
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలకు బుధ లేదా గురువారాల్లో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు రానున్నాయి. మంగళవారమే అనుమతులు రావాల్సి ఉన్నా సాధ్యపడలేదు. అలాగే 238 ప్రైవేటు పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీల ల్యాండ్ కన్వర్షన్, భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన పత్రాలు సమర్పించేందుకు ఏఐసీటీఈ రెండేళ్ల గడువిచ్చింది.
రాష్ట్రంలోని అనేక కాలేజీలు సరైన పత్రాలు లేకుండానే కొనసాగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో కాలేజీల వారీగా పత్రాల పరిశీలనను ఏఐసీటీఈ చేపట్టింది. గ్రామ పంచాయతీ అనుమతితో నడుస్తున్నవి, భవన నిర్మాణాల అనుమతులు లేనివి, చెరువులు, సీలింగ్ భూముల్లో, అటవీ భూముల్లో నిర్మించిన కాలేజీలు ఉన్నట్లు పరిశీలనలో తేలింది. సరైన పత్రాలుంటేనే అనుమతులిస్తామని ఏఐసీటీఈ స్పష్టం చేయడంతో యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. ఏఐసీటీఈతో ప్రభుత్వం చర్చించిన తర్వాత పత్రాలు అందజేసేందుకు యాజమాన్యాలకు రెండేళ్ల గడువిచ్చింది.