సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంకట స్థితి తలెత్తింది. అత్యున్నత విద్యా ప్రమాణాలతో బోధన చేపట్టాల్సిన కాలేజీలకు నిర్వహణ భారం గుదిబండగా మారింది. ఈ పరిస్థితిని తట్టుకోలేక యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నా యి. 2018–19 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 246 కాలేజీల్లో బోధన నిలిచిపోయినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 6,306 కాలేజీలున్నాయి. ఆయా కాలేజీలు ఏటా సంబంధిత యూని వర్సిటీ/ బోర్డు నుంచి గుర్తింపు పత్రాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీల్లో బోధనా సిబ్బంది, మౌలిక వసతులు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని వర్సిటీ/బోర్డు అనుమతులు జారీ చేస్తుంది. అనుమతులున్న కాలేజీల్లోనే విద్యార్థుల ప్రవేశానికి వీలుం టుంది. ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతనాలు, రీయింబర్స్‌మెంట్ గుర్తింపు ఉన్న కాలేజీలకే వర్తిస్తాయి. ఈ క్రమంలో ఈ ఏడాది 6,060 కాలేజీలు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోగా వాటిలో ఇప్పటివరకు 5,788 కాలేజీలకే గుర్తింపు పత్రాలు జారీ అయ్యాయి. మిగతా కాలేజీల గుర్తింపు ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
బోధనకు దూరంగా 246 కాలేజీలు...
2018–19 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 246 కాలేజీల్లో ప్రవేశాలు జరగలేదు. ఇంటర్మీడియెట్ ప్రవేశాలు మాన్యువల్ పద్ధతిలో నిర్వహించగా డిగ్రీ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో చేపట్టారు. పీజీ, ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు పూర్తి చేశారు. ఆన్‌లైన్, సెట్‌ల ద్వారా నిర్వహించే అడ్మిషన్ల ప్రక్రియలో కాలేజీలు ముందుగా అనుమతి పత్రాలు, కోర్సు వివరాలను కన్వీనర్లకు సమర్పించాల్సి ఉంటుంది. కాలేజీలు వివరాలు ఇచ్చాకే వాటి ఆధారంగా సీట్ల లభ్యతనుబట్టి అడ్మిషన్లు పూర్తవుతాయి. ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా 246 కాలేజీలు సమ్మతి పత్రాలు సమర్పించకపోవడంతో ఆయా కాలేజీల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోలేదు.
డిగ్రీ, పీజీ కాలేజీలే అత్యధికం...
ఈ ఏడాది ప్రవేశాలు జరగని వాటిలో అత్యధికంగా డిగ్రీ, పీజీ కాలేజీలే ఉన్నాయి. డిగ్రీ, పీజీ కేటగిరీలో ఏకంగా 197 కాలేజీల్లో విద్యార్థులు చేరలేదు. అత్యధికంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 87 కాలేజీలుండగా... ఆ తర్వాత స్థానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 53 కాలేజీలున్నాయి. ఈ ఏడాది 15 ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ప్రవేశాలు జరగలేదు. అదేవిధంగా నర్సింగ్, లాబ్‌టెక్నీషియన్ కోర్సులకు సంబంధించిన పారామెడికల్ కాలేజీలు 8, ఐటీఐలు 7, బీఈడీ కాలేజీలు 4, టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు పరిధిలోని 4 పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు జరగలేదు.
యునివర్సిటీ/బోర్డులవారీగా రెన్యువల్ కాని కాలేజీలు
యూనివర్సిటీ/బోర్డు కాలేజీలు
ఎల్‌ఈటీ 7
డీఎస్‌ఈ 4
జేఎన్‌టీయూ 15
కాకతీయ 53
మహాత్మాగాంధీ 20
ఉస్మానియా 87
పాలమూరు 18
శాతవాహన 19
తెలంగాణ 6
246 కళాశాలల్లో విద్యార్థుల్లేరు!
Published Mon, Feb 11 2019 1:54 AM | Last Updated on Mon, Feb 11 2019 5:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment