Fee regulatory committee
-
ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!
అక్షరాల రూ.4.27 లక్షలు. ఇదేదో వార్షికవేతనం అనుకుంటే పొరపడినట్లే. ఇది ఎడ్యుకేషన్ ఫీజు. ‘అందులో ఏముంది ఎంబీబీఎస్ చదువుకో. ఇంజినీరింగ్ చదువుకో అంత అవుతుంది కదా’ అంటారా. ఇది కేవలం ఒకటో తరగతిలో చేరడానికి కావాల్సిన ఫీజు. అవును.. మీరు విన్నది నిజమే. వచ్చే కొత్త విద్యా సంవత్సరంలో తన కూతురు ఒకటో తరగతి స్కూల్ ఫీజును రాషబ్ జైన్ అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దాంతో ఇదికాస్తా వైరల్‌గా మారింది.‘నా కుమార్తె వచ్చే ఏడాది గ్రేడ్ 1లో చేరుతుంది. అందుకోసం మా నగరంలో ప్రముఖ స్కూల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించాం. ఆ స్కూల్ ఫీజు చూసి షాకయ్యాను. ఇతర స్కూళ్లలోనూ సుమారు ఇదే తరహా ఫీజు ఉంది. ఈ స్కూల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు: రూ.2,000, అడ్మిషన్ ఫీజు: రూ.40,000, కాషన్ మనీ (వాపసు): రూ.5,000, వార్షిక పాఠశాల ఫీజు: రూ.2,52,000, బస్ ఛార్జీలు: రూ.1,08,000, పుస్తకాలు, యూనిఫాం: రూ.20,000, మొత్తం రూ.4,27,000! ఇది భారతదేశంలో నాణ్యమైన విద్య ధర. మీరు ఏటా రూ.20 లక్షలు సంపాదించినా దీన్ని భరించలేరేమో’‘మీరు నెలకు 2000 డాలర్లు(రూ.1.68 లక్షలు) సంపాదిస్తే అందులో ఆదాయపు పన్ను, జీఎస్టీ, పెట్రోల్‌పై వ్యాట్, రోడ్డు పన్ను, టోల్ ట్యాక్స్, ఫ్రొఫెషనల్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్, ల్యాండ్ రిజిస్ట్రీ ఛార్జీలు మొదలైన వాటి రూపంలో ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. దానికితోడు టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా ప్రీమియంలు, వృద్ధాప్య పెన్షన్ కోసం పీఎఫ్, ఎన్పీఎస్ చెల్లించాలి. రూ.20 లక్షల ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ పథకాలకు అర్హత పొందలేరు. ఎలాంటి ఉచితాలు లేదా రుణ మాఫీలు పొందలేరు. అన్ని ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో ఫుడ్, బట్టలు, అద్దె, ఈఎంఐలు, స్కూల్ ఫీజులు.. దేనిపై ఖర్చు చేయాలో నిర్ణయించుకోండి’ అంటూ పోస్ట్ చేశారు.Good education is a luxury - which middle class can not affordMy daughter will start Grade 1 next year, and this is the fee structure of one of the schools we are considering in our city. Note that other good schools also have similar fees.- Registration Charges: ₹2,000-… pic.twitter.com/TvLql7mhOZ— RJ - Rishabh Jain (@rishsamjain) November 17, 2024ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..ఈ పోస్ట్‌కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఈ ఫీజు ఇలాగే కొనసాగితే 12 సంవత్సరాలలో దాదాపు రూ.కోటి-1.2 కోట్లు ఖర్చు చేయాల్సి ఉటుంది. మధ్యతరగతి వారు ఇంత అధిక ఫీజులను భరించలేరు. ఇది తీవ్రమైన సమస్య. దీనిపై ప్రభుత్వ నియంత్రణ అవసరం’ అని రిప్లై ఇస్తున్నారు. -
స్కూలు ఫీజులు తగ్గుతాయా?
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు మరికొంత సమయం వేచి చూడాల్సిందే. ప్రైవేటు స్కూళ్లలో ఫీజు దోపిడీకి చెక్ పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తోంది. ఈమేరకు కసరత్తు వేగవంతం చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.2024–25 విద్యా సంవత్సరం జూన్ 12నుంచి పునః ప్రారంభం కానుంది. ఆలోపు ఫీజు నియంత్రణకు సంబంధించి స్పష్టత, ఉత్తర్వు లు వస్తే ఆ మేరకు తల్లిదండ్రులు పిల్లల స్కూల్ ఫీజుల చెల్లింపులపై అంచనాలు వేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే జూన్ 6వ తేదీ వరకు పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో ఆలోపు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి లేదు. ఆ తర్వాత కసరత్తు వేగవంతం చేసినప్పటికీ ఫీజు నియంత్రణ చట్టం ఖరారయ్యేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.ఈ క్రమంలో 2024–25 విద్యా సంవత్సరంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు అనుమానంగానే ఉంది. చట్టం రూపకల్పన, ఆ తర్వాత చట్టసభల్లో ఆమెదం తర్వాతే ఫీజు నియంత్రణకు లైన్ క్లియర్ కానుందని, దీంతో 2025–26 నుంచి ఈ చట్టం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఒకటో తరగతికి ఆరేళ్ల మాటేమిటి?మరోవైపు ఒకటో తరగతిలో ప్రవేశానికి 6 సంవత్సరాల వయసు నిండి ఉండాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఈ నిబంధనల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. కానీ ఈ అంశంపైనా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మన రాష్ట్రంతో పాటు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు, కేరళ, హర్యానా సహా చాలా రాష్ట్ర ప్రభు త్వాలు ఈ వయస్సు ప్రమాణా లపై ఎలాంటి నిర్ణ యం తీసుకోని నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరం నాటికే ఈ అంశంపై స్పష్టత రానుందని అధి కారవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఒకటో తరగతి ప్రవేశానికి ఆరేళ్ల వయోపరి మితి నిబంధనతో జేఈఈ, నీట్ వంటి పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు నష్టం జరుగుతుందనే ప్రచారం ఉంది. కాగా, 2024–25 విద్యా సంవత్సరంలో ఐదేళ్ల వయోపరిమతి నిబంధనతోనే ప్రవేశాలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. -
కనీస ఫీజు రూ.45 వేలు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల పెంపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కాలేజీల యాజమాన్యాలతో అధికారుల చర్చలు మరో రెండురోజుల్లో ముగియనున్నాయి. తర్వాత ఈ నెలాఖరున జరిపే భేటీలో ఫీజుల పెంపుపై తుది నిర్ణయానికి వస్తామని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్ ఎఫ్ఆర్సీ) వర్గాలు తెలిపాయి. ఈ మేరకు తమ నివేదికను ప్రభుత్వం ఆమోదించి, ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని ఎఫ్ఆర్సీ అధికారులు చెప్పారు. ఇంజనీరింగ్ ప్రవేశాల నాటికి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే వీలుందని తెలిపారు. కనీస ఫీజు రూ.45 వేలకు పెంచే అవకాశం ఉందని, గరిష్టంగా 30 శాతం వరకు ఫీజులు పెరగవచ్చని తెలుస్తోంది. కాలేజీల వారీగా పెంపు! ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను చివరిసారిగా 2019లో ఖరారు చేశారు. ఇవి 2021–22 విద్యా సంవత్సరం వరకు అమల్లో ఉన్నాయి. కాగా 2022–23కు కొత్త ఫీజుల ఖరారుపై ఎఫ్ఆర్సీ గత రెండు నెలలుగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే కాలేజీల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతోంది. కాలేజీ వారీగా ఫీజుల పెంపుపై ముందుకెళ్ళే యోచనలో కమిటీ ఉంది. సంబంధిత యాజమాన్యాలు ఆదాయ, వ్యయాలపై సమర్పించిన ఆడిట్ నివేదికలను పరిగనలోనికి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సీబీఐటీ వంటి అగ్రశ్రేణి కాలేజీలు వార్షిక ట్యూషన్ ఫీజును రూ. 2.15 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశాయి. కానీ ఎఫ్ఆర్సీతో చర్చల అనంతరం రూ.1.71 లక్షలకు అంగీకరించినట్టు తెలిసింది. ఎంజీఐటీ కూడా రూ.1.90 లక్షలకు పెంచాలని కోరినప్పటికీ, ఎఫ్ఆర్సీ రూ.1.60 లక్షలకు ఒప్పుకున్నట్టు తెలిసింది. ఇవి కూడా ప్రభుత్వం అనుమతిస్తేనని కమిటీ స్పష్టం చేసినట్టు తెలిసింది. మిగతా కాలేజీల్లో కనీస ఫీజును రూ.35 వేల నుంచి రూ.45 వేలకు పెంచే అవకాశం ఉందని ఎఫ్ఆర్సీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఫీజులు గరిష్టంగా 30 శాతం వరకూ పెరిగే వీలుందని సమాచారం. గరిష్ట ఫీజు రూ.1.71 లక్షలు! రాష్ట్రంలో 158 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వీటిల్లో ప్రస్తుతం 20 కాలేజీల్లో మాత్రమే ట్యూషన్ ఫీజు రూ.35 వేలుగా ఉంది. పెంపునకు ప్రభుత్వం అంగీకరిస్తే ఇప్పుడది రూ.45 వేలకు పెరిగే వీలుంది. ఇక 110 కాలేజీల్లో రూ.80 వేల వరకు ఉండగా రూ.లక్ష దాటే అవకాశం కన్పిస్తోంది. మిగతా కాలేజీల్లో రూ.1.40 లక్షల నుంచి రూ.1.71 లక్షల వరకు పెరిగే వీలుందని ఎఫ్ఆర్సీ వర్గాలు అంటున్నాయి. సంబంధం లేని ఖర్చులూ ప్రతిపాదనల్లో.. పలు కాలేజీలు నిబంధనల్లో లేని లెక్కలను ఆడిట్ రిపోర్టులో చూపినట్టు ఎఫ్ఆర్సీ వర్గాలు చెబుతున్నాయి. కాలేజీల తప్పిదాల వల్ల విద్యార్థులు కోర్టుకెళితే, దానికయ్యే లీగల్ ఖర్చులను కూడా ఫీజు పెంపు ప్రతిపాదనల్లో పెట్టినట్టు తెలిసింది. వీటిని కమిటీ అనుమతించలేదు. కొన్ని కాలేజీలు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు రాకపోతే దానిపై కోర్టుకెళ్ళాయి. ఈ ఖర్చులనూ తమ ఆడిట్ రిపోర్టుల్లో పేర్కొన్నాయి. వీటిని కూడా ఎఫ్ఆర్సీ తిరస్కరించింది. రీయింబర్స్మెంట్ భారమెంత? రాష్ట్రంలో మూడు కాలేజీలు ఇప్పుడున్న కనీస ట్యూషన్ ఫీజును (రూ.35 వేలు) పెంచవద్దని ఎఫ్ఆర్సీని కోరాయి. ఫీజుల పెంపు నేపథ్యంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించాల్సి ఉంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలవుతోంది. ఎంసెట్‌లో 10 వేల లోపు ర్యాంకు వచ్చిన బీసీలకూ పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఆ తర్వాత ర్యాంకు వచ్చిన వారికి కళాశాల ఫీజు ఎంతున్నా గరిష్టంగా రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. కన్వీనర్ కోటా కింద ఏటా 48 వేల నుంచి 50 వేల మంది వరకు విద్యార్థులు చేరుతున్నారు. వారిలో సుమారు 70 శాతం వరకు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులవుతు న్నారు. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపు అనివార్యమైతే ఏ మేరకు భారం పడుతుందనేది ఆర్థిక శాఖ పరిశీలించాల్సి ఉంది. -
అసలు ట్యూషన్ ఫీజు అంటే..?
సాక్షి, హైదరాబాద్: లైబ్రరీ, ల్యాబ్, స్పోర్ట్స్‌కు గతంలో వేర్వేరుగా ఫీజులను వసూలు చేసిన కార్పొ రేట్, బడా ప్రైవేటు పాఠశాలలు ఇప్పుడు అన్నిం టినీ ట్యూషన్ ఫీజు కిందే వేస్తున్నాయి.. కరోనా కారణంగా ప్రజల జీవన పరిస్థితులు అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వం 2020–21 విద్యా సంవత్స రంలో ట్యూషన్ ఫీజులు మాత్రమే, అదీ నెల వారీగా తీసుకోవాలని జీవో 46ను జారీ చేసింది. ఇదే ఆసరాగా తీసుకున్న ప్రైవేటు యాజ మాన్యా లు.. ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్, ఇతరత్రా ఫీజు లను వేర్వేరుగా చూపించకుండా అన్నీ కలిపి ట్యూషన్ ఫీజు కిందే వేసి తల్లిదండ్రుల నుంచి వసూళ్లు చేస్తు న్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమైన 3 నెలల ప్రత్యక్ష బోధన కోసం సంవత్సరం ఫీజును ఇలా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఆలోచనల్లో పడింది. అందుకే ట్యూషన్ ఫీజు అంటే ఏంటి? అం దులో ఏమేం వస్తాయన్నది తేల్చేందుకు సిద్ధ మైంది. ఫీజుల వసూలు విధాన మెలా ఉండాలి? ఫీజుల నియంత్రణ ఎలా చేపట్టా లన్న అంశంపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, పాఠశాల విద్యాడైరెక్టర్ దేవసేన చర్చించారు. కొన్నేళ్లుగా డిమాండ్.. ప్రైవేటు స్కూళ్ల ఫీజులు నియంత్రించాలనే డిమాండ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే ఉంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజుల పెంపుపై తల్లిదండ్రులు ఆందోళన చేయడం, విద్యా శాఖ కొంత హడావుడి చేసి వదిలేయడం పరిపాటి అయింది. వీటికి తోడు న్యాయ వివాదాలతో ఫీజుల నియంత్రణ వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. 2009 ఉమ్మడి రాష్ట్రం నుంచే ఫీజుల నియంత్రణకు అప్పటి సర్కార్ చర్యలు చేపట్టగా.. వివిధ దశల్లో కోర్టు తీర్పుల నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఫీజుల నియంత్రణపై ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని 2017 ఏప్రిల్‌లో ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇటు తల్లిదండ్రులు, అటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించేందుకే అధిక సమయం పట్టింది. దీంతో 2017లోనే యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచేశాయి. ఇక 2018–19 విద్యా సంవత్సరం వరకు సమావేశాలు, నివేదిక రూపకల్పనతోనే గడిచిపోయింది. ఎట్టకేలకు 2018 ఫిబ్రవరిలో ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఆ నివేదిక ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,725 వరకు ప్రైవేటు స్కూళ్లున్నాయి. వాటిల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకే 31 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వారు కాకుండా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు మరో 7–8 లక్షల మంది వరకు చదువుతున్నట్లు అంచనా. అయితే వాటిల్లో ఫీజుల విధానం, వాటిపై నియంత్రణ అంటూ ఏమీ లేకుండాపోయింది. యాజమాన్యాలు నిర్ణయించిందే ఫీజు.. రూ.10 వేల నుంచి మొదలుకొని రూ.3.5 లక్షల వరకు వార్షిక ఫీజును వసూలు చేస్తున్న పాఠశాలలున్నాయి. 10 శాతం పెంపు అశాస్త్రీయం.. ఇక రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు 2016–17లో ఉన్న ఫీజులపై ఏటా ఫీజులను 10 శాతం లోపు పెంచుకోవచ్చని, అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని తిరుపతిరావు కమిటీ సిఫారసు చేసింది. ఇదే అసలు సమస్యగా మారింది. సదుపాయాలపై శాస్త్రీయ అంచనా లేకుండా ఏటా 10 శాతం ఫీజులను పెంచుకునేలా ఎలా సిఫారసు చేశారంటూ ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని ప్రభుత్వం ప్రశ్నించింది. తాజాగా విద్యాశాఖ వాటిపై ఆలోచనలు మొదలుపెట్టింది. ఆ సిఫారసుల్లోని లోపాలను తొలగించడంతో పాటు పక్కాగా ఫీజుల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం హైదరాబాద్ పరిసర జిల్లాల్లో డీఈవోలతోనూ కమిటీ వేసింది. ఫీజుల నియంత్రణకు ఎలాంటి విధానాలు అవసరమన్న దానిపై పక్కాగా, న్యాయ వివాదాలు తలెత్తకుండా ఎలా చర్యలు చేపట్టాలన్న దానిపై దృష్టి సారించింది. -
విద్యార్థులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి : కరోనా కష్ట కాలంలో విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ శుభవార్తను వినిపించారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.1800 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించామన్నారు. అంతేకాకుండా 2019-20 సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యారంగానికి సంబంధించిన పలు కీలక విషయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తావించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల తల్లి ఖాతాలోకే ఫీజు రియింబర్స్‌మెంట్ మొత్తాన్ని చెల్లిస్తాం పేర్కొన్నారు. గతంలో ఇంజనీరింగ్ విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ప్రభుత్వం రూ.35వేలు మాత్రమే ఇచ్చేదని, మిగతా డబ్బును కాలేజీలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు ఇస్తోందని వివరించారు. తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి 191 కాలేజీలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, వాటిని సక్రమంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుని, బ్లాక్ లిస్టులో పెడతామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. -
వైద్య ఫీజులకు ముకుతాడు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో ఫీజులను ఇకపై ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించనుంది. ఈమేరకు కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు నిర్వహించే వైద్య కళాశాలలతోపాటు యూజీ, పీజీ డెంటల్ కాలేజీలు, ఆయుష్ కోర్సులు నిర్వహించే కాలేజీలు, యూజీ, పీజీ, డిప్లొమో నర్సింగ్ కాలేజీలు, పారా మెడికల్ కాలేజీల ఫీజులను కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు. కమిషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ భార్గవరామ్, కార్యదర్శి ఎన్.రాజశేఖరరెడ్డితో కలసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు విద్యా సంవత్సరాలకు ఫీజులు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ వైద్య విద్యాసంస్థలన్నీ ఈనెల 27వతేదీ నుంచి ఫిబ్రవరి 29వ తేదీ లోగా ఫీజుల ప్రతిపాదనలను కమిషన్‌కు సమర్పించాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. 2020–21, 2021–22, 2022–23 విద్యా సంవత్సరాలకు ఫీజులను కమిషన్ నిర్ణయిస్తుందని వివరించారు. విద్యాసంస్థలు 2017–18, 2018–19 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ ఫైనాన్సియల్ నివేదికలు, ఇతర సమాచారాన్ని నిర్ణీత ప్రొఫార్మాలో కమిషన్‌కు https:// aphermc.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. ఫీజులను ప్రతిపాదించకపోయినా, స్పందించకపోయినా ఫీజుల వసూలుకు అనుమతించబోమని కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు. డిగ్రీ, పీజీ కాలేజీల ఫీజులను కూడా ఇకపై కమిషనే నిర్ణయిస్తుందని, వాటికి వచ్చే వారంలో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఇంజనీరింగ్, బీఈడీ, ఫార్మా కాలేజీల్లో ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయని, అనంతరం ఫీజులపై నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఫీజులు తగ్గుతాయా? పెరుగుతాయా? అనేది ఆయా కాలేజీల్లో వసతులు, సిబ్బంది, విద్యార్థుల సంఖ్య, హాజరు, ఉత్తీర్ణత వాస్తవిక స్థితిని బట్టి ఉంటుందని చెప్పారు. బయోమెట్రిక్, జియో ట్యాగింగ్.. ప్రతి కాలేజీలో విద్యార్ధులు, సిబ్బంది హాజరుకు బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేయడంతోపాటు జియో ట్యాగింగ్ ద్వారా ప్రభుత్వ సర్వర్‌కు అనుసంధానం చేయిస్తామని కమిషన్ చైర్మన్ తెలిపారు. యూజీసీ కూడా ఫీజులను ఆయా ప్రాంతాలు, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, కాలేజీల్లో వసతులు, బోధనా ప్రమాణాలు అనుసరించి వేర్వేరుగా ఉండాలని నిర్ణయించినందున కామన్ ఫీజు అన్నది ఉండదన్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లకు నిర్ణీత ఫీజు కంటే నాలుగైదు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నందున ఆ మేరకు కన్వీనర్ కోటా సీట్లలో ఫీజులను తగ్గించుకోవాలని యాజమాన్యాలకు సూచిస్తున్నామన్నారు. తప్పుడు నివేదికలిస్తే ప్రొఫెసర్లపైనా చర్యలు కాలేజీల్లో తనిఖీలు చేసి కమిటీలు ఇస్తున్న రిపోర్టులు తప్పుల తడకగా ఉంటున్నట్లు ఫిర్యాదులున్నాయని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రొఫెసర్లతో పాటు ఆయా వర్సిటీలపై చట్టపరమైన చర్యలు తప్పవని కమిషన్ చైర్మన్ హెచ్చరించారు. యూనివర్సిటీలు అఫ్లియేషన్ కోసం ఇచ్చే నివేదికలను కమిషన్‌కు కూడా అందించాలన్నారు. గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు కొన్ని కాలేజీలు ‘జగనన్న విద్యాదీవెన’ కింద ఇచ్చే రూ.20 వేలు తమకే ఇవ్వాలని విద్యార్ధులపై ఒత్తిడి తెస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి కళాశాలలపై చర్యలు తప్పవని కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు. ఇలాంటి అంశాలపై grievanceaphermc@gmail. com మెయిల్ ద్వారా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. 08645 274445 నంబర్‌కు ఫోన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. లేఖ ద్వారా పంపే ఫిర్యాదులను ‘కమిషన్ కార్యదర్శి, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్, రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్, థర్డ్ ఫ్లోర్, శ్రీమహేంద్ర ఎన్క్లేవ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా’ చిరునామాకు పంపాలన్నారు. రీయింబర్స్మెంట్ కోసం అక్రమాలు ‘కొన్ని చోట్ల మినహా పలు కాలేజీల్లో వసతులు లేవు. విద్యార్థులు రికార్డుల్లో మాత్రమే ఉన్నారు. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల కోసమే కొన్నిటిని కొనసాగిస్తున్నట్లు కనిపించింది’ అని జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. రీయింబర్స్మెంట్ కోసం ఇంటర్ పాసైన విద్యార్ధుల సర్టిఫికెట్లను దళారీల ద్వారా తెప్పించి రికార్డుల్లో చూపుతున్నారన్నారు. మైనార్టీ కాలేజీల్లో ఇకపై నాన్ మైనార్టీ విద్యార్థులను ఎంసెట్ ద్వారా చేర్చుకుంటేనే రీయింబర్స్మెంట్ ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నామని వివరించారు. -
ఫీజుల నియంత్రణకు ‘టోల్ ఫ్రీ’ నంబర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు ‘టోల్ ఫ్రీ’ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా కొనసాగుతున్న స్కూళ్లను అనుమతించవద్దని స్పష్టంచేశారు. అంగన్వాడీ కేంద్రాల్ని ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహించేలా సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు, ఇతర విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణపై సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఫీజులు షాక్ కొట్టేలా ఉన్నాయి ‘ప్రజలు మన నుంచి చాలా ఆశిస్తున్నారు. నాణ్యమైన విద్య, పాఠ్య ప్రణాళికలో నాణ్యతను కోరుకుంటున్నారు. అదే సమయంలో ఫీజులు తగ్గాలి. ఈ మూడు అంశాల్లో మార్పు రావాలి. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు షాక్ కొట్టేలా ఉన్నాయి. ఫీజుల్ని నియంత్రించేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయండి. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకున్నప్పుడు ఫోకస్ ఎక్కడ చేయాలో సులభంగా తెలుస్తుంది’ అని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం ప్రారంభం సందర్భంగా జనవరి 9న గ్రామాల్లోని స్కూళ్లలో పేరెంట్స్ కమిటీలు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వ్యాపారంగా మారిస్తే కఠిన చర్యలు విద్య వ్యాపారం కాదని.. చట్టాలు, నిబంధనల్ని ఉల్లంఘించి విద్యను వ్యాపారంగా మార్చే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. ‘విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. పేదల పిల్లలు మంచి కాలేజీల్లో, పెద్ద విద్యాసంస్థల్లో చదువుకోవాలి. ఈ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ కచి్చతంగా అమలు చేస్తాం. రీయింబర్స్మెంట్ కింద ఇవ్వాల్సిన డబ్బులను ప్రభుత్వం సకాలంలో అందచేస్తుంది. అదే సమయంలో ప్రమాణాలు, నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు చేపట్టాలి. ఉల్లంఘనలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకున్నప్పుడు వాటిని ప్రచారం చేయండి. అందువల్ల ఇతరులు ఆ తప్పులు చేయకుండా ఉంటారు. ఆటస్థలాలు లేని, అగ్ని ప్రమాదాల నివారణ ఏర్పాట్లు వంటి భద్రతా ప్రమాణాలు పాటించని స్కూళ్లను మూసివేయించాలి’ అని సీఎం సూచించారు. ఇంగ్లిష్ మీడియంపై దుష్ప్రచారం ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం తల్లిదండ్రులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారన్నారు. పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో ఉచితంగా చదువులు చెప్పిద్దామని ప్రయత్నిస్తుంటే.. అడ్డుకునేందుకు చాలామంది అనేక రకాలుగా ప్రయన్తస్తున్నారని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇంగ్లిష్ మీడియంను పేదవాళ్ల దగ్గరకు తీసుకెళ్తేనే ఈ వ్యవస్థలో మార్పులు వస్తాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటే చాలామంది తట్టుకోలేకపోతున్నారు. మద్యం దుకాణాలు, బార్లు తగ్గిస్తుంటే.. వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువులు చెప్పిస్తామంటే దానిపైనా విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేసేవారి మనవళ్లు, పిల్లలు ఏ మీడియంలో చదువుకున్నారు? చదువుకుంటున్నారు?’ అని సీఎం పేర్కొన్నారు. ఏపీని విద్యాధిక రాష్ట్రాంగా తీర్చిదిద్దాలంటే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని.. నాణ్యతా ప్రమాణాలు పెంచితేనే దేశంలో అగ్రస్థానంలో ఉండగలమని చెప్పారు. వలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగులను ప్రభుత్వపరమైన కార్యక్రమాలకు వాడుకోవాలని, టీచర్లను విద్యాబోధనకే వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్య, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల చైర్మన్లు జస్టిస్ ఆర్.కాంతారావు, జస్టిస్ వి.ఈశ్వరయ్య, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్లా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజుల నియంత్రణ.. ఓ పదేళ్ల పాత మాట
హైదరాబాద్ నగరం నడిబొడ్డున మంచి పేరున్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో వార్షిక ఫీజు రూ.78 వేలు మాత్రమే. ఇక సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే కనీస వార్షిక ఫీజు రూ.35 వేలే. అదే నగరంలోని ఆ కాలేజీకి రెండు కిలోమీటర్ల పరిధిలోని ఓ కార్పొరేట్ స్కూల్లో పదో తరగతి చదివే విద్యార్థి వార్షిక ఫీజు రూ.85 వేలు. అంటే ఇంజనీరింగ్ కంటే పదో తరగతి చదివే విద్యార్థి ఫీజే ఎక్కువ. పోనీ విద్యార్థులకు సదుపాయాలు, టీచర్ల వేతనాల విషయంలో ఇంజనీరింగ్ కాలేజీకంటే ఎక్కువగానే కల్పిస్తున్నారా? అంటే అదీ చెప్పలేని పరిస్థితే. కనీసం స్కూల్లోని విద్యా ర్థులందరికీ నాణ్యమైన విద్య అందుతోందా? అంటే అదీ లేదు. మొన్నటి పదో తరగతి పరీక్షల్లో ఆ స్కూల్‌కు చెందిన చాలామంది విద్యార్థులు ఫెయిలయ్యారు. అందులో శ్రీవర్ధన్ అనే విద్యార్థి ఉన్నాడు. అతని తండ్రి రాజేందర్‌రెడ్డి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఉద్యోగి. వరంగల్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన తన కొడుకును కార్పొరేట్ స్కూల్లో చేర్చాడు. అప్పులు చేసి మరీ చదివించినా ఫలితం లేకుండా పోయింది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇలా అనేకమంది తండ్రులు తమ పిల్లలను బాగా చది వించాలన్న తపనతో కార్పొరేట్, పేరున్న ప్రైవేటు స్కూళ్లలో చేర్చి ఆర్థికంగా అప్పులపాలు అవుతున్నారు. రాష్ట్రంలో 10,526 ప్రైవేటు పాఠశాలలు ఉంటే అందులో 30,77,884 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 3,487 కార్పొరేట్, టాప్ పాఠశాలలు ఐఐటీ, ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి 62 రకరకాల పేర్లతో రూ.లక్షల్లో కేపిటేషన్ ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. చివరకు నర్సరీ నుంచే ఐఏఎస్ పాఠాలు? అంటూ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ తంతు ఏళ్ల తరబడి కొనసాగింది.. కొనసాగు తూనే ఉంది. ఎలాంటి శాస్త్రీయత లేకుండానే ఫీజులు వసూలు చేస్తున్నా స్కూల్ ఫీజుల నియంత్రణ ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. 25 శాతం ఫీజుల పెంపు.. ప్రభుత్వం వద్దన్నా రాష్ట్రంలో ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్లు ఈసారి 25% వరకు ఫీజులను పెంచే శాయి. అయినా ఫీజుల నియంత్రణ రాష్ట్రంలో అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే కోర్టు కేసులు.. ఆ తర్వాత ఇష్టారాజ్యంగా పెంపు ఏటా ఇదే తంతు. పోనీ ఆ ఫీజుల వసూలు, పెంపులో ఏమైనా శాస్త్రీయత ఉంటుందా? అంటే అదీ లేదు. యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతున్నా అడ్డుకట్ట పడక తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలను బాగా చదివించాలన్న ఆశలతో అప్పులు చేసి మరీ ఫీజులను చెల్లించక తప్పడం లేదు. శాస్త్రీయత ఎక్కడ..? ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కాదు.. వాటి ఖరారులోనే శాస్త్రీయ విధానం లేదు. ప్రభుత్వాలు గత పదేళ్లుగా అనేక చర్యలు చేపట్టినా న్యాయ వివాదాల్లోనే అవన్నీ చిక్కుకున్నాయి. ఫీజులను కట్టడి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నా అధికారులు దానిని పక్కాగా చేపట్టేలా చేయడంలో విఫలం అవుతున్నారు. ఫలితంగా పలు సందర్భాల్లో వృత్తి విద్యా కాలేజీల తరహాలో ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి పాఠశాలల ఫీజులను నియంత్రించాలని, యాజమాన్యాల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను ఖరారు చేయాలనే ఆలోచన చేసినా, వాటిని పకడ్బందీగా చేయడంలో విఫలం కావడంతో ఆ ఉత్తర్వులు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో.. రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్ ఫీజుల నియంత్రణ ఒక్కోసారి ఒక్కో కారణంతో ఆగిపోతోంది. 2009లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జీవో 91, 92లను జారీ చేసింది. దాని ప్రకారం జిల్లా స్థాయిలో జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలను (డీఎఫ్ఆర్సీ) ఏర్పాటు చేసి ఫీజులను ఖరారు చేయాలని పేర్కొంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏటా గరిష్టంగా రూ.24 వేలు, ఉన్నత పాఠశాలల్లో రూ.30 వేలు ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేసుకోవచ్చని వెల్లడించింది. ఆ ఉత్తర్వులపై ప్రైవేటు పాఠశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. డీఎఫ్ఆర్సీల ఏర్పాటు సరిగ్గా లేదని, జిల్లా స్థాయిలో ఫీజుల ఖరారు కుదరదని 2010లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం జీవో 41, 42లను జారీ చేసింది. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే ఏడాదికి గరిష్టంగా రూ.9 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,800 వసూలు చేయాలని పేర్కొంది. ఉన్నత పాఠశాలల్లో పట్టణాల్లో రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10,800లకు మించి వసూలు చేయవద్దని పేర్కొంది. అయితే ఆ జీవోపైనా 2016లో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో వాటి అమలు ఆగిపోయింది. హైకోర్టులో పిల్.. ఆపై కమిటీ.. 2016లో ఫీజుల నియంత్రణపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. విద్యాశాఖ ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు అధికారుల కమటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదికను ప్రభుత్వానికి విద్యాశాఖ పంపించింది. ఆ తర్వాత ప్రభుత్వం మాజీ వైస్ చాన్స్‌లర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీని 2017 మార్చిలో నియమించింది. ఆ కమిటీ కూడా పలు సిఫారసులు చేసింది. ప్రైవేటు స్కూళ్లు ఏటా ఫీజులను 10 శాతంలోపు పెంచుకోవచ్చని, అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కమిటీ నివేదించడంతో ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టింది. దానిపై నిర్ణయం తీసుకునే వరకు ఫీజులను పెంచవద్దని 2018 ప్రారంభంలో ఉత్తర్వులు జారీ చేసింది. దానిపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఫీజుల నియంత్రణ ఆగిపోయింది. ఆదాయ వ్యయాలను బట్టి నిర్ణయించేలా? ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం పక్కా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలలు ఇష్టారాజ్యంగా కాకుండా పాఠశాలల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయించే వ్యవస్థను అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుడే ఫీజుల నిర్ణయం, వసూళ్లలో శాస్త్రీయత ఉంటుందని, ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులు నిర్ణయిస్తే భారం కూడా తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని పేర్కొంటున్నారు. -
విద్యాభివృద్ధిరస్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడం ద్వారా వాటి రూపురేఖలను పూర్తిగా మార్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూడు దశల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ మార్చాలని ఆదేశించారు. తొలి దశలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 ఉన్నత పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శనివారం విద్యా శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలి దశలో కచ్చితంగా ప్రతి పంచాయతీలో ఒక పాఠశాలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,750 పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలు గతంలో ఎలా ఉండేవో, సౌకర్యాలు మెరుగుపర్చిన తర్వాత ఎలా ఉన్నాయో వివరిస్తూ ‘నాడు–నేడు’ ఫొటోలను ప్రజలముందు ఉంచాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్య కమిటీలు రాష్ట్ర సర్కారు చేపట్టిన చర్యలతో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు వివరించారు. ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి 1,79,366 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరారని ముఖ్యమంత్రికి తెలియజేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ.. ప్రజలకు ప్రభుత్వం పట్ల ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా తరగతి గదులు లేవని, ఒకే గదిలో రెండు, మూడు తరగతులు నిర్వహించాల్సి వస్తోందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులు స్కూళ్లలో ఉండకూడదని సీఎం చెప్పారు. అవసరమైన చోట అదనపు తరగతి గదులు నిర్మించాలని, దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసి, వారి భాగస్వామ్యంతో అదనపు తరగతి గదుల నిర్మించాలన్నారు. వీలైనంత త్వరగా కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పాఠశాలల్లో పిల్లలకు రక్షిత తాగు నీరు సరఫరా చేయడానికి ప్రస్తుతమున్న ఆర్వో ప్లాంట్లను వినియోగించడంతో పాటు కొత్త ప్లాంట్ల ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు. దీనిపై ఒక ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పుడున్న ఆర్వో ప్లాంట్లను కచ్చితంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా విద్యార్థుల కోసం చేయాల్సిందే.. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యార్థులకు మంచి వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రస్తుతం కల్పిస్తున్న సదుపాయాలకు తోడు అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని, వాస్తవంగా ఎంత ఖర్చవుతుందో చూసి అంచనాలు రూపొందించాలని, బడ్జెట్ పెరిగినా ఫర్వాలేదని చెప్పారు. ప్రభుత్వం పాఠశాలలను బాగుచేసే పనిని అంకిత భావంతో పూర్తిచేస్తే అధికారులకే మంచి పేరు వస్తుందని అన్నారు. ప్రజలకు అందుబాటులోకి స్కూళ్లు రాష్ట్రంలో 276 ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు లేవని సమీక్షా సమావేశంలో అధికారులు వివరించారు. దీనిపై వెంటనే అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జనాభా ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరకపోవడం, అక్కడి పరిస్థితులపై స్వయంగా క్షేత్రస్థాయి పర్యటించి, అధ్యయనం చేయాలన్నారు. పాఠశాలలు గ్రామాలకు దూరంగా ఉంటే వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు ప్రారంభించాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులను నియమించాలని సీఎం ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున అందుకు అనుగుణంగా టీచర్ల ఎంపిక చేపట్టాలని అన్నారు. ఇప్పుడున్న టీచర్లకు మెరుగైన శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు అంజేయాలన్నారు. పాఠ్య ప్రణాళికలో(సిలబస్) చేపట్టాల్సిన మార్పులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినప్పటికీ తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుందని జగన్మోహన్రెడ్డి తేల్చిచెప్పారు. విద్యాశాఖ అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక గదిలో ఒక తరగతి స్కూళ్లలో ఒక గదిలో ఒక తరగతి మాత్రమే ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. తప్పనిసరిగా ఒక్కో తరగతికి ఒక టీచర్ ఉండేలా చూడాలన్నారు. లేకపోతే చేస్తున్న మనం చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం లేకుండా పోతుందని పేర్కొన్నారు. టీచర్ పోస్టుల ఖాళీలను గుర్తించి, వెంటనే వాటిని భర్తీ చేసేలా క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై రాజీ వద్దు పాఠశాల విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పిల్లలకు పెట్టే భోజనం నాణ్యత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడొద్దని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం సరుకుల పంపిణీ, వాటికి సంబంధించిన టెండర్ల ఖరారు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకే అప్పగించామని, భోజనంలో నాణ్యత ఉండేలా వారే చూడాలని చెప్పారు. రూ.కోటి విలువ దాటే ఏ టెండర్ అయినా ఆన్లైన్లో పెట్టాలని, దీనివల్ల ఎక్కువ మంది పోటీపడి, తక్కువ ధరలో టెండర్ ఖరారయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయదలచుకున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి అవసరమైన కాలేజీలను గుర్తించాలని ఆదేశించారు. విద్యారంగంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో పనులు ముఖ్యమంత్రి గతంలోనే జారీ చేసిన ఆదేశాల మేరకు విద్యాశాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఫొటోలను చిత్రీకరించింది. రాష్ట్రంలో 44,512 పాఠశాలలకు గానూ 42,655 పాఠశాలల ప్రస్తుత స్థితిగతులపై సంక్షిప్త వీడియోలు, ఫొటోలు సేకరించారు. ఈ ఫొటోలను అప్లోడ్ చేయడానికి ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటిదాకా మొత్తం 10.88 లక్షల ఫొటోలను అప్లోడ్ చేశారు. అంతేకాకుండా ప్రతి పాఠశాలలో ప్రాధాన్యతా క్రమంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్న దానిపై నివేదిక రూపొందించారు. ప్రాధన్యతా క్రమం.. 1. టాయిలెట్లు, బాత్రూమ్లు 2 యూనిట్ల చొప్పున. 2. ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు 3. తాగునీరు 4. ఇతర అవసరాల కోసం నీరు 5. ఫర్నీచర్ 6. తరగతి గదులకు రంగులు వేయడం 7. తరగతి గదులకు మరమ్మతులు 8. బ్లాక్‌బోర్డుల ఏర్పాటు విద్యా నవరత్నాలు విద్యాశాఖలో చేపడుతున్న మొత్తం కార్యక్రమాలను 9 భాగాలుగా అధికారులు విభజించారు. విద్యా నవరత్నాల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలియజేశారు. విద్యా నవరత్నాలు ఏమిటంటే.. 1. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన 2. స్కూళ్లలో బోధనా ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు పెంచడం 3. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం 4. తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధించడం 5. విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించడం 6. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచడం, సక్రమంగా అమలు చేయడం 7. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయుల నియామకం 8. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి పర్చడం 9. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు. ప్రైవేట్ స్కూళ్ల టీచర్ల స్థితిగతులను మెరుగుపర్చడం -
‘ఇంజనీరింగ్’ ఫీజు పెంపు దిశగా కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు పెంపు దిశగా కసరత్తు మొదలైంది. యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. కొత్త ఫీజులను ఖరారు చేసే వరకు కొంతమేర ఫీజు పెంచేందుకు అధికార వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఈనెల 29న యాజమాన్యాలతో సమావేశం నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీఎస్సీహెచ్ఈ), ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చర్యలు చేపట్టాయి. కొత్త ఫీజులను ఖరారు చేసేవరకు ఇప్పటివరకు వసూలు చేసిన ఫీజులనే అమలు చేయాలని కోరాలన్న నిర్ణయానికి వచ్చాయి. అయితే యాజమాన్యాలు అందుకు అంగీకరిస్తాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. 10 నుంచి 15 శాతం వరకు.. ఒకవేళ పాత ఫీజుల అమలుకు యాజమాన్యాలు ఒప్పుకోకపోతే ఎలా ముందుకు సాగాలన్న ఆలోచనలు ప్రభుత్వం ఇప్పటికే చేసింది. కాలేజీలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేస్తే మాత్రం తల్లిదండ్రులు తీవ్ర వ్యవతిరేకత వస్తుందన్న నిర్ణయానికి అధికారవర్గాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా కొంత మేర ఫీజు పెంపు (10 శాతం నుంచి 15 శాతం)నకు అంగీకరించాలన్న అలోచనల్లో అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఈనెల 29న ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో యాజమాన్యాల నిర్ణయం మేరకు ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ ఆధారపడి ఉంది. వాస్తవానికి ఈ నెల 27 నుంచే వెబ్ ఆప్షన్లను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కోర్టు తీర్పు కాపీ అందలేదని ప్రవేశాల కమిటీ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసింది. వచ్చే నెల 1 నుంచి 4వ తేదీ వరకు వెబ్ఆప్షన్లు స్వీకరించేలా షెడ్యూల్‌ను సవరించింది. ఒకవేళ యజమాన్యాలు అధికార వర్గాల ప్రతిపాదనలకు ఒప్పుకోకపోతే ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూల్‌ను మరికొన్నాళ్లు వాయిదా వేసి, ఫీజులను ఖరారు చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు సమాచారం. 10 నుంచి 15 రోజుల్లో ఫీజులను ఖరారు చేశాకే ముందుకు సాగే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక కోర్టు తీర్పు కాపీ బుధవారం రాత్రి అందింది. అది అందాక ఆగమేఘాలపై కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే శుక్రవారం నాడు కూడా అప్పీల్ చేయలేకపోయింది. కోర్టుకెళ్లిన కాలేజీలకు అదే తరహాలో.. మొదట కోర్టును ఆశ్రయించిన ఆరు కాలేజీల్లోనే యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాలని కోర్టు తీర్పునివ్వగా, అదే తీర్పును తమకు వర్తింపజేయాలని మరో 75 కాలేజీలు కోర్టుకు వెళ్లాయి. వాటికి కూడా కోర్టు అదే తీర్పును అమలు చేయాలని శుక్రవారం ఉత్తర్వులిచ్చినట్లు ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొన్నారు. ఇదిలాఉండగా ప్రభుత్వం గురువారం ఏఎఫ్ఆర్సీకి చైర్మన్‌ను నియమించింది. ఆయన ఇప్పటికిప్పుడు ప్రక్రియ చేపట్టినా ఫీజుల ఖరారుకు పది రోజుల సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే యాజమాన్యాలతో చర్చించేందుకు 29న సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. యాజమాన్యాలు అంగీకరించాకే వెబ్ ఆప్షన్లు.. యాజమాన్య ప్రతిపాదిత ఫీజుల్లో ఒక కాలేజీ అయితే రూ. 3.19 లక్షలు ప్రతిపాదించగా.. మరో కాలేజీ రూ. 2.80 లక్షలు, ఇంకో కాలేజీ 2.30 లక్షలు ప్రతిపాదించాయి. గతంలో రూ. 1.20 లక్షల లోపు ఉన్నవి ఈ ఫీజులను ప్రతిపాదించగా, గతంలో రూ. 80 వేల వార్షిక ఫీజున్న కాలేజీలు కూడా ఈసారి రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పైగా వార్షిక ఫీజును ప్రతిపాదించాయి. కొత్త ఫీజులను ఖరారు చేశాక హెచ్చు తగ్గులను సర్దుబాటు చేసుకునే వెసులుబాటున్నా అది అనేక సమస్యలకు కారణంగా అయ్యే పరిస్థితి వస్తుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ముందుగా ఫీజులను ఖరారు చేయాలనీ చెప్పిందని, తమ ప్రతిపాదనలకు యాజమాన్యాలు అంగీకరించకపోతే ఫీజులను ఖరారు చేశాకే వెబ్ ఆప్షన్లు, తదుపరి కౌన్సెలింగ్‌ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు కమిషన్
ఒంగోలు సిటీ: ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కమిషన్ వేస్తున్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డా.ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఆదివారం ఒంగోలులోని ఎన్నెస్పీ అతిథి గృహంలో రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకర్ల సమావేశంలో మంత్రి సురేష్ మాట్లాడారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో వసతులు, సౌకర్యాలను కమిషన్ పరిశీలించి నివేదిక ఇస్తుందని, ఆ నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించి ఆ తర్వాత అధిక ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రానున్న రోజుల్లో విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తామని, ఇందుకు సంబంధించి ముసాయిదా నివేదికను సీఎం పరిశీలనకు సమర్పించామని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ట్రిపుల్ ఐటీకి దూబగుంటలో స్థలం కేటాయించారని, భవనాల కోసం నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒంగోలు శివారు పేర్నమిట్టలో విశ్వవిద్యాలయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. త్వరలోనే డీఎస్సీ నియామకాలు డీఎస్సీ నియామకాలను త్వరలోనే చేపట్టబోతున్నామని మంత్రి సురేష్ వెల్లడించారు. వీలైనంత త్వరలోనే నియామకాలకు ప్రకటన జారీ చేయబోతున్నామని తెలిపారు. నవరత్నాలను చిత్తశుద్ధితో వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతోందని వివరించారు. -
‘ప్రైవేటు’ ఫీజులపై నియంత్రణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తల్లిదండ్రులకు భారంగా మారిన ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్ల ఫీజులను నియంత్రించేందుకు ‘రెగ్యులేటరీ కమిషన్’ను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేవడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బాలబాలికల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ స్కూళ్లలో చేరేందుకు అనువుగా వాటిని మరింత బలోపేతం చేయనున్నామని వివరించారు. విద్యా శాఖ మంత్రిగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఆ వెంటనే శాఖకు సంబంధించిన అధికారులతో వరుస సమీక్షలు చేపట్టారు. సోమవారం కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను కలువగా ప్రభుత్వ ప్రాథామ్యాల గురించి క్లుప్తంగా వివరించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను, ఎన్నికల మేనిఫెస్టోను తప్పక అమలు చేయడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. చదువులు పేదలపై భారంగా మారరాదన్నారు. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ల ఫీజుల నియంత్రణకు కమిషన్ వేయడంతో పాటు అర్హులైన పేదలందరినీ ‘అమ్మ ఒడి’ ద్వారా ప్రభుత్వం ఆదుకొంటుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామన్నారు. మాతృభాష తెలుగుకు ప్రాధాన్యతనిస్తూనే ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని వివరించారు. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టడం ద్వారా ప్లిల్లల చేరికలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా ఈ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని మంత్రి పేర్కొన్నారు. పార్టీ మేనిఫెస్టోను అధికారుల ఎదుట పెట్టి మంత్రి సమీక్ష విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు అంశాలపై మంత్రి సురేష్ చర్చించారు. నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని వారికి మంత్రి సూచించారు. పార్టీ మేనిఫెస్టోయే తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మంత్రి సురేష్ మేనిఫెస్టో కాపీని ఎదురుగా పెట్టుకొని అధికారులతో సమీక్ష నిర్వహించడం విశేషం. అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెడుతున్నందున దాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నారు. పాఠశాలలకు విద్యార్థులను రప్పించే కార్యక్రమం ‘బడికొస్తాను’ కార్యక్రమాన్ని ‘రాజన్న బడిబాట’గా పేరు మార్చాలని ఆదేశించారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డే స్కూల్ అమలు అంశంపై అధికారులు మంత్రికి వివరించారు. పాఠశాలల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో పదార్థాలు మరింత రుచికరంగా, పౌష్ఠికరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. విద్యార్థులకు పాఠశాలలు తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. 5 రోజుల పాటు ‘రాజన్న బడిబాట’ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరికలను పెంచేందుకు, ప్రతి ఒక్కరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఆదివారం ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఏపీటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాల నేతలు కె.వెంకటేశ్వరరావు, హృదయరాజులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రస్తావించగా.. మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఏపీటీఎఫ్ నేతలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘాలు విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చినట్టు తెలిపారు. -
స్కూల్ ఫీజుల నియంత్రణ ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాల గతేడాది ఒకటో తరగతికి రూ.45 వేలు వసూలు చేయగా, ఇపుడు ఆ విద్యార్థి రెండో తరగతికి వచ్చేసరికి రూ.53 వేలకు పెంచింది. కరీంనగర్‌లోని మరో ప్రైవేటు పాఠశాలలో గతేడాది ఎల్కేజీకి రూ.25 వేలు వసూలు చేయగా, ఈ సారి రూ.32 వేలకు పెంచుతున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ఈ రెండు పాఠశాలలే కాదు రాష్ట్రంలో ప్రముఖ ప్రైవేటు పాఠశాలలన్నీ 15 శాతం నుంచి 25 శాతం వరకు ఫీజులు పెంచాయి. ప్రభుత్వం వద్దన్నా.. కోర్టులో కేసు ఉన్నా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ తరగతుల్లోనే 25 శాతం వరకు ఫీజులను పెంచేశాయి. ఇతర తరగతుల్లోనూ ఫీజులను పెంచి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నాయి. ఏటా రాష్ట్రంలో స్కూల్ ఫీజులను యాజమాన్యాలు భారీగా పెంచుతున్నా ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టలేకపోతోంది. న్యాయ వివాదాలు ఇతరత్రా కారణాలతో రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఒక్కోసారి ఒక్కో కారణంతో.. రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్ ఫీజుల నియంత్రణ ఒక్కోసారి ఒక్కో కారణంతో ఆగుతోంది. 2017 జూన్ నుంచి ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టేలా పాఠశాల విద్యా శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, మార్గదర్శకాలు రూపొందించింది. అందులో జీవో–1 అమలుకు పక్కా చర్యలు చేపట్టేలా సిఫారసులు చేసింది. ఆ ఫైలును ఆమోదం కోసం 2016 డిసెంబర్లోనే ప్రభుత్వానికి పంపింది. అయితే ప్రభుత్వం దాన్ని పరిశీలించి శాస్త్రీయంగా ఫీజులు ఖరారు చేసేందుకు అవసరమైన సిఫార్సులు చేయాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీని 2017 ఏప్రిల్‌లో ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించేందుకు అధిక సమయం పట్టింది. ఎట్టకేలకు 2018 ఫిబ్రవరిలో కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ప్రభుత్వ ఉత్తర్వులపై కోర్టుకు.. ప్రైవేటు పాఠశాలల్లో పీజుల నియంత్రణకు ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. గతేడాది తిరుపతిరావు కమిటీ నివేదికను పరిశీలించి, న్యాయ సలహా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఫీజుల ఖరారు ఆలస్యం అవుతోందని భావించి ప్రైవేటు పాఠశాలలు 2018–19 విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచొద్దని అప్పటి విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. అనేక యజమాన్యాలు ఆ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఫీజుల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని, తిరుపతిరావు కమిటీ నివేదికపై పరిశీలన జరుపుతున్నామని ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే దానిపై తీర్పు ఇంకా వెలువడలేదు. దీంతో తాజాగా మళ్లీ ఫీజులు పెంచేందుకు ప్రైవేటు పాఠశాలలు ప్రయత్నిస్తున్నాయి. చెడు పేరు వస్తుందనే.. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు ఏటా ఫీజులను 10 శాతంలోపు పెంచుకోవచ్చని, అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదంటూ ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ చేసిన సిఫారసు కారణంగా ఆ నివేదికను ప్రభుత్వం పక్కన పడేసినట్లు తెలిసింది. అది ఫీజుల పెంపును సమర్థిస్తున్నట్లు ఉండటంతో దాన్ని ఆమోదిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఆలోచనతో ఆ నివేదికను పక్కనపెట్టింది. అనుమతి లేకుండా ఏటా 10 శాతం ఫీజులను పెంచుకునేలా ఎలా సిఫారసు చేశారంటూ ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని ప్రభుత్వం ప్రశ్నించింది. ద్రవ్యోల్బణం ఆధారంగా దాన్ని సిఫారసు చేసినట్లు, ఫీజులు ఎక్కువ ఉన్నాయని భావిస్తే విద్యా శాఖ అధికారులు పరిశీలించేలా సిఫారసు కూడా చేసినట్లు తెలిసింది. -
ఫీజుల పెంపుపై తీర్పు రిజర్వ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నిర్ధారించిన ఫీజులను ఎలాంటి ప్రాతిపదిక లేకుండా హైకోర్టు డివిజన్ బెంచ్ మార్పులు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తెలంగాణలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏఎఫ్ఆర్సీ ఆమోదించిన ఫీజుల కంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయా కళాశాలల పేరెంట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. వాసవీ కళాశాల తరపున సీనియర్ న్యాయ వాది ఫాలీ నారిమన్ వాదనలు వినిపించారు. 2015–16 విద్యా సంవత్సరాన్ని బేస్ ఇయర్‌గా తీసుకుని 2016–17 నుంచి 2018–19 వరకు మూడేళ్ల కాలానికి ఫీజులు నిర్ధారించారని, తాము 1.08 లక్షలు ప్రతిపాదించగా ఏఎఫ్ఆర్సీ రూ.86 వేలుగా నిర్ధారించిందని చెప్పారు. ఫీజును పెంచాలన్న తమ అభ్యర్థనను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నిరాకరించినా డివిజన్ బెంచ్ పరిగణనలోకి తీసుకుందని నివేదించారు. తాము పెట్టిన ఖర్చునే ఇవ్వమంటున్నామని, లాభాపేక్షతో ఎక్కు వ రుసుము ఆశించడం లేదని వాదించారు. పేరెంట్స్ అసోసియేషన్ తరఫున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. విద్యార్థులను ఫీజులు చెల్లించేలా ఒత్తిళ్లు చేశారని, పరీక్షలు రాయకుండా అడ్డుకున్నారని, నిరసనలు తెలిపిన వారిపై దాడులు చేయించారని తెలిపారు. జస్టిస్ అరుణ్‌మిశ్రా జోక్యం చేసుకుని ఫీజుల గణన తమ విధి కాదని, హైకోర్టు కూడా ఏ ప్రాతిపదికతో ఫీజు మార్చిందని ప్రశ్నించారు. ఏఎఫ్ఆర్సీ చేసిన గణన ప్రక్రియలో తప్పులుంటే దానిని సవాలు చేయొచ్చు గానీ.. మీరు సొంత పద్ధతిలో ఫీజులు ప్రతిపాదించుకోవడం, దానిని హైకోర్టు సమర్థించడం సరికాదన్నారు. ఫీజుల నిర్ధారణకు తీసుకోవాల్సిన అంశాలు, వాటిని బలపరిచే డాక్యుమెంట్లు, ఇవన్నీ పరిశీలించి ఏఎఫ్ఆర్సీ నిర్ధారిస్తుంది. మీరేం జత చేశారో, ఏం ప్రతిపాదించారో తెలియకుండా ఎలా మార్పులు చేస్తాం. ఏఎఫ్ఆర్సీ ఫీజు నిర్ధారణ∙ప్రక్రియలో తప్పులుంటే చెప్పండని ప్రశ్నించారు. మొత్తం ఖర్చుపై ఏటా పది శాతం ద్రవ్యోల్బణాన్ని జత చేయాలని, కానీ ఏఎఫ్ఆర్సీ కేవలం పెరిగిన ఖర్చుపై మాత్రమే ద్రవ్యోల్బణాన్ని జత చేస్తోందని మరో కళాశాల తరపు న్యాయవాది నివేదించారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. తెలం గాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయ వాది రాధాకృష్ణన్, పాల్వాయి వెంకటరెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. -
ఫీజులకు ముకుతాడు..
సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : వచ్చే మే 23వ తేదీ తరువాత రాష్ట్రంలో సువర్ణపాలనకు తొలి అడుగు పడనుందా!.. అవుననే అంటున్నాయి రాష్ట్రంలోని అన్ని వర్గాలు. ఇక జిల్లా ప్రజలదీ అదే మాట. 2014వ సంవత్సరంలో తాము చేసిన చిన్న పొరపాటు తమ జీవితాలను ఎంతగా ఛిద్రం చేసిందో ఆ పీడకలను మరిచిపోలేక పోతున్నామంటున్నారు. ముఖ్యంగా దేశ భవిష్యత్‌ను నిర్దేశించే విద్యా రంగానికి పట్టబోయే మహర్దశ గురించే చర్చ నడుస్తోంది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకువస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన సామాన్య ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుండగా, మేధావి వర్గాన్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలలో ఫీజుల నియంత్రణకు ఒక రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేసి పేదలకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకువస్తామని పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం హర్షణీయమని వివిధ వర్గాల ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా విచ్చలవిడిగా ఫీజుల రూపంలో సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఏకఛత్రాధిపత్యానికి గండికొట్టే ఇటువంటి చట్టం తీసుకురావడం విప్లవాత్మక మార్పులకు నాంది పలకబోతోందంటున్నారు. ప్రభుత్వ విద్యకు సమాంతరంగా ప్రైవేట్ విద్య తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్య అందించడం ద్వారా వారి బంగారు భవిష్యత్‌కు మార్గం సుగమం చేయాలనుకోవడం సహజం. అదే బలహీనతగా గ్రహించిన ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరిట దారుణ వసూళ్ళకు పాల్పడుతున్నాయి. మార్కులు, ర్యాంకుల మాయాజాలాన్ని సృష్టించి తమ విద్యా సంస్థలో చదివే విద్యార్థులకు ర్యాంకులతో పాటు మంచి భవిష్యత్ ఉంటుందని ప్రచారంతో ఊదరగొట్టి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. అలా ప్రారంభించిన విద్యా వ్యాపారం ప్రభుత్వ విద్యకు సమాంతరంగా ఎదిగే స్థాయికి చేరుకుంది. అంటే ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల సంఖ్య 55:45 నిష్పత్తికి చేరుకోవడాన్ని గమనిస్తే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ప్రభావం సమాజంపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో పరిస్థితి ఇదీ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, విద్యార్థుల సంఖ్య సమాంతరంగా ఉన్నాయనడానికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. జిల్లాలో 3,297 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 2,89,765 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ విద్యాసంస్థలు 1,201 ఉండగా వాటిలో 2,47,130 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో బాలురు 12,878 మంది ఉండగా బాలికలు 13,522 మంది ఉన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో 30,883 మంది బాలురు, 25,674 మంది బాలికలు ఉన్నారు. అంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో కన్నా ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఎంతో అధికంగా ఉన్నారంటే ప్రైవేట్ విద్యా సంస్థల ప్రభావం ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు. ఇక ఉన్నత పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో బాలురు 74,843 మంది, బాలికలు 82,358 మంది ఉండగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఇంచుమించు అదే స్థాయిలో బాలురు 77,773మంది, బాలికలు 60,880 మంది ఉన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి తరుణంలో జగన్ ప్రకటించిన నిర్ణయం అంతమంది విద్యార్థుల కుటుంబాల్లో వెలుగులు నింపనుంది. ఇప్పటి వరకూ ఆందోళన ఉండేది మాది సామాన్య పేద కుటుంబం. మా పిల్లలను స్కూల్‌కు పంపే వయసొస్తోంది. చదివించడానికి ఎన్ని లక్షలు పోయాలో అనే ఆందోళన ఉండేది. జగనన్న మా బెంగ తీర్చారు. ఇకపై కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువు కూడా మాలాంటి సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశం కలగడం శుభ పరిణామం. -కుందేటి గంగాధర్, దుర్గాదేవి దంపతులు కార్పొరేట్ విద్య ఊహకు కూడా భయపడేవాళ్ళం మా పిల్లలను కూడా అందరు పిల్లల్లానే కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించాలనే ఆశ ఉన్నా వాటి ఫీజుల గురించి విని ఆ చదువుకు ఊహించుకుంటేనే భయపడేవాళ్ళం. అటువంటిది ఫీజుల నియంత్రణ జరిగితే మా లాంటి మధ్యతరగతి పిల్లలకూ కార్పొరేట్ విద్య సాకారమౌతుంది. -మెరిపో రాజు, రత్నకుమారి దంపతులు విద్యారంగంపై స్పష్టమైన విధానం జగన్మోహన్రెడ్డికి విద్యా రంగంపై స్పష్టమైన విధానం ఉన్నట్లు అర్థమౌతోంది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి చెల్లుచీటీ పలికేలా జగన్ కీలక నిర్ణయం ఉంది. రాష్ట్రంలో సామాన్యులకు మంచి రోజులు రాబోతున్నాయి. – లక్కపోగు రవీంద్రబాబు ఫీజులు తగ్గితే అంతకన్నా కావలసింది ఏమిటి ప్రైవేట్ స్కూళ్ళలో ఎల్కేజీ నుంచే దాదాపు రూ. పది వేలకు పైగా వసూలు చేస్తున్నారు. వాటిపై నియంత్రణ జరిగితే ఫీజులు తగ్గుతాయి. ఫీజులు తగ్గితే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ విధానం అమలు జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే. – నారం లక్ష్మణరావు, లక్ష్మి దంపతులు -
అధిక ఫీజు వసూళ్లపై పిల్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని వాసవీ ఇంజనీరింగ్ కాలేజీ, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) సిఫారసు చేసిన ఫీజుల కంటే ఈ కాలేజీలు అధికంగా వసూలు చేస్తున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. వాసవీ కాలేజీ అధిక ఫీజులు వసూలు చేస్తోందంటూ ఆ కాలేజీ పేరెంట్స్ అసోసియేషన్ ఇదివరకే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర పిటిషన్‌ను దాఖలు చేసింది. రెండు పిటిషన్లను కలిపి ధర్మాసనం విచారించింది. ఏఎఫ్ఆర్సీ నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ధర్మాసనం ఇదివరకే పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని, విచారణను జనవరి 29కి వాయిదావేసింది. -
డిసెంబర్లో ఏఎఫ్ఆర్సీ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కాలేజీల్లో వచ్చే మూడేళ్ల ఫీజులను ఖరారు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 2016లో ఖరారు చేసిన ఫీజుల గడువు 2018–19 విద్యా సంవత్సరంతో ముగియడంతో..2019–20, 2020–21, 2021–22 విద్యా సంవత్సరాల్లో వివిధ కోర్సులకు ఏటా వసూలు చేయాల్సిన ఫీజులను నిర్ణయించేందుకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు ఏఎఫ్ఆర్సీ చైర్మన్‌గా పని చేసిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ స్వరూప్‌రెడ్డి పదవీకాలం గత డిసెంబర్‌తోనే ముగియగా, ఇపుడు కొత్త చైర్మన్‌ను నియమించాల్సి ఉంది. ఏఎఫ్ఆర్సీకి చైర్మన్ మినహా మిగతా కమిటీ సభ్యులంతా ఉన్నారు. దీంతో ఆ కమిటీ నేతృత్వంలో నోటిఫికేషన్ జారీ చేసి, మూడేళ్లలో కాలేజీల ఆదాయ వ్యయాలు, ఫీజుల పెంపుపై ప్రతిపాదనలు స్వీకరించాలని భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా ఉంది. సాధారణంగా ముగ్గురు హైకోర్టు రిటైర్డ్ జడీ ్జల పేర్లను ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిస్తే ఆయన అందులోని ఏదో ఒక పేరును ఖరారు చేస్తారు. -
ఎంసెట్‌కు ప్రైవేటు కాలేజీల ఎసరు!
-
ఎంసెట్‌కు ప్రైవేటు కాలేజీల ఎసరు!
ప్రత్యేక ఉమ్మడి పరీక్ష నిర్వహణకు కసరత్తు హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏకంగా ఎంసెట్‌కు ఎసరు పెట్టాయి. అంతేకాదు ఐసెట్, ఈసెట్ వంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఉనికినీ ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లనే కాదు ఇకపై కన్వీనర్ కోటానూ ఇష్టారాజ్యంగా భర్తీ చేసుకునేందుకు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు ఎంసెట్ స్థానంలో ‘ప్రైవేటు’గా ఉమ్మడి ప్రవేశ పరీక్షకు తెరలేపాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మైనారిటీ కాలేజీలు ప్రత్యేక ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఈ విధానాన్నే ఇకపై అన్ని ప్రైవేట్ కాలేజీలూ పాటించనున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ వర్గాలు కూడా ఆమోదం తెలిపాయి. ఈ మేరకు మంగళవారం జరిగిన ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) సమావేశంలో అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడటమే తరువాయి. ఆ వెంటనే ఈ విధానం అమల్లోకి రానుంది. దీంతో కన్వీనర్ కోటా సీట్లను కూడా ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా భర్తీ చేసుకునేందుకు వీలు చిక్కుతుంది. ఇప్పటికే 50కిపైగా ప్రైవేట్ కాలేజీలు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించుకునేందుకు అంగీకార పత్రాలు అందజేయగా మరిన్ని కాలేజీలు ఇదే బాటలో ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 715 ఇంజనీరింగ్ కాలేజీల్లో 650కిపైగా ప్రైవేటు కాలేజీలే ఉన్నాయి. వాటిల్లో కన్వీనర్ కోటాలోని 70 శాతం సీట్లను ప్రస్తుతం ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మేనేజ్మెంట్ కోటా సీట్లు మాత్రం జేఈఈ మెయిన్స్ మెరిట్, ఎంసెట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. అప్పటికీ సీట్లు నిండకపోతే ఇంటర్ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తున్నారు. అయితే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్‌లో అడ్మిషన్లు ఇచ్చేందుకు మైనారిటీ కాలేజీలకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో నాన్ మైనారిటీ కాలేజీలు కూడా ఇదే విధానం కోసం పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మంగళవారం జరిగిన ఏఎఫ్ఆర్సీ సమావేశంలో కన్వీనర్ కోటాలోని 70 శాతం సీట్లనూ యాజమాన్యాల కన్సార్షియం నిర్విహ ంచే ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేసుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. నియంత్రణ గాలికే.. ప్రైవేటు కాలేజీలే సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకుని ప్రవేశాలు చేపడితే నియంత్రణ కొరవడుతుందనే వాదనలు ఉన్నాయి. ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో ప్రత్యేకంగా నియమించే కన్వీనర్ ద్వారా పకడ్బందీగా ఎంసెట్ పరీక్ష నిర్వహించి, సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో కేంద్రీకృత విధానంలో 70 శాతం కోటా సీట్లకు పక్కాగా ప్రవేశాలు చేపడుతున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు కాలేజీలు నిర్వహించే పరీక్షకు శాస్త్రీయత ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రశ్నపత్రాలు లీకయ్యే అవకాశం ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేట్ విద్యా సంస్థలు తమకు నచ్చిన వారికి, డబ్బు ఎక్కువ ఇచ్చే వారికి ప్రశ్నలు లీక్ చేసి పరీక్ష నిర్వహించే ప్రమాదం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఎంసెట్ కోసం రూపొందించిన ప్రశ్నపత్రాల సెట్లలో ఇటీవల వినియోగించని సెట్‌ను తీసుకొని పరీక్ష నిర్వహించాలని మంగళవారం నాటి సమావేశంలో అధికారులు సూచించినా యాజమాన్యా లు అందుకు అంగీకరించలేదని సమాచారం. తమకు సమయమిస్తే 15 రోజుల్లో పరీక్ష నిర్వహించుకుంటామని పేర్కొన్నట్లు తెలిసింది. కాగా, యాజమాన్యాలు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టేందుకు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిందని ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నాయి. ఏఎఫ్ఆర్సీ కూడా గతంలోనే ఈ నిర్ణయం తీసుకుందని, ఇపుడు కొత్తగా తీసుకున్నదేమీ కాదని పేర్కొంటున్నాయి. దీంతో ఈసారి ప్రైవేట్ కాలేజీలకు ప్రత్యేక పరీక్ష విధానం పక్కాగా అమల్లోకి వచ్చే అవకాశముంది. విశ్వసనీయతను పెంచుకోవాలి ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అందుకే ప్రత్యేక పరీక్ష విధానాన్ని అమలు చేయాల్సి వస్తోంది. అయితే వారు ఎలా చేస్తారన్నది చూడాలి. ముందుగా వారి విశ్వసనీయతను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. చూస్తేగాని అర్థంకాదు. వారికి ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు చేసుకోవాలనే ఆలోచన ఉంది. ఎన్ని కాలేజీలు పరీక్షకు సిద్ధం అవుతాయనేది తేలాల్సి ఉంది. కన్వీనర్ కోటా సీటు వస్తుందనే నమ్మకం ఉన్న విద్యార్థులు ప్రభుత్వ సెట్స్ రాస్తారు . - ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఇక ప్రభుత్వ కాలేజీలకే ఎంసెట్! ఈ విధానం పక్కాగా అమల్లోకి వస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల కోసమే ఎంసెట్ తదితర సెట్స్ రాయాల్సి వస్తుంది. ఇది ప్రమాదకర పరిస్థితే. అయితే అది విజయవంతం కాకపోవచ్చు. మేనేజ్మెంట్ కోటా భర్తీకి కూడా ప్రత్యేక పరీక్షకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక పరీక్ష ద్వారా ఆ కాలేజీల్లో చేరితే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం సాధ్యంకాకపోవచ్చు. ప్రొఫెసర్ ఎంవీ రమణారావు, ఎంసెట్ కన్వీనర్