సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పాలిసెట్–2023 పరీక్ష బుధవారం (నేడు) జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 61 పట్టణాల్లో 499 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. పాలిసెట్‌కు మొత్తం 1,59,144 మంది దరఖాస్తు చేశారని వివరించారు. వీరిలో 96,429 మంది బాలురు, 62,715 మంది బాలికలు ఉన్నారన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 21 వేల దరఖాస్తులు పెరిగాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో 26,698 మంది ఎస్సీ, 9113 మంది ఎస్టీ అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు.
ఉచితంగా కోచింగ్ అందించాం..
పాలిటెక్నిక్ విద్యతో ప్రయోజనాలు, ఉపాధి అవకాశాల గురించి ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ద్వారా పదో తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించినట్టు నాగరాణి తెలిపారు. రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 9 వేల మంది విద్యార్థులకు పాలిసెట్‌కు ఉచితంగా కోచింగ్ అందించి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశామన్నారు.
ఈ ఏడాది కొత్తగా మరో మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో తరగతులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 87 ప్రభుత్వ, 171 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 29 బ్రాంచ్‌ల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులు అందిస్తున్నామన్నారు. కాగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులు ఈ ఏడాది నాలుగు వేలకు పైగా ప్లేస్‌మెంట్లు సాధించారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment