‘ఇంజనీరింగ్‌’ ఫీజు పెంపు దిశగా కసరత్తు | Workout on engineering fee hike | Sakshi
Sakshi News home page

‘ఇంజనీరింగ్‌’ ఫీజు పెంపు దిశగా కసరత్తు

Published Sat, Jun 29 2019 2:19 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Workout on engineering fee hike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజు పెంపు దిశగా కసరత్తు మొదలైంది. యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. కొత్త ఫీజులను ఖరారు చేసే వరకు కొంతమేర ఫీజు పెంచేందుకు అధికార వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఈనెల 29న యాజమాన్యాలతో సమావేశం నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ), ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) చర్యలు చేపట్టాయి. కొత్త ఫీజులను ఖరారు చేసేవరకు ఇప్పటివరకు వసూలు చేసిన ఫీజులనే అమలు చేయాలని కోరాలన్న నిర్ణయానికి వచ్చాయి. అయితే యాజమాన్యాలు అందుకు అంగీకరిస్తాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.  

10 నుంచి 15 శాతం వరకు.. 
ఒకవేళ పాత ఫీజుల అమలుకు యాజమాన్యాలు ఒప్పుకోకపోతే ఎలా ముందుకు సాగాలన్న ఆలోచనలు ప్రభుత్వం ఇప్పటికే చేసింది. కాలేజీలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేస్తే మాత్రం తల్లిదండ్రులు తీవ్ర వ్యవతిరేకత వస్తుందన్న నిర్ణయానికి అధికారవర్గాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా కొంత మేర ఫీజు పెంపు (10 శాతం నుంచి 15 శాతం)నకు అంగీకరించాలన్న అలోచనల్లో అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఈనెల 29న ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో యాజమాన్యాల నిర్ణయం మేరకు ఇంజనీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల షెడ్యూల్‌ ఆధారపడి ఉంది. వాస్తవానికి ఈ నెల 27 నుంచే వెబ్‌ ఆప్షన్లను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కోర్టు తీర్పు కాపీ అందలేదని ప్రవేశాల కమిటీ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసింది.

వచ్చే నెల 1 నుంచి 4వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లు స్వీకరించేలా షెడ్యూల్‌ను సవరించింది. ఒకవేళ యజమాన్యాలు అధికార వర్గాల ప్రతిపాదనలకు ఒప్పుకోకపోతే ఇంజనీరింగ్‌ ప్రవేశాల షెడ్యూల్‌ను మరికొన్నాళ్లు వాయిదా వేసి, ఫీజులను ఖరారు చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు సమాచారం. 10 నుంచి 15 రోజుల్లో ఫీజులను ఖరారు చేశాకే ముందుకు సాగే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక కోర్టు తీర్పు కాపీ బుధవారం రాత్రి అందింది. అది అందాక ఆగమేఘాలపై కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే శుక్రవారం నాడు కూడా అప్పీల్‌ చేయలేకపోయింది.  

కోర్టుకెళ్లిన కాలేజీలకు అదే తరహాలో.. 
మొదట కోర్టును ఆశ్రయించిన ఆరు కాలేజీల్లోనే యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాలని కోర్టు తీర్పునివ్వగా, అదే తీర్పును తమకు వర్తింపజేయాలని మరో 75 కాలేజీలు కోర్టుకు వెళ్లాయి. వాటికి కూడా కోర్టు అదే తీర్పును అమలు చేయాలని శుక్రవారం ఉత్తర్వులిచ్చినట్లు ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొన్నారు. ఇదిలాఉండగా ప్రభుత్వం గురువారం ఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్‌ను నియమించింది. ఆయన ఇప్పటికిప్పుడు ప్రక్రియ చేపట్టినా ఫీజుల ఖరారుకు పది రోజుల సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే యాజమాన్యాలతో చర్చించేందుకు 29న సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

యాజమాన్యాలు అంగీకరించాకే వెబ్‌ ఆప్షన్లు.. 
యాజమాన్య ప్రతిపాదిత ఫీజుల్లో ఒక కాలేజీ అయితే రూ. 3.19 లక్షలు ప్రతిపాదించగా.. మరో కాలేజీ రూ. 2.80 లక్షలు, ఇంకో కాలేజీ 2.30 లక్షలు ప్రతిపాదించాయి. గతంలో రూ. 1.20 లక్షల లోపు ఉన్నవి ఈ ఫీజులను ప్రతిపాదించగా, గతంలో రూ. 80 వేల వార్షిక ఫీజున్న కాలేజీలు కూడా ఈసారి రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పైగా వార్షిక ఫీజును ప్రతిపాదించాయి. కొత్త ఫీజులను ఖరారు చేశాక హెచ్చు తగ్గులను సర్దుబాటు చేసుకునే వెసులుబాటున్నా అది అనేక సమస్యలకు కారణంగా అయ్యే పరిస్థితి వస్తుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ముందుగా ఫీజులను ఖరారు చేయాలనీ చెప్పిందని, తమ ప్రతిపాదనలకు యాజమాన్యాలు అంగీకరించకపోతే ఫీజులను ఖరారు చేశాకే వెబ్‌ ఆప్షన్లు, తదుపరి కౌన్సెలింగ్‌ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement