సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న విద్యారంగ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలతోపాటు విద్యారంగం పటిష్టతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై అంతర్జాతీయ విద్యా సదస్సులో ప్రశంసల జల్లు కురిసింది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలు అందరికీ ఆదర్శప్రాయం, అనుసరణీయమని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అభివర్ణించారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించాలని తాము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 17 వరకు నిర్వహించిన అంతర్జాతీయ విద్యాసదస్సు 2020–21 ముగింపు సమావేశం ఆదివారం జరిగింది. దీనికి వివిధ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, జాతీయ, అంతర్జాతీయ విద్యారంగ నిపుణులు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు.
సిసోడియా ఏమన్నారంటే..
ఈ సందర్భంగా మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాల గురించి చాలా మంచి విషయాలు విన్నాను. ఢిల్లీలో గత ఐదేళ్లుగా జరుగుతున్న విద్యా కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి పలు టీమ్‌లు ఢిల్లీకి ఇంతకుముందు వచ్చాయి. ఆ టీమ్‌లు అధికారులు చెబితే తతూమంత్రంగా వచ్చి వెళ్తున్నాయా లేక పొలిటికల్ నేతల చిత్తశుద్ధి కారణంగా వచ్చాయా అని తెలుసుకోవడానికి నేనే ఆ టీమ్‌లతో నేరుగా భేటీ అయ్యాను. ఏపీ టీమ్‌లోని అధికారులతో మాట్లాడినప్పుడు అక్కడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధిని గమనించాను. ఇంతకుముందు అధికారులు సమావేశమై తమ ఆలోచనలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సమావేశంలో నేరుగా ఏపీ, ఢిల్లీ మంత్రులం నేరుగా మాట్లాడుకోవడం, ఇతరులు కూడా వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా దేశంలోని విద్యావ్యవస్థ మరింతగా బలోపేతమయ్యేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఏపీ, ఢిల్లీ మధ్య ఏర్పడిన ఈ విద్యా విషయ బంధం దేశానికి రోల్ మోడల్ అవుతుంది. ఏపీకి రావాలని మీరు పిలిచినప్పుడు (మంత్రి ఆదిమూలపు సురేష్ ఆహ్వానాన్ని ఉద్దేశించి) ఎంతో ఆనందం కలిగింది. మా సెక్రటరీ నా దగ్గరకు వచ్చి ఏపీకి వెళ్లాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాం. వెంటనే వెళ్దాం అన్నారు. మీ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం’ అన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన విద్యా సదస్సులో పాల్గొన్న ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు
సంస్కరణలతోనే సత్ఫలితాలు: ఆదిమూలపు
సదస్సులో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘సంస్కరణల అమలుతో మంచి ఫలితాలొచ్చాయి. 19 నెలల కాలంలోనే విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులతో అనేక మంచి ఫలితాలు చూస్తున్నాం. విద్యార్థుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యావసతి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు కాగా.. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 16 నుంచి 18 శాతం అంటే రూ.35 వేల కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగానికి కేటాయించారు. అందువల్లే అతి తక్కువ కాలంలోనే ఎన్నో మంచి ఫలితాలు సాధించగలుగుతున్నాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment