విజయవాడలో విద్యాశాఖ అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తల్లిదండ్రులకు భారంగా మారిన ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్ల ఫీజులను నియంత్రించేందుకు ‘రెగ్యులేటరీ కమిషన్’ను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేవడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బాలబాలికల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ స్కూళ్లలో చేరేందుకు అనువుగా వాటిని మరింత బలోపేతం చేయనున్నామని వివరించారు. విద్యా శాఖ మంత్రిగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఆ వెంటనే శాఖకు సంబంధించిన అధికారులతో వరుస సమీక్షలు చేపట్టారు. సోమవారం కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో అధికారులతో సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను కలువగా ప్రభుత్వ ప్రాథామ్యాల గురించి క్లుప్తంగా వివరించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను, ఎన్నికల మేనిఫెస్టోను తప్పక అమలు చేయడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. చదువులు పేదలపై భారంగా మారరాదన్నారు. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ల ఫీజుల నియంత్రణకు కమిషన్ వేయడంతో పాటు అర్హులైన పేదలందరినీ ‘అమ్మ ఒడి’ ద్వారా ప్రభుత్వం ఆదుకొంటుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామన్నారు. మాతృభాష తెలుగుకు ప్రాధాన్యతనిస్తూనే ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని వివరించారు. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టడం ద్వారా ప్లిల్లల చేరికలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా ఈ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని మంత్రి పేర్కొన్నారు.
పార్టీ మేనిఫెస్టోను అధికారుల ఎదుట పెట్టి మంత్రి సమీక్ష
విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు అంశాలపై మంత్రి సురేష్ చర్చించారు. నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని వారికి మంత్రి సూచించారు. పార్టీ మేనిఫెస్టోయే తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మంత్రి సురేష్ మేనిఫెస్టో కాపీని ఎదురుగా పెట్టుకొని అధికారులతో సమీక్ష నిర్వహించడం విశేషం. అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెడుతున్నందున దాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నారు. పాఠశాలలకు విద్యార్థులను రప్పించే కార్యక్రమం ‘బడికొస్తాను’ కార్యక్రమాన్ని ‘రాజన్న బడిబాట’గా పేరు మార్చాలని ఆదేశించారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డే స్కూల్ అమలు అంశంపై అధికారులు మంత్రికి వివరించారు. పాఠశాలల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో పదార్థాలు మరింత రుచికరంగా, పౌష్ఠికరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. విద్యార్థులకు పాఠశాలలు తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
5 రోజుల పాటు ‘రాజన్న బడిబాట’
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరికలను పెంచేందుకు, ప్రతి ఒక్కరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఆదివారం ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఏపీటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాల నేతలు కె.వెంకటేశ్వరరావు, హృదయరాజులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రస్తావించగా.. మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఏపీటీఎఫ్ నేతలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘాలు విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment