
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే నమ్మకం, విశ్వసనీయత అని, తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అదే కోవలో ప్రజల్లో విశ్వసనీయత, నమ్మకాన్ని పొందారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఆలిండియా బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దాని వ్యవస్థాపకుడు జస్టిస్ ఈశ్వరయ్య అధ్యక్షతన బుధవారం సామాజిక న్యాయం అంశంపై జాతీయ స్థాయి వెబినార్ జరిగింది. ముఖ్య అతిథిగా తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు ఆర్‌జేడీ నేత తేజస్వియాదవ్, పలువురు ఎంపీలు, ఎన్జీవో సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాలూ విద్యకు పెద్దపీట వేస్తున్నాయని చెప్పారు. విద్యకోసం చేసే ఖర్చు రానున్న తరాల భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి అనేది సీఎం జగన్ భావజాలమని మంత్రి వివరించారు. ఏపీలో రాజకీయ పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తూ 50 శాతం మహిళలకు కేటాయించటమేగాక.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. మంత్రివర్గంలోనూ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు.