ఇంజనీరింగ్ కాలేజీలకు తేల్చిచెప్పిన హైకోర్టు
ప్రభుత్వం అనుమతి లేకుండా సీట్ల పెంపు కుదరదని స్పషీ్టకరణ
సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై పలు కాలేజీలు వేసిన పిటిషన్ల కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రారంభించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం నిరభ్యంతర పత్రం జారీ చేయకుండా కొత్త కోర్సులు, సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. కొత్త కోర్సులపై అంతిమ నిర్ణయం తమదేనన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఈ మేరకు శుక్రవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది.
బీటెక్, బీఈ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర బ్రాంచీల సీట్ల పెంపునకు, కొన్ని కోర్సులను ఇతర కోర్సుల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో 28 పిటిషన్లు వేశాయి. నూతన కోర్సులకు జేఎన్‌టీయూహెచ్, ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదని పిటిషన్లలో పేర్కొన్నాయి. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు డి.ప్రకాశ్‌రెడ్డి, ఎస్.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ ఎస్.రాహుల్‌రెడ్డి వాదనలు వినిపించారు.
ఎవరి వాదన ఏమిటంటే..
‘ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే ప్రభుత్వం కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వట్లేదు. రీయింబర్స్‌మెంట్ ఇబ్బందులు లేకుండా ప్రస్తుతమున్న పాత కోర్సులను కొత్త కోర్సులుగా మార్చుకొనేందుకు కూడా నిరాకరిస్తోంది. జేఎన్‌టీయూహెచ్, ఏఐసీటీఈ నివేదికలతో సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై దరఖాస్తు చేసుకున్నా కారణమేదీ చెప్పకుండానే ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి నిరాకరించారు’అని పిటిషనర్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. మరోవైపు ఈ వాదనతో ప్రభుత్వ న్యాయవాది రాహుల్‌రెడ్డి విభేదించారు. ‘పిటిషన్లు వేసిన కాలేజీలకు జేఎన్‌టీయూహెచ్ షరతులతో ఎన్‌ఓసీ జారీ చేసింది.
ఇది ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోవడానికే వీలు కలి్పస్తుంది. అధ్యాపకులు, మౌలికసదుపాయాలు, ప్రభుత్వం ఆమోదం విశ్వవిద్యాలయ నిబంధనల మేరకు ఉంటుంది. సీట్ల పెంపు లాంటిది ఒక్క రీయింబర్స్‌మెంట్‌కే పరిమితం కాదు. విద్యార్థుల పెంపు వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కింద అనుమతిస్తే విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేద విద్యార్థులకు భారంగా మారుతుంది. ఇప్పటికే కొన్ని కాలేజీల్లోని కోర్సుల్లో 120 మంది విద్యార్థులున్నారు. ఇంకా పెంచాలని కోరడం సరికాదు.
ఆ పిటిషన్లను కొట్టివేయాలి’అని రాహుల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి విద్యాచట్టంలోని సెక్షన్ 20 ప్రకారం సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై ప్రభుత్వానికే అధికారాలుంటాయని స్పష్టం చేశారు. కాలేజీల మధ్య అనారోగ్య పోటీని రూపుమాపడానికి తగిన నిర్ణయం తీసుకొనే అధికారం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఉందని.. అందువల్ల ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment