు తన నియమాలను చెప్పడం మొదలు పెట్టాడు. ‘‘మొన్న ఎస్సే రైటింగ్‌ పెట్టాం. అందరూ మొబైల్‌లో కాపీ కొట్టి రాశారు.. నాకు తెలిసింది.. ఏంచేయాలా అని ఆలోచిస్తున్నా.. వాళ్లు రాసింది హండ్రెడ్‌ టైమ్స్‌ ఇంపొజిషన్‌ రాయిస్తా..’’ అంటూ వాళ్లను నవ్వించాననుకున్నాడు.‘‘బై ద వే.. ఇవి మావాళ్ల ఇంప్రూవ్‌ మెంట్‌ వర్క్‌’’ అంటూ అర్జున్‌ పుస్తకం తీసి ఒకాయనకి అందించాడు.అందుకున్నాయన అది తీసి, ఒక నిమిషం చదివి ఒకటే నవ్వు! పక్కాయనకి అందించాడు.. ఆయన కూడా శ్రుతి కలిపాడు.మూడో ఆయన బైటికే చదివాడు.. ‘‘డియర్‌ సర్‌.. యూ హావ్‌ ఏ సీరియస్‌ డిజార్డర్‌ సమ్‌ థింగ్‌ లైక్‌ డీలూజన్‌ సిమ్టమ్స్‌. బెటర్‌ టు కన్సల్ట్‌ ఇమ్మీడియట్లీ. వి ఆర్‌ ఆల్‌ యువర్‌ వెల్‌ విషర్స్‌. వి ప్రే ఫర్‌ యూ.. వి లవ్‌ యూ.. ప్లీజ్‌ చెక్‌ యువర్‌ మైండ్‌.. ఆల్‌ నెర్వ్‌స్‌ ఆర్‌ ఫార్మ్‌డ్‌ యాజ్‌ ఇన్‌ ద ఫామ్‌ ఆఫ్‌ ఫోర్‌ రూల్‌!.. వాటీజ్‌ దిస్‌ నాన్‌సెన్స్‌? లెటజ్‌ మూవ్‌ టు సేవ్‌ యూ..’’పెద్దాయన మొహాన నెత్తురు చుక్కలేదు. ‘‘ఏంటి సార్‌.. ఇదంతా?’’ అడిగారా అధికారి. అందరి మొహాలూ స్విచ్చులు వేసిన ట్యూబ్‌ లైట్లలా ఉన్నాయి. వెలగలేదింకా...! అర్జున్‌ లేచాడు..‘‘ఇదంతా మా బతుకు సార్‌.. బాధలు సార్‌.. ఎక్కడా చెప్పుకోలేని ఛండాలమైన టార్చర్‌ సార్‌..’’ అంటూ గుక్కతిప్పకుండా గంట సేపు మాట్లాడాడు.లైట్లన్నీ వెలిగాయి.ప్రసాదరావు.. రీనామేడమ్‌.. శరత్‌ కుమార్‌.. అందరూ ఒక్కో మాటా.. కర్సివ్‌ రైటింగ్‌లాగ ఎక్కడా తెగనీకుండా తేడా రాకుండా.. బాధలన్నీ చెప్పుకొచ్చారు.అధికార్ల ముందు పెద్దాయన కుక్కచెవులొచ్చిన పిల్లాడి నోట్సులా ఉండిపోయాడు.  ‘క్రమశిక్షణ కోసమని రాయిస్తున్నా..‘ అని ఏదో చెప్పబోతుంటే.. ‘‘నువ్వొక పేజీ రాయవయ్యా చూస్తాం..’’అన్నాడొక అధికారి.‘‘క్రమశిక్షణ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచు. ఇష్టానుసారం పిచ్చిపనులు చెయ్యడం కాదు..’’ ముక్తాయింపునిచ్చాడు మరొకాయన.పెద్దాయన ముఖంలో ఓ తెల్లకాగితంలాంటి పశ్చాత్తాపం తలదించుకుంది. ఇప్పుడు నిలబడి ఉన్న అర్జున్, ఫోర్‌ రూల్‌ బుక్కులో ఇంగ్లీష్‌ మూడోబడి క్యాపిటల్‌ అక్షరంలా ఠీవిగా కనిపిస్తున్నాడు.
- ఎస్‌.ఎస్‌.దేవసింధు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement