ఆన్‌లైన్‌ అడ్మిషన్ల నుంచి మినహాయింపులుండవ్ | Adimulapu Suresh Comments About Inter Online Admissions | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ అడ్మిషన్ల నుంచి మినహాయింపులుండవ్

Published Sun, Nov 1 2020 3:11 AM | Last Updated on Sun, Nov 1 2020 4:21 AM

Adimulapu Suresh Comments About Inter Online Admissions - Sakshi

సాక్షి అమరావతి: ఇంటర్మీడియెట్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల నుంచి ఏ కాలేజీకీ మినహాయింపు లేదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఇంటర్మీడియెట్‌ విద్యను గుప్పెట్లో పెట్టుకుని అరాచకాలు చేశాయన్నారు. వీటిని ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని, విద్యా వ్యాపారాన్ని ఉక్కుపాదంతో అణచి వేస్తామని హెచ్చరించారు. శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఇంటర్‌ విద్య సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందని, రూ.లక్షల్లో ఫీజులు చెల్లించే వారికే అక్కడ విద్య అన్నట్లుగా మారిందని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు విద్యను అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. పారదర్శకత, అవినీతి రహితంగా ఉండేలా ఇంటర్మీడియెట్‌ విద్యను తీర్చిదిద్దుతుంటే కార్పొరేట్‌ సంస్థలకు రుచించడం లేదని, జీవో–23 తెస్తే అడ్డుకోవాలని చూస్తున్నాయని అన్నారు.

ఆన్‌లైన్‌ విధానం వల్ల సీట్లు అందుబాటులో ఉండవని, విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు పోతున్నారనే ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్‌ కాలేజీలు 647 ఉన్నాయని.. వీటిలో 2,07,040 సీట్లు, 598 కేజీబీవీ, సంక్షేమ శాఖల కాలేజీల్లో 47,840 సీట్లు ఉన్నాయని తెలిపారు. మొత్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే 2,54,880 సీట్లు ఉన్నట్టు చెప్పారు. ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ కాలేజీల్లో జనరల్‌ ఇంటర్‌ సీట్లు 2,59,400, ఒకేషనల్‌ కాలేజీల్లో 26,100 సీట్లు ఉన్నాయని వివరించారు. అదనంగా 561 చోట్ల కొత్త కాలేజీల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇచ్చామని, ఇప్పటికే 150 కాలేజీలకు అనుమతిచ్చామని చెప్పారు. వీటిద్వారా 43,400 సీట్లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. టెన్త్‌ పాసైన వారు 6,31,274 మంది ఉండగా 5,83,780  ఇంటర్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 

611 కాలేజీలకు అనుమతులు ఇవ్వడం లేదు
రేకుల షెడ్లు, షాపింగ్‌ కాంప్లెక్సులలో అరకొర వసతులతో సాగే 611 కాలేజీలకు అనుమతులు ఇవ్వడం లేదని మంత్రి చెప్పారు. రూ.లక్షల్లో ఫీజులు కనీస వసతులు కల్పించకుండా ఒక్కో గదిలో 150 నుంచి 200 మందిని ఉంచి పాఠాలు చెప్పడాన్ని కొనసాగించలేమని, అందుకే తరగతికి 40 మంది మాత్రమే ఉండేలా చేస్తున్నామని తెలిపారు. కొన్ని కాలేజీలు లోపాలను సవరించుకునేందుకు సమయం అడిగాయని.. అలాంటి వాటికి అనుమతిస్తున్నామని చెప్పారు. ఆన్‌లైన్‌ విధానం వల్ల ప్రతి ప్రైవేట్‌ కాలేజీలో రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. 

రేపటి నుంచి బడి గంటలు
సోమవారం నుంచి బడి గంటలు మోగనున్నాయని.. స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభం అవుతాయని సురేష్‌ ప్రకటించారు. కోవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో విద్యాసంస్థలను ప్రారంభించనున్నామని వివరించారు. 2021 విద్యా సంవత్సరాన్ని ఆగస్టుకల్లా పూర్తిచేసేలా షెడ్యూల్‌ రూపొందించామని, సెలవులను తగ్గిస్తూ ఆయా అంశాల బోధన ఉండేలా చూస్తున్నామని చెప్పారు. స్కూళ్లలో బేస్‌లైన్‌ పరీక్ష నవంబర్‌ మొదటి వారం నుంచి, ప్రాజెక్టు ఆధారిత పరీక్షలు నవంబర్‌ చివరి వారంలో, ఫార్మెటివ్‌ అసెస్మెంట్‌–1 డిసెంబర్‌ చివరి వారం నుంచి, ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌–2 ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహిస్తామని వివరించారు. సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ ఏప్రిల్‌ చివరి వారంలో ఉంటుందన్నారు. 180 రోజుల్లో 143 పని దినాలు తరగతి బోధన, మిగిలినవి ఇంటి పని దినాలుగా ఉంటాయని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement